● మిట్టపాలెంలో మొక్కు తీర్చుకుని వస్తుండగా వెంటాడిన మృత్యువు
● పండుగ పూట కడప జిల్లా
ఐతారంపేటలో తీరని విషాదం
యువకుడిపై దాడి: కేసు నమోదు
మదనపల్లె టౌన్ : ఇంటి ముందు బాణాసంచా కాల్చొద్దని అడ్డుకున్న యువకుడిపై దాడి చేసిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు మదనపల్లెటూ టౌన్ ఎస్‌ఐ నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం ఎస్‌ఐ మీడియాతో మాట్లాడుతూ.. పట్టణంలోని సీటీఎం రోడ్డు ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో నివాసం ఉంటున్న విజయ్ కుమారుడు కిరీటి ఇంటి ముందు టపాసులు కాల్చొద్దని అదే వీధిలో ఉంటున్న కొందరు యువకులను అడ్డుకున్నాడు. దీంతో ఆగ్రహించిన వారు కిరీటిపై దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
దరఖాస్తుల ఆహ్వానం
కురబలకోట : అంగళ్లులోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం జనవరి సెషన్‌కు ఫుల్‌టైమ్, పార్ట్‌టైమ్ పీహెచ్‌డీ ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ ప్రదీప్‌కుమార్ తెలిపారు. ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, మేనేజ్‌మెంట్, భౌతిక, రసాయన, గణిత శాస్త్రం, ఇంగ్లీషు తదితర విభాగాల్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. మిట్స్ డార్ ప్రవేశ పరీక్ష, ఇంటర్వూ ఆధారంగా ఎంపిక ఉంటుందన్నారు. ఈనెల 25లోగా దరఖాస్తులను అందజేయాలన్నారు. మిట్స్ వెబ్‌సైట్‌ను సందర్సించాలని వివరాలకు 9452690013 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
అగ్నిప్రమాదం:
రూ.7 లక్షల ఆస్తి నష్టం
పులివెందుల రూరల్ : స్థానిక సీఎస్‌ఐ చర్చి సమీపంలో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఒక సప్లయర్స్ దుకాణంలో కరెంట్ షార్ట్ సర్క్యూట్ కావడంతో భారీగా మంటలు చెలరేగి, సుమారు రూ.7 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తొండూరు మండలం మడూరు గ్రామానికి చెందిన మహేష్ పులివెందుల పట్టణంలో ’గంగాభవాని సప్లయర్స్’ పేరిట దుకాణాన్ని నడుపుతున్నాడు. వివాహాలు, శుభకార్యాలు, వివిధ ఫంక్షన్లకు అవసరమైన వంట సామగ్రి, ఫర్నిచర్, షామియానాలను సరఫరా చేస్తుంటాడు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి దుకాణంలో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మంటలు చెలరేగాయి. దుకాణంలోని వంట సామాగ్రి, ఫర్నిచర్, షామియానాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.
బైక్‌లు ఢీకొని ఇద్దరు దుర్మరణం
సీఎస్‌పురం (పామూరు) : రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన మండల కేంద్రమైన సీఎస్‌పురం సమీపంలోని ఉప్పలపాడు జంక్షన్ వద్ద 167బి మైదుకూరు–సింగరాయకొండ జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఎస్సై పిచ్చాల వెంకటేశ్వరరెడ్డి తెలిపిన వివరాల మేరకు.. వైఎస్సార్ కడప జిల్లా బి.కోడూరు మండలం ఐతారంపేట గ్రామానికి చెందిన కొండా వెంకట సుబ్బారెడ్డి (22), ఆయన బంధువు కుక్కలరెడ్డి సిద్దారెడ్డి (68) దీపావళి సందర్భంగా సీఎస్‌పురం మండలం మిట్టపాలెంలోని శ్రీ నారాయణస్వామి ఆలయానికి వచ్చారు. పూజల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్న అనంతరం బైక్‌పై స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. ఉప్పలపాడు జంక్షన్ వద్దకు రాగానే, సీఎస్‌పురం వైపు నుంచి వేగంగా వస్తున్న పాశం వెంకటేశ్వర్లు బైక్ వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వెంకట సుబ్బారెడ్డి తల, ఛాతీకి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. వెనుక కూర్చున్న సిద్దారెడ్డి కాలు విరిగి తీవ్ర గాయాలపాలవగా, మరో బైక్‌పై ఉన్న వెంకటేశ్వర్లు కూడా గాయపడ్డాడు. స్థానికుల సమాచారంతో ఎస్సై వెంకటేశ్వరరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 వాహనంలో తరలించారు. కనిగిరి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సిద్దారెడ్డి సాయంత్రం మృతిచెందగా, వెంకటేశ్వర్లును మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించారు. మృతుడి బంధువు లక్కిరెడ్డి విజయభాస్కర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చేతికందివచ్చిన కొడుకు అనంతలోకాలకు..
మృతుడు వెంకట సుబ్బారెడ్డి మూడు నెలల క్రితమే హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో చేరాడు. ఆయన సోదరుడు సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. పండుగ పూట దైవదర్శనానికి వెళ్లిన చేతికందివచ్చిన కుమారుడు రోడ్డు ప్రమాదంలో విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. కనిగిరి ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు.
తొండూరు : మండలంలోని టీ.తుమ్మలపల్లె గ్రామంలో గతేడాది జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టించిన తల్లి, కుమార్తెల జంట హత్యల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తుమ్మల గంగాధర్ రెడ్డి రెండు రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు అందించిన సమాచారం ప్రకారం ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. టీ.తుమ్మలపల్లె గ్రామానికి చెందిన తుమ్మల గంగాధర్ రెడ్డి, 2025 జనవరి నెలలో అదే ప్రాంతానికి చెందిన ఓ తల్లి, కుమార్తెను దారుణంగా హతమార్చాడు. ఈ కేసులో గంగాధర్ రెడ్డిని పోలీసులు ప్రధాన నిందితుడిగా చేర్చి అరెస్ట్ చేశారు. కాగా, ఈ కేసులో నిందితుడిగా ఉంటూ ఇటీవల కాలంలో బయట ఉన్న గంగాధర్ రెడ్డి.. రెండు రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. విషయం తెలుసుకున్న తొండూరు సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్సై) రేనాటి శివనాగిరెడ్డి తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్సీ
బి.కోడూరు : మండలంలోని ఐత్రంపేట గ్రామానికి చెందిన కొండా వెంకటసుబ్బారెడ్డి (23), కుక్కల్‌రెడ్డి సిద్దారెడ్డి (68) ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద వార్త తెలుసుకున్న ఎమ్మెల్సీ డి.సి. గోవిందరెడ్డి ఐత్రంపేట గ్రామాన్ని సందర్శించి, మృతదేహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ౖఒకే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఐత్రంపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎమ్మెల్సీ వెంట నియోజకవర్గ బూత్‌కన్వీనర్ల సమన్వయకర్త కె.రమణారెడ్డి, కాశినాయన మండల మాజీ జెడ్పీటీసీ సత్యనారాయణరెడ్డి, బి.కోడూరు మండల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, మాజీ సింగిల్‌విండో అధ్యక్షుడు ఓ.ప్రభాకర్‌రెడ్డి, మాజీ మండల ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, పిచ్చిరెడ్డి, భాస్కర్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, రమణారెడ్డి, ఆదినారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


