AP Special: బెలూం గుహలను చూసొద్దాం రండి..!

Special Story On Belum Caves - Sakshi

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన  గుహలు

ప్రపంచంలోనే రెండవ అంతర్భూభాగ గుహలు

కోవెలకుంట్ల: భారతీయ సంస్కృతిలో గుహలు దేవుళ్లు, దేవతలకు నివాసమనే నమ్మకం వల్ల ఆ గుహలు పవిత్ర స్థలాలుగా విలసిల్లుతున్నాయి. కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం సమీపంలో ప్రపంచంలోనే రెండవదిగా భారతదేశంలోనే పొడవైన అంతర్భాభాగ గుహలుగా బెలూం గుహలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచాయి. సుమారు 23 ఎకరాల విస్తీర్ణంలో సాగు భూమి లోపల, భూమికి సమాంతరంగా ఇక్కడ గుహలు ఏర్పడటం ప్రత్యేకత. ఈ గుహలలో క్రీ.పూ. 450 సంవత్సరాల కాలం నాటి మట్టి పాత్రలో మనిషి అస్థికలు, రాతి కత్తి లభ్యం కావడంతో ఈ గుహలను  ఆనాటి మానవులు నివాస స్థలాలుగా వినియోగించుకున్నట్లు చరిత్రకారులు పేర్కొంటున్నారు. 

గుహల ఉనికిని చాటిన ఆంగ్లేయుడు:
1884వ సంవత్సరంలో హెచ్‌బీ ఫూటే అనే ఆంగ్లేయుడు మొదటిసారిగా బెలూం గుహల ఉనికిని చాటాడు. తర్వాత 1982–1984 శీతాకాలాల్లో హెచ్‌డీ గేబర్‌ అనే జర్మనీ దేశస్తుడు సహచరులతో కలిసి 3225 మీటర్ల వరకు శోధించి ఒక పటాన్ని తయారు చేశాడు. వీరికి స్థానికులైన అప్పటి రిటైర్డ్‌ ఎస్పీ చలపతిరెడ్డి, ఆయన అల్లుడు రామసుబ్బారెడ్డి పూర్తి సహకారం అందించారు. 1988వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌ పురాతత్వ శాఖ గుహలను రక్షిత స్థలంగా ప్రకటించి అప్పటి నుంచి కొన్నేళ్లపాటు కాపలాదారుని నియమించింది.

గుహలోని శివలింగాలు

1999వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖ బెలూం గుహలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు వీటి నిర్వహణను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంది. సొరంగ మార్గాల్లో ఒకటిన్నర కిమీ పొడవున మట్టి దిబ్బలను తొలగించి నాపరాళ్లు పరిచి నడక దారిని ఏర్పాటు చేశారు. సొరంగ మార్గాల్లో 150 విద్యుద్దీపాలతో కాంతివంతం చేశారు. గుహల లోపలకు గాలిని పంపు బ్లోయర్లు ఏర్పాటు చేశారు. 2003వ సంవత్సరం నుంచి బెలూం గుహల సందర్శనకు పర్యాటకులను అనుమతిస్తున్నారు.
 
 బెలూం గుహలు ఏర్పడిన ప్రదేశం

బెలూం గుహల్లో చూడదగిన ప్రదేశాలు:
బెలూం గుహల్లో 40 మెట్లు దిగిన తర్వాత 10 మీటర్ల లోతులో మొదలై 30 మీటర్ల లోతు వరకు ఉన్న ఈ సొరంగాలు కొన్ని చోట్ల ఇరుకుగాను, మరికొన్ని చోట్ల విశాలమైన గదులుగాను ఉండి కొన్నిచోట్ల స్టాలక్‌టైట్లు, స్టాలగ్మైట్లు అనబడే స్పటికాకృతులు ఏర్పడి ఉన్నాయి. ఈ కృత్రిమ శిలల ఆకృతుల ఆధారంగా కొన్ని ప్రదేశాలను వేయి పడగలు, కోటి లింగాలు, ఐరావతం, ఊడలమర్రి, మాయా మందిరం, వంటి పేర్లు పెట్టారు. ఇవి కాకుండా ధ్యాన మందిరం, మండపం, కప్పులో ఉన్న బొంగరపు గుంతలు, గుహల చివరి వరకు పోతే పాతాళ గంగ అనే నీటి మడుగు అక్కడే రాతిలో మలచిన శివలింగం ఉన్నాయి. విద్యుద్దీప కాంతులతో ఈ సొరంగ సోయాగాలను తిలకిస్తూ, సొరంగాలు పయనిస్తూ ఉంటే మరో ప్రపంచంలో ఉన్నట్లు సందర్శకులను గుహలు మైమరపిస్తున్నాయి.

 బెలూం గుహలోకి వెళ్లే ద్వారం

భూగర్భంలో దాగి ఉన్న ఊహాతీతమైన పకృతి సౌందర్యాలు పోయినంత దూరం సందర్శకులకు ఆహ్లాదాన్ని ఇస్తున్నాయి. గుహ లోపల సంవత్సరం పొడవున 33 డిగ్రీల దాదాపు స్థిరమైన ఉష్టోగ్రత ఉండి గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బెలూం గుహలను తిలకించేందుకు సందర్శకులకు అనుమతి ఉంది. కాగా  ఆదివారాలు,  ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు రోజుల్లో బెలూం గుహలకు సందర్శకుల తాకిడి అధికంగా ఉంటుంది.

గుహలోని పాతాళ గంగ

రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక, తెలంగాణా, తమిళనాడు రాష్ట్రాలతో పాటు విదేశీయులు బెలూం గుహలను సందర్శిస్తున్నారు. సందర్శకులు బెలూం గుహలను తిలకించేందుకు వస్తుండటంతో టూరిజం శాఖకు ప్రతి ఏటా రూ. 1.79 కోట్ల ఆదాయం చేకూరుతోంది. గుహలను సందర్శనకు వచ్చే ప్రజల నుంచి పెద్దలకు రూ. 65, పిల్లలకు రూ. 45 ప్రకారం టికెట్‌ వసూలు చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి గుహల సందర్శనకు వచ్చే వారికి గుహల ప్రాముఖ్యత తెలియజేసేందుకు ఇక్కడ  తమిళం, కన్నడ, హిందీ భాషలు తెలిసిన తెలుగు గైడ్లు అందుబాటులో ఉన్నారు. జిల్లాలో ఉన్న పర్యాటక ప్రదేశాల కంటే బెలూం గుహల నుంచి టూరిజం శాఖకు అధిక ఆదాయం చేకూరుతుండటం విశేషం.

బెలూం గుహలకు ఇలా చేరుకోవాలి:
కర్నూలు నుంచి ఓర్వకల్లు, బేతంచెర్ల, బనగానపల్లె మీదుగా 110 కిమీ ప్రయాణించి బెలూం గుహలను చేరుకోవాలి.
అనంతపురం నుంచి తాడిపత్రి మీదుగా 80 కిమీ దూరంలో బెలూం గుహలు ఉన్నాయి
చెన్నై నుంచి 420 కిమీ
బెంగుళూరు నుంచి 280 కిమీ
తిరుపతి నుంచి 275 కిమీ దూరంలో బెలూం గుహలు  ఉన్నాయి.

Read latest AP Special News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top