● ఘటనలో గాయపడిన భార్య, భర్త, ఇద్దరు పిల్లలు ● మహిళ పరిస్థితి విషమం
శావల్యాపురం: ప్రార్థన మందిరానికి బయలు దేరిన కుటుంబ సభ్యులు రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలైన సంఘటన మండలంలోని కనమర్లపూడి గ్రామసమీపాన జాతీయ రహదారి మార్గంలో పెదకంచర్ల వంతెన వద్ద ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు మేరకు విశాఖపట్టణం నుంచి శ్రీశైలంకు నలుగురు అయ్యప్ప మాలధారణ భక్తులు ఏపీ 39యూటీ1997 నంబరు కారులో బయలు దేరారు. అదేక్రమంలో మండలంలోని బొందిలిపాలెం గ్రామం ఎస్సీ కాలనీకు చెందిన సుంకర ఎర్రయ్య, భార్య ఆదిలక్ష్మి (బుజ్జి) వారి పిల్లలు అభి, చక్రి నలుగురు కలిసి వినుకొండ వైపునకు చర్చికి ప్రార్థనకు బైకుపై వెళుతుండగా ఒక్కసారిగా కారు అతి వేగంతో బైకును ఢీకొట్టింది. దీంతో కొన్ని అడుగుల ఎత్తులో లేచి ఒక్కసారిగా రోడ్డుపై ఎర్రయ్య, తన పిల్లలు పడిపోగా పక్కనే ఉన్న కాల్వలో ఆదిలక్ష్మి పడిపోయింది. గమనించిన స్థానికులు క్షతగాత్రులకు సహాయ చర్యలు చేపట్టి అనంతరం 108 అత్యవసర వాహనికి ఫోన్ చేసి సమాచారం అందించగా నిమిషాల వ్యవధిలో సంఘటన స్థలానికి చేరుకొన్న అంబులెన్స్ వారికి ప్రాథమిక చికిత్స అనంతరం వినుకొండలోని ఒక ప్రైవేటు వైద్యశాలకు తరలించింది. రోడ్డు ప్రమాదంలో ఇరువురు చిన్నారులకు స్వల్ప గాయాలు కాగా, ఎర్రయ్య కంటి భాగంలో తీవ్ర గాయమైంది. ఆదిలక్ష్మికి కుడి చేయి విరిగిపోగా, పైనుంచి పడపోవటంతో కుప్పకూలిపోయింది. ఆదిలక్ష్మి పరిస్థితి విషమంగా ఉందని కుటుంబసభ్యులు తెలిపారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.