గుర్రంకొండ: ‘‘మీకు చేతనైంది చేసుకోండి.. మార్కెట్ యార్డులో మేము చెప్పిందే రేటు, మారేటు ఇంతే’’ అంటూ టమాటా మండీల యజమానులు రైతులను బెదిరించారు. బయట మార్కెట్లతో పోల్చితే గుర్రంకొండ మార్కెట్లో ఒక టమాటా క్రీట్‌పై రూ. 250కుపైగా వేలం పాటల్లో వ్యాపారులు ఇష్టానుసారం కోతలు విధించారు. దీంతో రైతులు మార్కెట్ కార్యాలయాన్ని దిగ్బంధించి గేట్లకు తాళాలు వేసేసి ఎన్‌హెచ్ 340 జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ఆదివారం సాయంకాలం స్థానిక మార్కెట్‌యార్డుకు రైతులు టమాటాలను తీసుకొచ్చారు. మార్కెట్ యార్డులోని మండీల్లో వేలం పాటలు ప్రారంభించారు. ఈరోజు బయట ప్రాంతాల్లోని మార్కెట్లలో ఒక టమాటా క్రీట్ ధర రూ. 500 నుంచి అత్యధికంగా రూ.600 వరకు ధరలు పలికాయి. అయితే గుర్రంకొండ మార్కెట్లో మాత్రం రూ. 300 నుంచి రూ.350లోపే మండీల యజమానులు వేలం పాటల్లో ధరలు పాడుకొన్నారు. దీంతో కడుపుమండిన రైతులు ఇదేమి అన్యాయమంటూ మండీల యజమానులను ప్రశ్నించారు.
రైతుల ఆవేదన
ధరల్లో కోతలు విధించడమే కాకుండా రైతులపై దౌర్జన్యం చేయడానికి మీకు హక్కు ఎవరిచ్చారంటూ రైతులు మండీల యజమానులపై తిరగబడ్డారు. ఎన్‌హెచ్ జాతీయ రహదారి కడప–బెంగుళూరు రోడ్డుపై పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. మూడున్నర గంటల పాటు ధర్నా చేయడంతో వాహనాలు బారులు తీరాయి. విషయం తెలుసుకొన్న వాల్మీకిపురం సీఐ రాఘవరెడ్డి, గుర్రంకొండ ఎస్‌ఐ రవీంద్రబాబు, మార్కెట్‌కమిటీ కార్యదర్శి మదన్‌మోహన్‌రెడ్డి, రైతుల వద్దకు వెళ్లి వారికి నచ్చజెప్పి మార్కెట్‌కమిటీ కార్యాలయం వద్దకు తీసుకెళ్లారు. అక్కడా రైతులు మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని దిగ్భంధించి పెద్ద ఎత్తు నినాదాలు చేశారు. జాక్ పాట్‌ల పేరుతో టమాటాలు ఉచితంగా లాక్కొంటున్నారని, వేలం పాటల్లో పాడిన ధరల కంటే తక్కువకు బిల్లులు ఇస్తున్నారని ఫిర్యాదు చేశారు. కమీషన్లు నాలుగు శాతానికి బదులు పదిశాతం వసూలు చేస్తున్నారని ఇదేమిటని ప్రశ్నించే రైతులకు వేధింపులు తప్పడం లేదని రైతులు వాపోయారు. రైతుల వద్ద టమాటాలను కొనుగోలు చేసిన వ్యాపారులు కోట్లాది రుపాయల బిల్లులు చెల్లించకుండా రైతులను వేధింపులకు గురి చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు, మార్కెట్ కమిటీ అధికారులు, మండీల యజమానులతో చర్చలు జరిపారు.
టమాటా రైతులకు వ్యాపారుల బెదిరింపులు
ఆగ్రహం వ్యక్తం చేసిన అన్నదాతలు
మార్కెట్ కార్యాలయం దిగ్బంధం
జాతీయ రహదారిపై రాస్తారోకో


