ప్రేమ వివాహం.. 36 ఏళ్లుగా కుటుంబం వెలివేత

Kurnool Koilkuntla Due To Love Marriage Family Expelled From Caste 36 Years Ago - Sakshi

ప్రేమ పెళ్లిని వ్యతిరేకిస్తూ కుటుంబాన్ని వెలేసిన పంచాయితీ పెద్దలు

మూడు దశాబ్ధాలకుపైగా కొనసాగుతున్న కట్టుబాటు

వెలేసిన కుటుంబానికి సహరిస్తే రూ. 5వేలు జరిమాన

పెదరాయుడు తీర్పు తరహాలో కొనసాగుతున్న కట్టుబాటు

పంచాయితీ పెద్దల తీర్పుతో నిలిచిపోయిన పెద్దకర్మలు

కోవెలకుంట్ల: ప్రేమించి ప్రేమ వివాహం చేసుకున్న ఓ వ్యక్తిని కుల పెద్దలు ఆ సామాజిక వర్గం నుంచి వెలివేయడంతోపాటు సినిమాలో పెదరాయుడు తరహాలో ఇచ్చిన తీర్పును మూడు దశాబ్ధాల నుంచి కొనసాగిస్తున్నారు. తమ కుటుంబాన్ని కులంలో చేర్చుకోవాలని బాధితులు గత 36 సంవత్సరాల నుంచి న్యాయపోరాటం చేస్తున్నా ఫలితం దక్కలేదు. బాధితులు అందించిన సమాచారం మేరకు వివరాలు.. 

కర్నూలు జిల్లా కోవెలకుంట్ల పట్టణానికి చెందిన గడ్డం రాముడు, ఓబుళమ్మ కుమారుడు పెద్దరాముడు 1985వ సంవత్సరంలో రుద్రవరం మండలం యల్లావత్తుల గ్రామంలో మరో కులానికి చెందిన రాధమ్మను ప్రేమించి పెళ్లాడాడు. వేరే కులానికి చెందిన మహిళను వివాహం చేసుకోవడంతో కుల పెద్దలు ఆగ్రహించి ఆ కుటుంబాన్ని కులం నుంచి వెలివేస్తున్నట్లు పంచాయితీ తీర్పు ఇచ్చారు. కులానికి చెందిన వ్యక్తులు పెద్దరాముడు కుటుంబానికి అన్నం పెట్టినా, మంచినీరు ఇచ్చినా, వారితో మాట్లాడినా, బాగోగులు, శుభకార్యాలకు వెళ్లినా రూ. 5వేలు జరిమాన విధిస్తామని అప్పట్లో కట్టుబాటు విధించారు. 

36 ఏళ్లుగా న్యాయ పోరాటం:
ఇలాంటి సంఘటన మరే ఇతర ప్రేమ జంటకు జరగకూడదని ఆ ప్రేమ జంట చేస్తున్న పోరాటానికి మూడున్నర దశాబ్ధాల కాలమైనా న్యాయం జరుగలేదు. వేరే కులానికిచెందిన మహిళను ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో ఆ కులపెద్దలు పూసల కులం నుంచి వెలివేయడంతో తిరిగి కులంలో చేర్చుకోవాలని ఆ జంట గత 36 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తోంది. తమకు న్యాయం చేయాలంటూ తిరగని పోలీస్‌స్టేషన్‌లేదు. చిన్న కోర్టు నుంచి హైకోర్టు వరకు ఎక్కని కోర్టులేదు. పలుమార్లు గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టినా ఇప్పటి వరకు ఆ కుటుంబానికి న్యాయం జరగలేదు. 

పోలీస్‌స్టేషన్లు, కోర్టులు, పంచాయితీల రూపంలో రూ. 30 లక్షల వరకు ఖర్చు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రైవేట్‌ వ్యక్తుల వద్ద చేసిన అప్పులు తీర్చలేక పట్టణంలో స్టేట్‌బ్యాంక్‌ రోడ్డులో రూ. కోటి  విలువ చేసే ఇంటిని ఇరవై ఐదు ఏళ్ల క్రితం రూ. 20 లక్షలకే విక్రయించాడు. ఉన్న ఆస్తులన్నీ తెగనమ్మినా న్యాయం జరగకపోవడంతో ఆ కుటుంబం ప్రస్తుతం అష్ట కష్టాలు పడుతోంది. పూసల వ్యాపారం, రికార్డ్‌ డ్యాన్సర్‌గా కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వీరికి రాము సంతానం కాగా నంద్యాల పట్టణంలోని నందమూరి నగర్‌లో ఫోటో స్టూడియో నడుపుకుంటూ కులం నుంచి వెలివేయడంతో ముస్లిం యువతిని ప్రేమ వివాహం చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. 

12 ఏళ్ల నుంచి పెద్దకర్మలకు దూరం:
కులం నుంచి వెలివేయడంతో 12 ఏళ్ల నుంచి పెద్దరాముడు కుటుంబం పెద్ద కర్మలకు దూరంగా ఉంటోంది. 2009 సంవత్సరంలో తండ్రి, తర్వాత ఆరు నెలలకు తల్లి, తర్వాతి ఏడాది సోదరుడు మృతి చెందారు. పూసల కులంలో తొమ్మిది, 11 రోజుల్లో పెద్దకర్మ నిర్వహించాల్సి ఉంది. ఇదే కులానికి చెందిన గూడేగాడు(పూజారి) ఆధ్వర్యంలో పెద్దకర్మలు చేయాలి. కులం నుంచి వెలివేయడంతో గూడేగాడు పెద్దకర్మలు చేసేందుకు ముందుకు రాకపోవడంతో ఇప్పటి వరకు మృతి చెందిన ఏ ఒక్కరికి పెద్దకర్మ చేయలేదు. పెద్దకర్మలు చేయని కారణంగా ఆ కుటుంబం ఆలయాలకు, ఇతర శుభకార్యాలకు వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో పూజలు, తదితర శుభ కార్యాలయాలకు దూరమైంది. 

1985వ సంవత్సరానికి ముందూ కోవెలకుంట్ల, వెలగటూరు, అమడాల, బిజనవేముల, ముక్కమల్ల, గుళ్లదూర్తి, తదితర గ్రామాల్లో 100 పూసల కుటుంబాలు ఉండగా ఆ కుటుంబాల సంఖ్య ప్రస్తుతం 350కిపైగా చేరింది. ఈ కుటుంబాలు వృత్తిరీత్యా కోవెలకుంట్ల పట్టణంతోపాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలు, వైఎస్‌ఆర్, అనంతపురం జిల్లాల్లో స్థిరపడ్డారు. మూడు జిల్లాల్లో ఉన్న పూసల కులంలో పెద్దరాముడు కుటుంబానికి విధించిన కట్టుబాటు ఇప్పటికి కొనసాగుతుండటం గమనార్హం.  తమ కుటుంబాన్ని కులంలో చేర్చుకునేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని న్యాయం చేయాలని వేడుకుంటోంది. 

బాధిత కుటుంబాన్ని పట్టించుకోని అధికారులు:
కులంలో చేర్చుకోవాలని గత 36 ఏళ్లుగా బాధిత కుటుంబం పోరాటం చేస్తోంది.  1998వ సంవత్సరం హైకోర్టును ఆశ్రయించగా పిటిషన్‌ స్వీకరించిన కోర్టు పూర్తి వివరాలు సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. అప్పటి అధికారులు, గ్రామ పెద్దలు పెద్దరాముడిపై తప్పుడు నివేదిక ఇవ్వడంతో కోర్టు కేసు కొట్టివేసింది. తదనంతరం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, హోంశాఖ మంత్రులు మాధవరెడ్డి, దేవేంద్రగౌడ్, కాంగ్రెస్‌ ప్రభుత్వంలో సబితాఇంద్రారెడ్డి,  2018వ సంవత్సరంలో నిమ్మకాయల చిన రాజప్పను కలిసి తమ గోడును విన్నవించుకున్నారు. వీరితోపాటు తమకు న్యాయం చేయాలని పలువురు ఎస్పీలు, జిల్లా కలెక్టర్లను కలిశారు. మంత్రులు, జిల్లా అధికారులు  స్పందించి సంఘటనపై పూర్తి స్థాయి నివేదికలు ఇవ్వాలని ఆదేశించినా రెవెన్యూ, పోలీసు అధికారులు క్షేత్రస్థాయిలో సహకరించకపోవడంతో న్యాయం జరుగలేదు.

పంచాయితీల పేరుతో కరిగిపోయిన ఆస్తి:
ఎస్సీ మహిళను వివాహం చేసుకున్న కారణంగా కుల పెద్దలు పెద్దరాముడు కుటుంబాన్ని కులం నుంచి వెలివేయడంతోపాటు పంచాయితీల పేరుతో ఉన్న ఆస్తినంతటని కాజేశారు. పూసల కులంలో పంచాయితీ నిర్వహిస్తే ఇరు వర్గాలు చెరో రూ. లక్ష పెద్దల సమక్షంలో జమ చేయాల్సి ఉంది. దీన్ని ఆసరాగా చేసుకుని చిన్న సమస్యను పెద్దదిగా సృష్టించి 1991వ సంవత్సరం నుంచి 2000 సంవత్సరం వరకు ఏడు పర్యాయాలు కోవెలకుంట్ల, తాడిపత్రి, బేతంచెర్ల, అవుకు, ఒంటి వెలగల, ఆళ్లగడ్డ, తదితర ప్రాంతాల్లో పంచాయితీలు నిర్వహించారు.

కులంలో కలవాలన్న తాపాత్రయంతో ప్రతి పంచాయితీకి రూ. లక్ష డిపాజిట్‌ చేయడంతోపాటు తనకు మద్దతుగా ఇతర కుల సంఘాల నాయకులను తీసుకెళ్లడం, రోజుల తరబడి పంచాయితీలు జరగడంతో వాహనాలు సమకూర్చుకోవడం, భోజన, ఇతర ఖర్చులకు ఒక్కో పంచాయితీకి రూ. 3 లక్షల వరకు ఖర్చు చేయాల్సి వచ్చింది. కొన్ని పంచాయితీలు  నెలల తరబడి కొనసాగాయి. ఈ పంచాయితీల్లో ఒక పంచాయితీ ఏకంగా ఏడాదికాలంపాటు జరిగింది.  

పంచాయితీలకు వెళ్లే సమయంలో చేతితో డబ్బులు లేకపోవడంతో ప్రైవేట్‌వ్యక్తుల వద్ద లక్షలాది రూపాయాలు అప్పులు చేయాల్సి వచ్చింది. కోవెలకుంట్ల పట్టణంలో పెద్దరాముడు కుటుంబానికి రూ. లక్షలు విలువ చేసే ఇళ్లు ఉండటంతో అప్పుదారులు అడిగినంతా అప్పులు ఇచ్చారు. పంచాయితీల్లో న్యాయం జరుగకపోగా చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోవడంతో ఓ ఇంటిని అమ్మి అప్పులు తీర్చినా అప్పులు తీరలేదు. 

కులంలో కలిసే వరకు పోరాటం: పెద్దరాముడు, బాధితుడు
కులాంతర  ప్రేమ వివాహం చేసుకున్న కారణంగా 1985వ సంవత్సరంలో నా కుటుంబాన్ని కులం నుంచి వెలివేశారు. ఆ  ఏడాది నుంచి కులానికి చెందిన వ్యక్తులెవరైనా తమతో మాట్లాడినా, సహకరించినా రూ. 5వేలు జరిమాన విధించేలా కుల పెద్దలు  కట్టుబాటు విధించారు. తన కుటుంబాన్ని కులంలో కలుపుకోవాలని గత 36 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాను. కులంలో కలుపుకోవడంతోపాటు తల్లిదండ్రులు, సోదరుడి పెద్దకర్మలు జరిపే వరకు న్యాయపోరాటం కొనసాగిస్తాను. పదిరోజుల క్రితం కూడా కలెక్టర్, పోలీసు అధికారులను కలిసి విన్నవించుకున్నా స్థానిక అధికారులు తూతూ మంత్రంగా విచారణ జరిపి కాలయాపన చేస్తున్నారు. 

 

Read latest AP Special News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top