రాయచోటికి చీకటి రోజు | - | Sakshi
Sakshi News home page

రాయచోటికి చీకటి రోజు

Oct 19 2026 4:01 AM | Updated on Oct 19 2026 4:01 AM

రాయచోటికి చీకటి రోజు

రాయచోటి అర్బన్‌ : ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజు అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. రాయచోటిలో మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో.. వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై, వాహనాలపై దాడి చేసి నిప్పు పెట్టి అభ్యర్థులను నామినేషన్లు కూడా వేయనీయకుండా చేయడంతోపాటు, రెండు రోజులుగా తనను రాయచోటి పట్టణంలోకి రానీయకుండా నిర్బంధించారని ఆరోపించారు. నామినేషన్ల సమయం పూర్తి అయిన తరువాత ఆయన రాయచోటిలోని తన కార్యాలయానికి చేరుకుని విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రజలకు రాజ్యాంగం కల్పించిన అత్యంత కీలకమైన హక్కు, అలాంటి హక్కును వినియోగించుకునే అవకాశాన్ని అడ్డుకోవడం, నామినేషన్లు దాఖలు చేయకుండా భయానక వాతావరణాన్ని సృష్టించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ధ్వజమెత్తారు. 2025 డిసెంబర్‌ 31వ తేదీ రాయచోటి జిల్లా కేంద్రాన్ని తరలించడంతో నియోజకవర్గ ప్రజలకు ఒక చీకటి రోజు ఎదురైతే, నేడు రాయచోటి పట్టణంలో చోటు చేసుకున్న పరిణామాలు ప్రజాస్వామ్యానికి మరో చీకటి రోజుగా మిగిలిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. నామినేషన్ల ప్రక్రియను అడ్డుకోవడం, పార్టీ నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేయడం, ప్రజల హక్కులను హరించేలా వ్యవహరించడం ప్రజాస్వామ్య వ్యవస్థకే మచ్చ అని విమర్శించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు పోలీసుల అనుమతి కోసం ఎదురు చూసే పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. తన కార్యాలయానికి నిప్పు పెట్టిన అనంతరం మరమ్మతులు చేసుకునేందుకు కూడా పోలీసులు అడ్డుకోవడం, ఫోరెన్సిక్‌ పరిశీలన పేరుతో.. శుభ్రం కూడా చేపట్టడానికి అనుమతించడం లేదన్నారు.

జిన్నా షరీఫ్‌పై అసత్య ప్రచారం ఎందుకు?

వైఎస్సార్‌సీపీ మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి జిన్నా షరీఫ్‌పై అధికార పార్టీ నేతలు చేసిన ఆరోపణలను శ్రీకాంత్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. పాకిస్థాన్‌ నుంచి వ్యక్తులు వచ్చారని, అంతర్జాతీయ ముఠాలకు సంబంధాలు ఉన్నాయని, హత్యాయత్నాలకు కుట్ర పన్నారని చేసిన ప్రచారానికి ఆధారాలేమిటని ప్రశ్నించారు. జిన్నా షరీఫ్‌ వ్యక్తిగత భద్రత కోసం ఏర్పాటు చేసుకున్న సిబ్బంది వద్ద ఉన్నవి లైసెన్స్‌ పొందిన ఆయుధాలని పేర్కొన్నారు. ఆయుధాల లైసెన్స్‌లు, వాటి వినియోగానికి సంబంధించిన అనుమతులపై వాస్తవాలను పరిశీలించకుండా వారిని అనుమానాస్పద వ్యక్తులుగా చిత్రీకరించేలా ప్రచారం చేయడం సరికాదన్నారు. విమానంలో ఆయుధాలను తీసుకురావడానికి సంబంధించిన నిబంధనలు, అనుమతులు సహా అన్ని అంశాలను అధికారిక రికార్డుల ఆధారంగా పరిశీలించాలని సూచించారు. రాజకీయ కుట్రలతో చదువుకుంటున్న యువతపై కేసులు పెట్టి రాక్షసానందం పొందడం మానుకోవాలని హితవు పలికారు.

ప్రజలను భయపెడుతూ..

మహిళలను అవమానిస్తూ..

రాయచోటి పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలను అడ్డుకోవడం, మహిళలను హేళన చేయడం, వాహనదారులను భయభ్రాంతులకు గురిచేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. బయటి ప్రాంతాల నుంచి వచ్చే వారిని నిలువరించడం, నామినేషన్‌ కేంద్రానికి వెళ్లే మార్గాల్లో అడ్డంకులు సృష్టించడం ద్వారా స్వేచ్ఛాయుత ఎన్నికలకు విఘాతం కలిగించారని విమర్శించారు.

15 ఏళ్ల ప్రజాజీవితంలో హింసకు తావివ్వలేదు

తాను ప్రజాప్రతినిధిగా, రాజకీయ నాయకుడిగా ఉన్న ఈ 15 ఏళ్ల కాలంలో ప్రత్యర్థుల ఆస్తులను తగలబెట్టడం, కార్యకర్తలపై దాడులు చేయడం, రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టడం తన విధానం కాదని తెలిపారు. ఎన్నికల సమయంలోనూ ప్రశాంత వాతావరణం ఉండాలని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తాను కోరుకునేవాడినని చెప్పారు. గతంలో పోలింగ్‌ జరగని పరిస్థితులు ఎదురైనా బూత్‌లలోనూ ఎన్నికలు జరిగేలా కృషి చేశామని పేర్కొన్నారు.

ఎన్నికల సంఘం స్పందించాలి

రాయచోటిలో నామినేషన్ల దాఖలుకు అడ్డంకులు సృష్టించారని, అభ్యర్థులు స్వేచ్ఛగా తమ నామినేషన్లు సమర్పించుకునే పరిస్థితి లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలను రాష్ట్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించాలని కోరారు. జరిగిన ఘటనలపై సమగ్ర విచారణ జరిపి అభ్యర్థులందరికీ సమాన అవకాశాలు కల్పించేలా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చివరి రోజైన ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు చోటు చేసుకున్న పరిణామాలను పరిగణనలోకి తీసుకుని, నామినేషన్ల గడువును పొడిగించి అర్హులైన అభ్యర్థులకు అవకాశం కల్పించాలని కోరారు. ప్రజలు తమ వార్డు కౌన్సిలర్లను ఎన్నుకునే ప్రక్రియలో స్వేచ్ఛగా పాల్గొనాలని, ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, నిష్పక్షపాత వైఖరి ఉండాలని సృష్టం చేశారు.

ప్రజలు చైతన్యవంతులు కావాలి

ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత కేవలం రాజకీయ పార్టీలదే కాదని, ప్రతి పౌరుడిపైనా ఉందని పేర్కొన్నారు. యువత, మహిళలు, వ్యాపారులు, ప్రజలు రాజకీయ పరిణామాలను నిశితంగా గమనించాలని కోరారు. తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని అడ్డుకున్న పరిణామాలను మర్చిపోకుండా, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రజలు చైతన్య వంతులు కావాలన్నారు. రాయచోటిలో గతంలో ఉన్న పరిస్ధితులు, ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలను ప్రజలు బేరీజు వేసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని, రాయచోటి ప్రజల హక్కులు, అభివృద్ధి , ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తన పోరాటాన్ని కొనసాగిస్తానని శ్రీకాంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ ఫయాజ్‌ బాషా, వైఎస్సార్‌సీపీ జిల్లా మైనార్టీ అధ్యక్షులు బేపారి మహమ్మద్‌, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ ఫయాజుర్‌ రెహ్మాన్‌, పట్టణ అధ్యక్షుడు నవాజ్‌, పలువురు మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు

పోలీసులు అనుమతిస్తే వేసేందుకు సిద్ధం

ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని, ప్రజలకు ఓటు హక్కు కల్పించాలి

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

గడికోట శ్రీకాంత్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement