మదనపల్లె టౌన్: ఈ నెల 26న బి.కొత్తకోట మున్సిపాలిటీ, రాయచోటిలోని సంబేపల్లి మండలంలో 9, రామాపురం మండలంలో 2 పంచాయతీల్లో తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. రౌడీషీటర్లు, బైండోవర్ అయిన వ్యక్తులపై నిరంతరం నిఘా కొనసాగుతోందన్నారు. ఓటు వేశాక పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల వద్ద గుంపులుగా తిరగకుండా కట్టడి చేస్తామన్నారు. పోలింగ్ కేంద్రాలకు 100–200 మీటర్ల పరిధిలో ఆంక్షలు అమలు చేస్తామన్నారు. ఎన్నికలకు 48 గంటల ముందే మద్యం దుకాణాలు బంద్ చేయాలని ఆదేశించారు. బెల్ట్ షాపులు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా, అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ ఆదేశించారు. ఓటర్లు నిర్భయంగా ఓటు వేయాలని, అల్లర్లు సృష్టించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.
ఎస్పీ ధీరజ్ కునుబిల్లి


