సాక్షి, మదనపల్లె : జిల్లాలో శుక్రవారం మొదలైన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం ఆదివారం సాయంత్రం ముగిసింది. జిల్లాలోని మదనపల్లి, రాయచోటి, పుంగనూరు మున్సిపాలిటీల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. వీటిలో రాయచోటి, పుంగనూరు మున్సిపాలిటీల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు పొటీ చేయకుండా అధికారం అండతో అడ్డుకోవడంతో నామినేషన్లు దాఖలు కాలేదు. దాఖలైన నామినేషన్లలో..
మదనపల్లెలో..
మదనపల్లెలో మున్సిపాలిటీలో 48 వార్డులకు సంబంధించి వైఎస్ఆర్సీపీ 153, బీఎస్పీ రెండు, బీజేపీ 14, కాంగ్రెస్ ఒకటి, టీడీపీ 162, జనసేన 26, స్వతంత్రులు 32 నామినేషన్లు దాఖలు చేశారు. చైర్మన్ పదవికి వైఎస్సార్సీపీ తొమ్మిది, బీఎస్పీ ఒకటి, కాంగ్రెస్ ఒకటి, టీడీపీ ఆరు, స్వతంత్రులు మూడు నామినేషన్లు దాఖలు చేశారు.
రాయచోటిలో..
రాయచోటి మున్సిపాలిటీలో 44 వార్డులు ఉండగా, వీటికి బీజేపీ మూడు, టీడీపీ 61, జనసేన ఒకటి, స్వతంత్రులు మూడు నామినేషన్లు దాఖలు చేశారు. చైర్మన్ పదవికి టీడీపీ ఒకటి, స్వతంత్రులు ఒకటి దాఖలు చేశారు.
పుంగనూరులో..
పుంగనూరు మున్సిపాలిటీలో 36 వార్డులు ఉండగా, వీటికి బీజేపీ 5, సీపీఐ ఒకటి, టీడీపీ 78, జనసేన 11, ఇతర పార్టీలు ఒకటి, స్వతంత్రులు నలుగురు నామినేషన్లు వేశారు. చైర్మన్ పదవికి టీడీపీ తరపున ఎనిమిది నామినేషన్లు దాఖలు చేశారు.
నేతలతో కలిసి జింకా నామినేషన్..
మదనపల్లె మున్సిపల్ చైర్మన్ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా జింకా వెంకటా చలపతి ఆదివారం పార్టీ ముఖ్య నేతలతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. సమన్వయకర్త నిసార్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి, ఎమ్మెల్సీ నరేష్కుమార్ రెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు షమీం అస్లాం, పరిశీలకులు అనీషా రెడ్డి, బావాజాన్, ఉదయ్ కుమార్, సీనియర్ నాయకులు సిపి.సుబ్బారెడ్డి తదితరులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు.
128 వార్డులకు 558, చైర్మన్ స్థానానికి 30 దాఖలు


