డిసెంబర్‌ 3 వరకు పీజీఆర్‌ఎస్‌ లేదు | - | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌ 3 వరకు పీజీఆర్‌ఎస్‌ లేదు

Oct 19 2026 4:01 AM | Updated on Oct 19 2026 4:01 AM

సాక్షి, మదనపల్లె : స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున డిసెంబర్‌ 3వ తేదీ వరకు మదనపల్లె కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. క్షేత్రస్థాయి పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమాలు కూడా అప్పటిదాక తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.

ఎన్నికల నేపథ్యంలో

పీజీఆర్‌ఎస్‌ నిలిపివేత

మదనపల్లె టౌన్‌ : డిసెంబర్‌ 3 వరకు పీజీఆర్‌ఎస్‌ నిలిపివేస్తున్నట్లు జిల్లా ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉందన్నారు. మదనపల్లె పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌), కార్యక్రమాన్ని డిసెంబర్‌ 3 వరకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికలు ముగిసిన అనంతరం కార్యక్రమాన్ని యథావిధిగా పునఃప్రారంభిస్తామని తెలిపారు. ఈ సమయంలో ప్రజలు మదనపల్లె జిల్లా ఎస్పీ కార్యాలయానికి రావద్దని కోరారు. అత్యవసర ఫిర్యాదుల కోసం స్థానిక పోలీస్‌ స్టేషన్‌న్‌లను సంప్రదించాలని లేదా డయల్‌ 100 లేక 112 ను వినియోగించుకోవాలని ఆ సందర్భంగా ఎస్పీ సూచించారు.

నేడు డయల్‌ యువర్‌ ఎస్‌ఈ రద్దు

సాక్షి, మదనపల్లె : విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఏపీఎస్పీడీసీఎల్‌ సోమవారం (19న) నిర్వహించాల్సిన డయల్‌ యువర్‌ సీఎండీ, డయల్‌ యువర్‌ ఎస్‌ఈ కార్యక్రమాలను సెలవు కారణంగా రద్దు చేసినట్లు ఆ సంస్థ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ శివ శంకర్‌ లోతేటి, ఎస్‌ఈ ఆడేపూడి సోమశేఖర్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ తర్వాత వచ్చే సోమవారం నుంచి యథావిధిగా నిర్వహిస్తామన్నారు.

ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి

సాక్షి, మదనపల్లె : జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల పర్యవేక్షణకు జనరల్‌ అబ్జర్వర్‌ జి. బాలకృష్ణ, ఎన్నికల వ్యయ పరిశీలకురాలు ఎం.బబితాతో కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ ఆదివారం కలెక్టరేట్‌లో సమావేశమయ్యారు. ఎన్నికల సంఘ నిబంధనల ప్రకారం ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, ఎన్నికల నిర్వహణకు సంబంధించి వివిధ దశల్లో చేపట్టే చర్యలను చర్చించారు. అభ్యర్థులు చేసే వ్యయం, వ్యయ పరిమితులు, వ్యయానికి సంబంధించిన రికార్డుల పరిశీలనపై చర్చించారు. జాయింట్‌ కలెక్టర్‌ శివ్‌ నారాయణ శర్మ, సబ్‌ కలెక్టర్‌ చల్లా కళ్యాణి, డీఆర్‌ఓ వెంకటేష్‌ పాల్గొన్నారు.

టీడీపీ దాడులకు భయపడవద్దు

మాజీ మంత్రి, ఎమ్మెల్యే

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

రొంపిచెర్ల : స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై చేస్తున్న దాడులకు ఎవరూ భయ పడవద్దని మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం రొంపిచెర్ల మండలానికి చెందిన పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలలో నామినేషన్లు వేయడానికి ఇంటి పన్నులు చెల్లించిన నో డ్యూ సర్టిఫికెట్ల ను కార్యదర్శులు ఇవ్వడం లేదని మాజీ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఎక్కడ ఏమి జరిగినా వెంటనే తన దృష్టికి తీసుకుని వస్తే పై అధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డిని కలసిన వారిలో సురేంద్రనాయుడు, కుమార్‌ నాయుడు, రామకృష్ణ నాయుడు, రెడ్డిశేఖర్‌ రెడ్డి, సోమశేఖర్‌ రెడ్డి, రమణయ్య, నాగరాజ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement