breaking news
Cuttlefish
-
Cuttlefish: వయసు పెరిగినా వన్నె తగ్గని జ్ఞాపకశక్తి
మానవునితో సహా దాదాపు అన్ని జీవుల్లోనూ వయసు పెరిగే కొద్దీ జ్ఞాపకశక్తి తగ్గిపోతూ ఉంటుంది. గత కాలపు జ్ఞాపకాలు కొన్నాళ్లపాటు లీలామాత్రంగా గుర్తుండి కాలం గడిచే కొద్దీ తుడిచిపెట్టుకు పోతాయి. అయితే సముద్రజీవి అయిన కటిల్ ఫిష్ మాత్రం ఇందుకు భిన్నమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జీవిత చరమాంకంలోనూ దీని జ్ఞాపకశక్తి అమోఘమని తమ పరిశోధనలో తేల్చారు. వృద్ధాప్యంలో జ్ఞాపకశక్తి నశించిపోకుండా చూసేందుకు ఈ పరిశోధన తొలి అడుగని వారు చెబుతున్నారు. యూకేలోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ మెరైన్ బయాలజీ విభాగం, ఫ్రాన్స్‌లోని కేన్ వర్సిటీ పరిశోధకులు సంయుక్తంగా ఈ పరిశోధన చేపట్టారు. శాస్త్రవేత్తల బృందం పరిశోధనలో భాగంగా 24 కటిల్ఫిష్లను ఎంచుకుంది. వాటిలో కొన్ని 10 నుంచి 12 నెలల వయసు ఉన్నవి కాగా మరి కొన్ని 22 నుంచి 24 నెలల వయసు (మానవుడి 90 ఏళ్ల వయసుతో సమానం) కలిగినవి ఉన్నాయి. ఈ కటిల్ ఫిష్‌లను ఒక ట్యాంకులో ఉంచి నలుపు, తెలుపు జెండాలు కనిపిస్తే అక్కడికి చేరుకునేలా శిక్షణ ఇచ్చారు. ఆ జెండాలు ఉంచిన ప్రదేశంలోనే వాటికి నిత్యం ఆహారం అందజేసేవారు. ఒక గట్టున ఒకరకమైన జెండా ఎగురవేసి ఆహారంగా కింగ్ ప్రాన్ ముక్కలను అందజేశారు. ఇది కటిల్ ఫిష్‌కు అంతగా ఇష్టపడని ఆహారం, మరోవైపు ఇంకోరంగు జెండా ఎగరవేసి బతికి ఉన్న గడ్డి రొయ్యలను ఆహారంగా ఇచ్చారు. ఈ గడ్డి రొయ్యలంటే కటిల్ ఫిష్‌కు చాలా ఇష్టం. ఇలా ప్రతి మూడు గంటలకు ఒకసారి చొప్పున నాలుగు వారాలపాటు ఆహారం అందజేశారు. చదవండి: Photo Feature: కరోనా వ్యాక్సిన్ చెక్‌పోస్ట్ చూశారా! కటిల్ ఫిష్ ఒక ప్రదేశానికి అలవాటు పడిపోకుండా ఉండేందుకు ప్రతిరోజూ ఆహారాన్ని అందించే ప్రాంతాన్ని మార్చుతూ వచ్చారు. ఇలా చేయడం వల్ల ఏ జెండా ఎగరవేసినప్పుడు ఏ ఆహారం వస్తుంది. ఏ ప్రాంతంలో తమకు నచ్చిన ఆహారం దొరుకుతుంది అనేది కటిల్ ఫిష్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే దాదాపు అన్ని కటిల్ఫిష్లు తమకు నచ్చిన ఆహారం దొరికే ప్రదేశాన్ని గుర్తు పెట్టుకుని అక్కడికి చేరుకోవడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. బాగా వయసు ఎక్కువగా ఉన్న కటిల్ ఫిష్ కూడా ఈ విషయంలో ఏమాత్రం పొరపాటుపడలేదు. దీన్నిబట్టి సమయం, ప్రదేశాన్ని బట్టి గతాన్ని గుర్తు చేసుకునే ఎపిసోడిక్ మెమరీ మానవుల్లో వయసు పెరుగుతున్నకొద్దీ తగ్గిపోగా, కటిల్ ఫిష్‌లో వయసు ప్రభావం ఎపిసోడిక్ మెమరీపై ఉండదని పరిశోధకులు తేల్చారు. చదవండి: బియ్యపుగింజపై భగవద్గీత.. వెంట్రుకలపై రాజ్యాంగ పీఠిక మానవ మెదడులో హిప్పోకాంపస్ అనే ఒక సంక్లిష్ట నిర్మాణం ఉంటుంది. ఇది కొత్త విషయాలను నేర్చుకోవడానికి జ్ఞాపకాలను పొందుపరచుకోవడానికి దోహదపడుతుంది. నాడీవ్యవస్థకు సంబంధించిన రోగాలు, వివిధ మానసిక రుగ్మతల కారణంగా ఇది ప్రభావితమవుతుంది. వయసుతోపాటు దీని పనితీరు మందగించిపోతుంది. అయితే కటిల్ ఫిష్‌లో హిప్పోకాంపస్ అనేది ఉండదని శాస్త్రవేత్తలు తెలిపారు. కటిల్ ఫిష్ మెదడులో ఉండే ఒక ప్రత్యేకమైన వెర్టికల్ లోబ్ కొత్త విషయాలను నేర్చుకోవడానికి, జ్ఞాపకాలను భద్రపరచుకోవడానికి ఉపయోగపడుతుందని, జీవిత చరమాంకం వరకు దీని పనితీరులో ఏమాత్రం మార్పు ఉండదని స్పష్టం చేశారు. పరిశోధనకు నేతృత్వం వహించిన కేంబ్రిడ్జ్ వర్సిటీ సైకాలజీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ అలెగ్జాండర్ ష్నెల్ మాట్లాడుతూ కటిల్ ఫిష్ గతంలో తాను ఎక్కడ, ఎప్పుడు, ఏమి తిన్నాననేది స్పష్టంగా గుర్తుపెట్టుకుంటుందని, దీన్ని అనుసరించి భవిష్యత్తులో ఆహారసేకరణకు నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. కండరాల పనితీరు మందగించడం, ఆకలి కోల్పోవడం వంటి వృద్ధాప్య లక్షణాలు వయసుతోపాటు కనిపించినప్పటికీ జ్ఞాపక శక్తి సామర్థ్యాన్ని మాత్రం కటిల్ ఫిష్ చివరివరకూ కోల్పోదు. మెమరీ టాస్క్‌లో వయసు ఎక్కువగా ఉన్న కటిల్ ఫిష్‌లు యువ కటిల్ఫిష్ల కంటే మంచి పనితీరు కనబరిచాయని ష్నెల్ పేర్కొన్నారు. ప్రత్యేకతలు ► సముద్రాల్లో ఉండే విచిత్రమైన జీవుల్లో కటిల్ ఫిష్ ఒకటి, దీన్ని చేప అని పిలుస్తారు కానీ, నిజానికి ఇది ఆక్టోపస్ వర్గానికి చెందిన జీవి. దీనికి మూడు గుండెలు ఉంటాయి. ► రెండు గుండెలు మొప్పల్లోకి రక్తాన్ని సరఫరా చేయడానికి, మరో గుండె ఇతర శరీరభాగాలకు రక్తాన్ని సరఫరా చేయడానికి ఉపయోగపడతాయి. ► ఒక ప్రత్యేకమైన ప్రొటీన్ కారణంగా కటిల్ ఫిష్ రక్తం నీలం రంగులో ఉంటుంది. ► తలనే పాదాలుగా ఉపయోగించడం వల్ల వీటిని సెఫలోపాప్స్ అని అంటారు. ► ప్రత్యేక శరీర నిర్మాణం వల్ల కటిల్ ఫిష్ సముద్ర గర్భంలో చాలా లోతులో నివసించగలవు. ► శత్రువు నుంచి హాని కలుగుతుందని భావించినప్పుడు ఇవి తమ శరీర రంగును పరిసరాలకు అనుగుణంగా మార్చుకుంటాయి. ►శత్రువు దాడి నుంచి తప్పించుకునేందుకు ఇవి తమ చర్మం నుంచి నల్లని ద్రవాన్ని పిచికారీ చేస్తాయి. అది శత్రువు కళ్లలో పడి కనిపించకుండా చేస్తుంది. అదే అదనుగా అవి అక్కడి నుంచి పారిపోతాయి. -
పురుషులవి పిచ్చివేషాలా?
అమ్మాయి మెప్పు కోసం ఏదైనా చేస్తే చాలు... పిచ్చివేషాలు అన్న టైటిల్ మాకు ష్యూరు! ఏం చేస్తాం! తప్పదు. ప్రకృతి అలా రాసిపెట్టింది మాకు. మగాళ్లు చేసే నిర్వాకాలకు ప్రకృతిని ఎందుకు నిందిస్తావ్ అంటారా? నిజాలు మాట్లాడక తప్పడం లేదు. వాస్తవాల గుట్టు విప్పక తప్పడం లేదు. కటిల్‌ఫిష్ అనే ఒక చేప కాని చేప ఉంది. నిజానికి మన తెలుగువాళ్లే దానికి ‘కుటిల’ ఫిష్ అని పేరు పెట్టారేమో! ఇంగ్లిషు వాళ్లు దాన్ని తమ ధోరణిలో కటిల్ అని చదివారేమో!! ప్రకృతిలోని ఓ అమాయకపు ప్రాణికి కుటిల చేప అని పేరు పెట్టడానికి నీకు సిగ్గులేదా అని తిట్టకండి. దాని నైజం మన మగాళ్ల లాంటిదే. దాన్ని తిట్టడమంటే మనల్ని తిట్టుకోవడమే. మనల్ని మనం తిట్టుకోగలమా! కటిల్‌ఫిష్ జాతిలోని అమ్మాయిని ఆకర్షించడానికి మగవన్నీ కిందామీదా పడతాయి. ఒకదానితో ఒకటి పోటీ పడతాయి. ఈ పోటీలో భాగంగా పిచ్చివేషాలన్నీ వేస్తాయి. తప్పదు మరి. అలా పిచ్చివేషాలు వేయకపోతే ఛాన్సులన్నీ బలమైన కటిల్ఫిష్కే. రాజ్యం వీరభోజ్యంలాగా... ఏది శక్తిమంతమో దానికే ఆడది సొంతం. పైగా చిన్నవి పోరాటంలో పెద్దవాటిని గెలవలేవు. అందుకే ఈ పిచ్చివేషాలు. చిన్న కుటిల చేపలు చిన్నదాని వేషం వేస్తాయి. ఆడవేషంలో కులుకులొలుకుతూ, హొయలుపోతూ, సొగసులీనుతూ, సోలిపోతూ అమ్మాయిలా వేషం కడతాయి. మగ కటిల్చేపకు నాలుగు జతల చేతులు. ఆడ చేపకు మూడే. అందుకే ఆడ చేప మనసు దోచేందుకు ఆ ఎగస్ట్రా చేతుల్ని దాచేసి, ఎగస్ట్రా వేషాలు వేస్తాయవి. పొందుకోసం తెగ ట్రై చేస్తాయవి. అందుకే మానవుల్లో మగాళ్ల వేషాలను పిచ్చివేషాలన్నట్టే... ‘కడలి ఊసరవెల్లి... ఆ కటిల్ చేప... ఈ కుటిల చేప’ అంటూ పేరు పెట్టాయి. మీకో విచిత్రం చెప్పనా... వీరత్వంతో, ధీరత్వంతో, జబర్దస్తిత్వంతో, జబ్బబలతత్వంతో ఆడదాన్ని సొంతం చేసుకున్న పెద్దచేప చేసిన శుక్రదానాన్నీ, కుటిలంతో జటిలమైన సమస్యను ఎదుర్కొని తనను చేరి తనకు కాన్కగా ఇచ్చిన వీర్యదానాన్నీ... ఇలా పలు పలు వీర్యాలన్నింటినీ సేకరిస్తుంది ఆడచేప. తన వద్ద ఉన్న అన్ని వీర్యాలనూ వరసగా నిలబెట్టి ఏదో ఒకదాన్నే స్వీకరిస్తుందా గడుసు ఆడ చేప. వీర్యాల స్వయంవరంలో ఒకే ఒక దానికి పట్టం కడుతుంది. ఆ వీర్యంతోనే తన అండం ఫలదీకరణం అయ్యేలా చూస్తుంది. విచిత్రం ఏమిటంటే... ఆడవేషంలో తన వద్దకు వచ్చి శుక్రకణాలను దానం చేసిన కుటిల చేప వీర్యానికే తొలి ప్రాధాన్యం ఇస్తుంది. తన గర్భసంచీలో స్థానం ఇస్తుంది. ఎందుకంటే... అది రౌడీయిజమ్స్ కంటే ఇంటెలి‘జెమ్స్’కే ప్రాముఖ్యమిస్తుందది. మహామహాకవి గాలీబ్ ఏం రాశాడు? ‘‘అందగత్తెలతో ముచ్చటాడు కొరకు చిత్రలేఖన విద్య నేర్చితిని నేను’’ అన్నాడు. కుంచె పట్టడం కుదరకపోయినా, రంగువేయడం రాకపోయినా, బొమ్మగీయడానికి అలనాడు ఆయన సిద్ధపడ్డట్టే... లెక్కలు చేయలేకపోయినా ఎంపీసీలూ, రికార్డులు వేయలేకపోయినా బైపీసీలంటూ ఇప్పటికీ పిచ్చివేషాలకు మేం సిద్ధమే. ఏం చేస్తాం. ఆడువారి కోసమే పాడుబుద్ధి... ఈ మగబుద్ధి. మత్స్యావతారంలోనే కాదు... మానవావతారంలోనూ ఇంతే. కటిల్ చేపలైనా... కుటిల మానవులైనా మగాళ్లు మగాళ్లే. వారి వేషాలు వేషాలే. పిచ్చివేషాలైనా తప్పదు మరి... అతివను ఆకర్షించడం కోసం... బహుకృత వేషం! ఆడవారి దృష్టిలో అది ఓ పిచ్చివేషం!!