జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక

Nov 10 2026 1:25 AM | Updated on Nov 10 2026 1:25 AM

కురబలకోట: కురబలకోట జెడ్పీ హైస్కూల్‌ 7వ తరగతి విద్యార్థి ఎ.సమీర్‌ జాతీయ స్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు ఎంపికై నట్లు హెడ్మాస్టర్‌ శ్రీదేవి తెలిపారు. రంపచోడవరంలో జరిగిన ఎస్‌జీఎఫ్‌ అండర్‌–14 రాష్ట్ర స్థాయి పుట్‌ బాల్‌ పోటీల్లో ప్రతిభ కనపరచి ఈ ఘనత సాధించాడు. మధ్యప్రదేశ్‌లో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో సమీర్‌ పాల్గొనున్నట్లు హెడ్మాస్టర్‌ తెలిపారు.

ప్రత్యర్థుల దాడిలో

వ్యక్తికి గాయాలు

మదనపల్లె టౌన్‌ : ప్రత్యర్థుల దాడిలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడి మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చేరాడు. సోమవారం మదనపల్లి మండలంలో వెలుగు చూసిన ఘటనపై బాధితుడు తాలూకా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు.. మదనపల్లి మండలం, ఆవులపల్లి కు చెందిన చలపతిని అదే ఊరికి చెందిన ఓ ఆడపిల్ల కుటుంబీకులు రాళ్లు, ముచ్చుకతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. కుటుంబీకులు గమనించి బాధితుడుని వెంటనే మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. ఘటనపై తాలూకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది.

ప్రాణం తీసిన బైక్‌ రేసింగ్‌

చెన్నూరు (వల్లూరు) : యువతలో పెరుగుతున్న బైక్‌ రేసింగ్‌ మోజు మరో నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఆలంఖాన్‌పల్లె సర్కిల్‌ దాటిన తర్వాత కమలాపురం రోడ్డులో ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. సీకే దిన్నె మండలానికి చెందిన బోయ సతీష్‌ కుమార్‌, రైల్వేకోడూరుకు చెందిన పెద్దిరాజు ఆదివారం అర్ధరాత్రి వేళ బైక్‌పై బయలుదేరారు. రాత్రి 1.30 గంటల సమయంలో కమలాపురం రోడ్డుపై ఇద్దరూ అతివేగంతో బైక్‌ రేసింగ్‌ చేస్తూ దూసుకెళ్లారు. ఈ క్రమంలో బైక్‌ అదుపు తప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు బైక్‌ గాల్లోకి ఎగిరి అవతల పడింది. బైక్‌ నడుపుతున్న బోయ సతీష్‌ కుమార్‌కు తల, శరీర భాగాలపై తీవ్ర గాయాలు కావడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. వెనుక కూర్చున్న పెద్దిరాజుకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు, వాహనదారులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. గాయపడిన పెద్దిరాజును చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

యువతి బలవన్మరణం

జమ్మలమడుగు రూరల్‌ : సెల్‌ఫోన్‌ ఎక్కువగా ఉపయోగించవద్దని తల్లిదండ్రులు మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువతి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన జమ్మలమడుగు మండలంలోని చిటిమిటి చింతల (పాటి) గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వేంపల్లె మండలం బక్కన్నగారిపల్లె గ్రామానికి చెందిన బుక్కే స్వాతి (21) సెల్‌ఫోన్‌ వాడుతుండటంతో తల్లిదండ్రులు ఆమెను మందలించారు. దీంతో కలత చెందిన స్వాతి, శనివారం జమ్మలమడుగు మండలంలోని చిటిమిటి చింతల గ్రామంలో నివసిస్తున్న తన పెద్దమ్మ నాన్కి భాయి ఇంటికి వచ్చింది. ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి స్వాతి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement