మదనపల్లె టౌన్ : భార్యను దారుణంగా హత్య చేసిన నిందితుడిని మదనపల్లె వన్టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని ములబాగల్కు చెందిన స్కూటర్ మెకానిక్ నవీద్ బాషా (30)కు, రుబియా తాజ్తో 2014లో వివాహం జరిగింది. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. భార్యపై అనుమానంతో కక్ష పెంచుకున్న నిందితుడు, ఈ నెల 14న ఆమెను రామసముద్రం నుంచి ద్విచక్ర వాహనంపై మదనపల్లెలోని రాజ్ భవన్ లాడ్జికి తీసుకువచ్చాడు. 15న తెల్లవారుజామున లాడ్జి గదిలో బీరు సీసాతో తలపై దాడి చేసి, గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. శనివారం మదనపల్లె–బెంగళూరు రహదారిలోని నక్కలదిన్నె ఆర్చ్ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు వన్ టౌన్ సీఐ మోహన్, ఎస్సై రహిముల్లా తెలిపారు. నిందితుడి నుంచి ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని, అతడిని రిమాండ్కు తరలించారు.


