పుంగనూరు ఘటనలో బాధితులే నిందితులు | Assassination attempt case filed against MP Midhun Reddy | Sakshi
Sakshi News home page

పుంగనూరు ఘటనలో బాధితులే నిందితులు

Oct 18 2026 3:44 AM | Updated on Oct 18 2026 3:44 AM

Assassination attempt case filed against MP Midhun Reddy

పుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డి కారుపై దాడి చేస్తున్న టీడీపీ గూండాలు

ఇవి రెడ్‌బుక్‌ రాజ్యాంగం పెట్టిన కేసులు 

ఎంపీ మిథున్‌ రెడ్డిపై హత్యాయత్నం జరిగితే, ఆయన పైనే అక్రమ కేసులు

సాక్షి, మదనపల్లె: అన్నమయ్య జిల్లా పుంగనూరు ఘటనలో దాడులు చేసింది టీడీపీ గూండాలు. తీ­వ్రంగా గాయపడింది వైఎస్సార్‌సీపీ శ్రేణు­లు, వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌ రెడ్డిపై టీడీపీ గూండాలు హత్యాయత్నానికి ఒడిగట్టారు. అయినా, చంద్రబాబు రెడ్‌బుక్‌ రాజ్యాంగంలో గూండాలకే రక్షణ ఉంటుందన్న విషయాన్ని మరోసారి రుజువు చేస్తూ బాధితులైన ఎంపీ మిథున్‌రెడ్డి, ఇతర నేతలపైనే అక్రమ కేసులు పెట్టారు. మరీ ముఖ్యంగా మిథున్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకొని ఈ కేసులు నమోదు చేశారు. శుక్ర­వారం పుంగనూరులో వైఎస్సార్‌సీపీ అ­భ్యర్థులు నా­మినేషన్లు దాఖలు చేయకుండా టీడీపీ గూండాలు అడ్డుకోవడమే గాక, ఎంపీ మిథున్‌రెడ్డి, ఆయన భద్రతా సిబ్బంది, వారి వాహనాల­పై కర్రలు, రాళ్లు, రాడ్లతో దాడి చేసిన తీరును యావత్‌ రాష్ట్రం చూసింది. 

మిథున్‌ రెడ్డి, ఇతర నేతలపై టీడీపీ గూండాలు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో మిథున్‌ రెడ్డికి భద్రత కల్పిస్తున్న సీఆర్పీఎఫ్‌ సిబ్బంది, వ్యక్తిగత సహాయకులు తీవ్రంగా గాయపడ్డారు. ఇందుకు వీడియోలే ప్రత్యక్ష సాక్ష్యం. టీడీపీ గూండాల విశృంఖలత్వం వీడియోల్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. పైగా, ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాల్లోనూ రికార్డయింది. టీడీపీ కార్యకర్తలు ఇచ్చిన  ఫిర్యాదులు, మదనపల్లె డీఎస్పీ ఇచ్చిన ఫిర్యాదుతో బాధితులైన ఎంపీ మిథున్‌ రెడ్డి సహా వైఎస్సార్‌సీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెట్టారు. 

టార్గెట్‌ మిథున్‌ రెడ్డి  
ఈ ఘటనలో ఎంపీ మిథున్‌ రెడ్డిని ప్రభుత్వం లక్ష్యంగా చేసుకున్నట్లు ఈ కేసులను పరిశీలిస్తే తెలుస్తుంది. ఇప్పటికే మద్యం అక్రమ కేసులో ఇరికించి, వే­ధించిన ప్రభుత్వం.. ఇప్పుడు ఒకేసారి 4 కేసులతో మరింతగా వేధించేందుకు సిద్ధమైంది. 2014 నుంచి ఇప్పటిదాకా అధికారంలో ఉన్న ప్రతిసారీ మిథున్‌ రెడ్డినే చంద్రబాబు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ప్ర­తి చిన్న ఘటనను, సంబంధంలేని వ్యవహారాలను అంటగట్టి వేధిస్తున్నారు. ఇప్పుడూ అదే జరిగింది. టీడీపీ కార్యకర్తలు చేసిన ఫిర్యాదుల్లో ఎంపీ మిథున్‌ రెడ్డి సహా పదుల సంఖ్య­లో నాయకుల పేర్లు ఇచ్చి, వందల మంది అంటూ పేర్కొన్నారు. మదనపల్లె డీఎస్పీ ప్రసాద్‌ ఇచ్చిన ఫిర్యాదులోనూ ఎంపీ మిథున్‌ రెడ్డి పేరును ప్రస్తావించారు.  

అడ్డదారిలో గెలిచేందుకే.. 
పుంగనూరులో వైఎస్సార్‌సీపీ నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా టీడీపీ పక్కా పన్నా­గం పన్ని, దాడులకు పాల్పడింది. ఇక్కడ ఏ ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీని టీడీపీ నిలువరించలేకపోయింది. ప్రస్తుత మున్సిపల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నామినేషన్లను అడ్డుకుని, పోటీ లేకుండా అడ్డదారిలో గెలిచేయాలన్న లక్ష్యంతో టీడీపీ దాడులు చేయడమేకాక, అక్రమ కేసులతో వేధింపులు మొదలుపెట్టింది. శుక్రవారం వైఎస్సార్‌సీపీ తరఫున చైర్మన్‌ అభ్యర్థి నామినేషన్లు దాఖలు చేస్తే వాటిని ఎన్నికల అధికారి స్వీకరించకపోవడం గమనార్హం. 

దాడి చేసి, వాహనాలు ధ్వంసం చేసింది ఎవరు? 
ఫిర్యాదులో పేర్కొన్నట్టు నామినేషన్‌ కేంద్రానికి 100 మీటర్ల దూరం వరకు నిషేధిత ప్రాంతం. అయితే.. నామినేషన్‌ కేంద్రంలోకి చొచ్చుకొచ్చి ఎంపీ మిథున్‌ రెడ్డి, ఆయన భద్రత సిబ్బంది వాహనాలను నామినేషన్‌ కేంద్రం ఆవరణలోనే ధ్వంసం చేసింది ఎవరు అన్నది ఫిర్యాదుల్లో ఎక్కడా లేకపోవడం గమనార్హం. పదేపదే దాడులకు ప్రయత్నించిన టీడీపీ గూండాలను అడ్డుకోని పోలీసులు.. ఎంపీ మిథున్‌ రెడ్డి 100 మీటర్ల నిబంధనను ఉల్లంఘించి లోపలికి వచ్చారని వారిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే నిబంధన ఉల్లంఘించి నామినేషన్‌ కేంద్రంలోకి చొచ్చుకొచ్చిన వందలాది టీడీపీ గూండాలు, వారు చేసిన విధ్వంసాన్ని మాత్రం ప్రస్తావించలేదు.

మిథున్‌రెడ్డికి ప్రాణహాని 
ఉందని భద్రత సిబ్బంది రక్షించే ప్రయత్నం చేస్తే, ప్రధాన గేటును ఢీకొట్టి లోపలికి వెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎంపీపై దాడి చేసి, హత్యాయత్నానికి పాల్పడిన వారిని అడ్డుకునేందుకు ఒక్క చర్యా తీసుకోకుండా.. ఒకేసారి గాలిలోకి కాల్పులు జరపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో పోలీసులకే తెలియాలి. పోలీసులు అధికార పార్టీ కనుసన్నల్లో రెడ్‌ బుక్‌ రాజ్యాంగం ప్రకారమే పని చేస్తున్నారనడానికి ఈ ఘటన పక్కా నిదర్శనం.  

ఎంపీ మిథున్‌రెడ్డిపైనే హత్యాయత్నం కేసు 
టీడీపీ నేతలతో కలిసి డీఎస్పీ ప్రసాద్‌ తప్పుడు ఫిర్యాదు  
సాక్షి టాస్క్‌ఫోర్స్‌: పుంగనూరు మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్లలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఆయన సిబ్బందిపై హత్యాయత్నం చేసి, కార్లను ధ్వంసం చేసిన తెలుగుదేశం గూండాలు.. ఎంపీ, ఆయన అనుచరులపై తప్పుడు ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేయించారు. పుంగనూరు పోలీసులు టీడీపీ నేత మధుసూదన్‌ రాయల్‌ వద్ద తప్పుడు ఫిర్యాదు తీసుకుని ఎంపీ మిథున్‌రెడ్డిని ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ  4 కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో మొత్తం 216 మంది వైఎస్సార్‌సీపీ శ్రేణులపై తప్పుడు కేసులు నమోదు చేయడంపై వైఎస్సార్‌సీపీ లీగల్‌ అడ్వైజర్లు మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే, హైకోర్టులో రిట్‌ పిటిషన్లు దాఖలు చేయనున్నట్లు వారు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement