కుమార్తె కళ్లెదుటే తండ్రి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

కుమార్తె కళ్లెదుటే తండ్రి దుర్మరణం

Nov 10 2026 1:25 AM | Updated on Nov 10 2026 1:25 AM

కడప అర్బన్‌ : కళ్లెదుటే నాన్న ప్రాణాలు కోల్పోతుంటే ఆ కుమార్తె రోదించిన తీరు అక్కడున్న వారిని కన్నీటిపర్యంతం చేసింది. రెండు ద్విచక్రవాహనాలు ఒకదానికొకటి బలంగా ఢీకొన్న ఘటనలో తండ్రి మృతి చెందగా, కుమార్తె తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడపలోని ఎన్జీఓ కాలనీకి చెందిన పెర్నపాటి వెంకటేశ్వర్లు ఆచారి (53) ఈనెల 7వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో తన కుమార్తె శ్రావణి (24)తో కలిసి స్కూటీపై వెళ్తున్నారు. కడప ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని శంకరాపురం ఏషియన్‌ హాస్పిటల్‌ సమీపంలో వారు రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. అప్సరా సర్కిల్‌ వైపు నుంచి అతివేగంగా దూసుకొచ్చిన ఒక మోటార్‌ సైకిల్‌ వీరి స్కూటీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటేశ్వర్లు ఆచారి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. స్కూటీ వెనుక కూర్చున్న శ్రావణికి తీవ్ర గాయాలవడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న కడప ట్రాఫిక్‌ సిఐ తులసీరామ్‌ తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి రిమ్స్‌ మార్చురీలో పోస్టుమార్టం పూర్తి చేసి బంధువులకు అప్పగించారు. ఈ ప్రమాదంతో ఎన్జీఓ కాలనీలో విషాద ఛాయలు అలముకున్నాయి.

గుర్తుతెలియని వాహనం ఢీకొని..

ముద్దనూరు : గుర్తుతెలియని వాహనం ఢీకొని తీవ్రంగా గాయపడిన వేణు నాయక్‌(19)అనే యువకుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు.సీఐ నగేష్‌బాబు సమాచారం మేరకు సున్నరపురాళ్ళ పల్లె గ్రామానికి చెందిన వేణు తన బంధువుతో కలిసి ఈనెల 7వతేదీన బైక్‌లో ముద్దనూరుకు బయలుదేరాడు. మండలంలోని తిమ్మాపురం గ్రామ సమీపంలోకి రాగేనే గుర్తుతెలియని వాహనం బైక్‌ను ఢీకొంది.ఈ ప్రమాదంలో వేణు తలకు తీవ్ర గాయమైంది.వెంటనే అతన్ని 108 వాహనంలో ప్రొద్దుటూరుకు తరలించారు.ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 8వతేదీన మృతి చెందాడు.కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నట్లు సీఐ తెలిపారు.

బస్సు ఢీకొని మహిళ..

చాపాడు : మండలంలోని అల్లాడుపల్లె దేవాలాలు క్రాస్‌ రోడ్డు వద్దగల మైదుకూరు – ప్రొద్దుటూరు జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో పొన్న లక్ష్మీదేవి (50) అనే మహిళ మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మండల పరిధిలోని సోమాపురం గ్రామానికి చెందిన లక్ష్మీదేవి ఆదివారం ఉదయం అల్లాడుపల్లె వీరభద్రస్వామిని దర్శించుకుని ఇంటికి వెళుతుండగా ప్రొద్దుటూరు వైపు నుంచి కడపకు వెళుతున్న ఏపీ 04 జెడ్‌ 0249 నంబర్‌గల పల్లె వెలుగు బస్సు ప్రమాదవశాత్తు ఢీకొంది. ఈ ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.

ద్విచక్రవాహనాలు ఢీకొనడంతో ప్రమాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement