
చుండూరు(వేమూరు): మహిళల ఆర్థికాభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేదపీట వేస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. చుండూరు మండలంలోని మండూరు గ్రామ సచివాలయంలో శనివారం జగనన్న సురక్ష క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అధ్యక్షత వహించారు. మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో 99 శాతం పూర్తి చేశారన్నారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందజేసేందుకే జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో మహిళలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చేందే విధంగా ముఖ్యమంత్రి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జగనన్న సురక్ష కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ ప్రజల ముగింటకు సేవలు అందేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వివిధ కారణాల వల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందలేని అర్హులకోసం ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో ప్రజలకు ఉచితంగా సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో రేపల్లె ఆర్డీఓ పార్థసారధి, నియోజక వర్గం ప్రత్యేకాధికారి బొంత ఆంజనేయులు, చుండూరు ఎంపీపీ జాలాది రూబేను చుండూరు తహసీల్దార్ కనకదుర్గ, ఎంపీడీఓ సుగుణమ్మ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
మంత్రి మేరుగ నాగార్జున జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాతో కలిసి సర్టిఫికెట్లు అందజేత