మదనపల్లె టౌన్ : స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో జిల్లాలో చోటుచేసుకున్న ఘర్షణలు, అల్లర్లతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు, డీఐజీ కోయ ప్రవీణ్ సూచనల మేరకు జిల్లాకు 400 మంది కేంద్ర పారా మిలిటరీ బలగాలను రప్పించారు. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా రాయచోటి, పుంగనూరు, పీలేరు, మదనపల్లెలో బలగాలు కవాతు నిర్వహించాయి.
వ్యక్తిపై దాడి.. తీవ్ర గాయాలు
మదనపల్లె టౌన్ : మదనపల్లె మండలం, పోతబోలు పంచాయతీ పరిధిలో శనివారం దాడి ఘటన చోటుచేసుకుంది. పోతబోలు గ్రామం, గాండ్లపల్లెకు చెందిన టి. రామయ్య కుమారుడు టి. ప్రభాకర్ (40)పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. ముఖం, ఛాతీ భాగంలో గాయాలు కావడంతో ప్రభాకర్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై తాలూకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇరువర్గీయులపై కేసు
పెద్దతిప్పసముద్రం : భూ తగాదాలో ఘర్షణ పడిన ఇరు వర్గీయులపై కేసు నమోదు చేశామని స్టేషన్ హౌస్ ఆఫీసర్ శంకర్ నాయక్ శనివారం తెలిపారు. ఎస్‌హెచ్‌వో కథనం మేరకు మండలంలోని పులికల్లు పంచాయతీ బొంతలవారిపల్లికి చెందిన గూడే వెంకట్రమణారెడ్డి ఫిర్యాదు మేరకు గూడే మంజునాథ్‌రెడ్డి, ప్రమీల, మహేశ్వరీలపై కేసు నమోదు చేశామన్నారు. అదే విధంగా మంజునాథ్‌రెడ్డి ఫిర్యాదు మేరకు వెంకట్రమణారెడ్డి, నాగరత్నమ్మ, మహేశ్వరి, భాస్కర్‌రెడ్డిలపై వేర్వేరుగా కేసు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌వో శంకర్ నాయక్ పేర్కొన్నారు.
నాటుసారా స్థావరంపై దాడి
నిమ్మనపల్లె (మదనపల్లె టౌన్) : మదనపల్లె ఎక్సైజ్, డీటీఎఫ్ బృందం సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో నాటుసారా తయారీ సామగ్రి లభ్యమైనట్లు మదనపల్లె ఎకై ్సజ్ సీఐ భీమలింగ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అందిన సమాచారం మేరకు నిమ్మనపల్లి మండలం, నాగులయ్యగారిపల్లె అటవీ ప్రాంతంలో అధికారులు తనిఖీలు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ తనిఖీల్లో సారా తయారీకి సిద్ధంగా ఉంచిన సుమారు 200 లీటర్ల బెల్లపు ఊటను గుర్తించారన్నారు. వెంటనే ఆ ఊటను అక్కడికక్కడే ధ్వంసం చేయడంతో పాటు, అక్కడ లభించిన 5 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అక్రమంగా నాటుసారా తయారు చేస్తున్న అదే గ్రామానికి చెందిన కే. వెంకటరమణను పోలీస్ స్టేషన్ కు తీసుకు వచ్చి కేసు నమోదు అనంతరం అరెస్ట్ చేసినట్లు సీఐ పేర్కొన్నారు. అటవీ ప్రాంతాలను అడ్డాగా చేసుకుని సారా తయారీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎమ్మెల్యే అనుచరులే
దాడి చేశారు
కడప కార్పొరేషన్ : తనపై కడప ఎమ్మేల్యే మాధవిరెడ్డి అనుచరులే దాడి చేసి గాయపరిచారని ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేసేందుకు వచ్చిన ఫిజియోధెరపిస్ట్ డాక్టర్ జిలానీ ఆరోపించారు. జిలానీ 42 డివిజన్‌కు ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేసేందుకు అక్కడి వచ్చారు. అక్కడ నామినేషన్ పత్రాలను లాక్కొని మాధవిరెడ్డి మనుషులు దాడి చేశారని తెలిపారు. టీడీపీలో రెండున్నర సంవత్సరాలుగా ఎంతో కష్టపడ్డానని తనకు టికెట్ ఇవ్వకుండా వేరే వ్యక్తులకు ఇవ్వడం వల్లే ఇండిపెండెంట్‌గా వేసేందుకు సిద్దపడ్డానని తెలిపారు. ఇది మైనార్టీలకు అవమానమేనన్నారు. కార్పొరేషన్ మైనార్టీ వాయిస్ లేకుండా చేయాలనే ఉద్దేశ్యంతో ఇలా చేశారన్నారు.


