● విద్యుత్ స్తంభం, ట్రాన్స్ఫార్మర్ను
ఢీకొట్టిన కారు
● స్వల్ప గాయాలతో బయటపడిన డ్రైవర్, ప్రయాణికులు
చౌడేపల్లె : మండల పరిధిలోని పెద్దూరు సమీపంలో శనివారం ఓ కారు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. పెద్దకొండామర్రి గ్రామానికి చెందిన హరిబాబు మరికొందరితో కలిసి కారులో బోయకొండ క్షేత్రం నుంచి స్వగ్రామానికి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పెద్దూరు సమీపంలోని షెల్లర్ మిషన్ ఎదురుగా రాగానే వాహనం ఒక్కసారిగా అదుపు తప్పి.. రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని, ట్రాన్స్ఫార్మర్ దిమ్మెను బలంగా ఢీకొట్టింది.
కరెంట్ లేకపోవడంతో..
ప్రమాదం జరిగిన సమయంలో ఆ లైన్లో విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రమాదం త్రుటిలో తప్పినట్లయింది. ఒకవేళ విద్యుత్ సరఫరా ఉండి ఉంటే తీవ్ర ప్రాణనష్టం జరిగి ఉండేదని స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు. ప్రమాద ధాటికి కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసం కాగా, కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా, ప్రమాదంలో విద్యుత్ స్తంభంతో పాటు ట్రాన్స్ఫార్మర్ దిమ్మె, ఇతర సామగ్రి ధ్వంసమైనట్లు ట్రాన్స్కో అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


