మదనపల్లె టౌన్ : మదనపల్లె మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ శనివారం పరిశీలించారు. పట్టణంలోని దొంతి వీధిలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని సందర్శించిన ఆయన, అక్కడ కొనసాగుతున్న నామినేషన్ల స్వీకరణ విధానం, అభ్యర్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. డీఎస్పీ వంశీధర్ గౌడ్, టూ టౌన్ సీఐ గోపాల్ రెడ్డి, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ సురేష్ కుమార్ రెడ్డి పర్యవేక్షణలో కేంద్రం వద్ద కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అధికారులు డీఐజీకి వివరించారు. నామినేషన్ కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అత్యాధునిక డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ, శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పోలీసులు పూర్తి అప్రమత్తతతో విధులు నిర్వహించాలని సూచించారు. నామినేషన్ల ప్రక్రియ అత్యంత ప్రశాంతంగా, పారదర్శకంగా, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 144 సెక్షన్ అమల్లో ఉన్న కారణంగా అభ్యర్థులు, వారి అనుచరులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలని, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


