Cuttlefish: వయసు పెరిగినా వన్నె తగ్గని జ్ఞాపకశక్తి

Cuttlefish Has Better Memory Than Humans - Sakshi

మానవునితో సహా దాదాపు అన్ని జీవుల్లోనూ  వయసు పెరిగే కొద్దీ జ్ఞాపకశక్తి తగ్గిపోతూ ఉంటుంది. గత కాలపు జ్ఞాపకాలు కొన్నాళ్లపాటు లీలామాత్రంగా గుర్తుండి కాలం గడిచే కొద్దీ తుడిచిపెట్టుకు పోతాయి. అయితే సముద్రజీవి అయిన కటిల్‌ ఫిష్‌ మాత్రం ఇందుకు భిన్నమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జీవిత చరమాంకంలోనూ దీని జ్ఞాపకశక్తి అమోఘమని తమ పరిశోధనలో తేల్చారు. వృద్ధాప్యంలో జ్ఞాపకశక్తి నశించిపోకుండా చూసేందుకు ఈ పరిశోధన తొలి అడుగని వారు చెబుతున్నారు. యూకేలోని కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ మెరైన్‌ బయాలజీ విభాగం, ఫ్రాన్స్‌లోని కేన్‌ వర్సిటీ పరిశోధకులు సంయుక్తంగా ఈ పరిశోధన చేపట్టారు.

శాస్త్రవేత్తల బృందం పరిశోధనలో భాగంగా 24 కటిల్‌ఫిష్‌లను ఎంచుకుంది. వాటిలో కొన్ని 10 నుంచి 12 నెలల వయసు ఉన్నవి కాగా మరి కొన్ని 22 నుంచి 24 నెలల వయసు (మానవుడి 90 ఏళ్ల వయసుతో సమానం) కలిగినవి ఉన్నాయి. ఈ కటిల్‌ ఫిష్‌లను ఒక ట్యాంకులో ఉంచి నలుపు, తెలుపు జెండాలు కనిపిస్తే అక్కడికి చేరుకునేలా శిక్షణ ఇచ్చారు. ఆ జెండాలు ఉంచిన ప్రదేశంలోనే వాటికి నిత్యం ఆహారం అందజేసేవారు. ఒక గట్టున ఒకరకమైన జెండా ఎగురవేసి ఆహారంగా కింగ్‌ ప్రాన్‌ ముక్కలను అందజేశారు. ఇది కటిల్‌ ఫిష్‌కు అంతగా ఇష్టపడని ఆహారం, మరోవైపు ఇంకోరంగు జెండా ఎగరవేసి బతికి ఉన్న గడ్డి రొయ్యలను ఆహారంగా ఇచ్చారు. ఈ గడ్డి రొయ్యలంటే కటిల్‌ ఫిష్‌కు చాలా ఇష్టం. ఇలా ప్రతి మూడు గంటలకు  ఒకసారి చొప్పున నాలుగు వారాలపాటు ఆహారం అందజేశారు.
చదవండి: Photo Feature: కరోనా వ్యాక్సిన్‌ చెక్‌పోస్ట్‌ చూశారా!

కటిల్‌ ఫిష్‌ ఒక ప్రదేశానికి అలవాటు పడిపోకుండా ఉండేందుకు ప్రతిరోజూ ఆహారాన్ని అందించే ప్రాంతాన్ని మార్చుతూ వచ్చారు.  ఇలా చేయడం వల్ల ఏ జెండా ఎగరవేసినప్పుడు ఏ ఆహారం వస్తుంది. ఏ ప్రాంతంలో తమకు నచ్చిన ఆహారం దొరుకుతుంది అనేది కటిల్‌ ఫిష్‌ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే దాదాపు అన్ని కటిల్‌ఫిష్‌లు తమకు నచ్చిన ఆహారం దొరికే ప్రదేశాన్ని గుర్తు పెట్టుకుని అక్కడికి చేరుకోవడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. బాగా వయసు ఎక్కువగా ఉన్న కటిల్‌ ఫిష్‌ కూడా ఈ విషయంలో ఏమాత్రం పొరపాటుపడలేదు. దీన్నిబట్టి సమయం, ప్రదేశాన్ని బట్టి గతాన్ని గుర్తు చేసుకునే ఎపిసోడిక్‌ మెమరీ మానవుల్లో వయసు పెరుగుతున్నకొద్దీ తగ్గిపోగా, కటిల్‌ ఫిష్‌లో వయసు ప్రభావం ఎపిసోడిక్‌ మెమరీపై ఉండదని పరిశోధకులు తేల్చారు. 
చదవండి: బియ్యపుగింజపై భగవద్గీత.. వెంట్రుకలపై రాజ్యాంగ పీఠిక

మానవ మెదడులో హిప్పోకాంపస్‌ అనే ఒక సంక్లిష్ట నిర్మాణం ఉంటుంది. ఇది కొత్త విషయాలను నేర్చుకోవడానికి జ్ఞాపకాలను పొందుపరచుకోవడానికి దోహదపడుతుంది. నాడీవ్యవస్థకు సంబంధించిన రోగాలు, వివిధ మానసిక రుగ్మతల కారణంగా ఇది ప్రభావితమవుతుంది. వయసుతోపాటు దీని పనితీరు మందగించిపోతుంది. అయితే కటిల్‌ ఫిష్‌లో హిప్పోకాంపస్‌ అనేది ఉండదని శాస్త్రవేత్తలు తెలిపారు. కటిల్‌ ఫిష్‌ మెదడులో ఉండే ఒక ప్రత్యేకమైన వెర్టికల్‌ లోబ్‌ కొత్త విషయాలను నేర్చుకోవడానికి, జ్ఞాపకాలను భద్రపరచుకోవడానికి ఉపయోగపడుతుందని, జీవిత చరమాంకం వరకు దీని పనితీరులో ఏమాత్రం మార్పు ఉండదని స్పష్టం చేశారు. 

పరిశోధనకు నేతృత్వం వహించిన కేంబ్రిడ్జ్‌ వర్సిటీ సైకాలజీ విభాగం ప్రొఫెసర్‌ డాక్టర్‌ అలెగ్జాండర్‌ ష్నెల్‌ మాట్లాడుతూ కటిల్‌ ఫిష్‌ గతంలో తాను ఎక్కడ, ఎప్పుడు, ఏమి తిన్నాననేది స్పష్టంగా గుర్తుపెట్టుకుంటుందని, దీన్ని అనుసరించి భవిష్యత్తులో ఆహారసేకరణకు నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. కండరాల పనితీరు మందగించడం, ఆకలి కోల్పోవడం వంటి వృద్ధాప్య లక్షణాలు వయసుతోపాటు కనిపించినప్పటికీ జ్ఞాపక శక్తి సామర్థ్యాన్ని మాత్రం కటిల్‌ ఫిష్‌ చివరివరకూ కోల్పోదు. మెమరీ టాస్క్‌లో  వయసు ఎక్కువగా ఉన్న కటిల్‌ ఫిష్‌లు యువ కటిల్‌ఫిష్‌ల కంటే మంచి పనితీరు కనబరిచాయని ష్నెల్‌ పేర్కొన్నారు. 

ప్రత్యేకతలు
► సముద్రాల్లో ఉండే విచిత్రమైన జీవుల్లో కటిల్‌ ఫిష్‌ ఒకటి, దీన్ని చేప అని పిలుస్తారు కానీ, నిజానికి ఇది ఆక్టోపస్‌ వర్గానికి చెందిన జీవి. దీనికి మూడు గుండెలు ఉంటాయి. 
► రెండు గుండెలు మొప్పల్లోకి రక్తాన్ని సరఫరా చేయడానికి,  మరో గుండె ఇతర శరీరభాగాలకు రక్తాన్ని సరఫరా చేయడానికి ఉపయోగపడతాయి.
► ఒక ప్రత్యేకమైన ప్రొటీన్‌ కారణంగా కటిల్‌ ఫిష్‌ రక్తం నీలం రంగులో ఉంటుంది.
► తలనే పాదాలుగా ఉపయోగించడం వల్ల వీటిని సెఫలోపాప్స్‌ అని అంటారు.
► ప్రత్యేక శరీర నిర్మాణం వల్ల కటిల్‌ ఫిష్‌ సముద్ర గర్భంలో చాలా లోతులో నివసించగలవు. 
► శత్రువు నుంచి హాని కలుగుతుందని భావించినప్పుడు ఇవి తమ శరీర రంగును పరిసరాలకు అనుగుణంగా మార్చుకుంటాయి.
►శత్రువు దాడి నుంచి తప్పించుకునేందుకు ఇవి తమ చర్మం నుంచి నల్లని ద్రవాన్ని పిచికారీ చేస్తాయి. అది శత్రువు కళ్లలో పడి కనిపించకుండా చేస్తుంది. అదే  అదనుగా అవి అక్కడి నుంచి పారిపోతాయి. 

Read latest AP Special News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top