కడప అర్బన్ : సమాజంలో ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉచిత న్యాయ సహాయం అందించడమే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ) ప్రధాన లక్ష్యమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, డీఎల్‌ఎస్‌ఏ చైర్మన్ జి. రామగోపాల్ పేర్కొన్నారు. ఆర్థిక లేదా ఇతర కారణాల వల్ల ఏ ఒక్కరూ న్యాయాన్ని కోల్పోకూడదనే ఉద్దేశంతో సంస్థ నిరంతరం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. జాతీయ న్యాయసేవల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు సోమవారం కడపలోని న్యాయసేవాసదన్‌లో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. ప్రజలకు చట్టాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడం, వివాదాలను రాజీ మార్గంలో పరిష్కరించి సత్వర న్యాయం అందించడమే ఈ సంస్థ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ముఖ్యంగా సమాజంలోని పేదలు, మహిళలు, పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు, బలహీన వర్గాలకు ఉచితంగా న్యాయవాది సేవలు, ఉచిత న్యాయ సలహాలు, అవసరమైన చట్టపరమైన సహాయాన్ని అందిస్తున్నట్లు వివరించారు. కోర్టుల చుట్టూ తిరగడం వల్ల సమయం, ధనం వృథా అవుతాయని.. దీనికి ప్రత్యామ్నాయంగా లోక్ అదాలత్‌లు, మధ్యవర్తిత్వం సేవలను ఉపయోగించుకుని వివాదాలను త్వరితగతిన, సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవచ్చని సూచించారు.
ప్రశంసా పత్రాల పంపిణీ
న్యాయ సేవలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్న సిబ్బందిని ఈ సందర్భంగా అభినందించారు. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్, ప్యానెల్ లాయర్స్, మీడియేటర్స్, పారా లీగల్ వాలంటీర్ల సేవలను కొనియాడుతూ వారికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేశారు.
అవగాహన ర్యాలీ
జాతీయ న్యాయ సేవా దినోత్సవం సందర్భంగా ప్రజల్లో చట్టాలపై అవగాహన కల్పించేందుకు కడప నగరంలో అవగాహన ర్యాలీని నిర్వహించారు. జిల్లా కోర్టు ప్రాంగణం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ కోటిరెడ్డి సర్కిల్, సంధ్యా సర్కిల్, రాజీవ్ మార్గ్, కలెక్టర్ సుబ్రహ్మణ్యం సర్కిల్, అంబేడ్కర్ సర్కిల్ మీదుగా సాగింది. ’ఉచిత న్యాయం–అందరి హక్కు’ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ, స్లోగన్లతో ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ర్యాలీ తిరిగి జిల్లా కోర్టు ప్రాంగణానికి చేరుకుంది. చట్టపరమైన సమస్యలు, ఉచిత న్యాయ సహాయం అవసరమైన వారు 15100 టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించాలని న్యాయమూర్తులు ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు. న్యాయ విజ్ఞాన సదస్సు, ర్యాలీలో కడప జిల్లా కోర్టు సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ ఎస్. బాబా ఫకృద్దీన్, న్యాయమూర్తులు శాంతి, రమేష్‌కుమార్‌తో పాటు పలువురు న్యాయమూర్తులు, కడప న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జి.వి. రాఘవరెడ్డి, ప్రముఖ న్యాయవాదులు, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ సభ్యులు, మీడియేటర్స్, కోర్టు సిబ్బంది, పారా లీగల్ వాలంటీర్లు, స్థానిక లా కాలేజ్ విద్యార్థులు పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రామగోపాల్


