పుర పోరులో | - | Sakshi
Sakshi News home page

పుర పోరులో

Oct 17 2026 2:57 AM | Updated on Oct 17 2026 2:57 AM

● పుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డిపై పచ్చమూకల హత్యాయత్నం

● రాయచోటిలో వైఎస్సార్‌ సీపీ కార్యాలయానికి నిప్పు ● కడపలో మీడియా సాక్షిగా వాసు బెదిరింపుల పర్వం

● రాజంపేటలో పచ్చ గూండాల హల్‌చల్‌ ● వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలు చించివేత

సాక్షి ప్రతినిధి, కడప : స్థానిక సంస్థల ఎన్నికలు ఏకపక్షంగా జరగాలని.. ఎలాగైనా సరే గెలుపు టీడీపీదే కావాలని అధిష్టానం ఇచ్చిన ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పచ్చనేతలు రెచ్చిపోతున్నారు. అధికారం అండగా వైఎస్సార్‌సీపీ ప్రజా ప్రతినిధులపై ప్రత్యక్షదాడులకు దిగుతున్నారు. వైఎస్సార్‌, అన్నమయ్య జిల్లాల్లో శుక్రవారం నామినేషన్ల తొలి రోజే భయబ్రాంతులకు గురి చేశారు. పద్ధతిగా పోలింగ్‌ ప్రక్రియ నిర్వహిస్తే ఓటమి తప్పదని గ్రహించి దౌర్జన్యదారిని ఎంచుకున్నారు. ‘ప్రజల చేత స్థానిక సంస్థల ఎన్నికల ఎంపికం’టూ ఎస్‌ఈసీ గొప్పగా మాటలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పూర్తి విభిన్న పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులపై ప్రత్యక్ష దాడులు, హత్యాయత్నాలకు పాల్పడుతున్న ఘటనలు సోషల్‌ మీడియా లో వైరల్‌ అవుతోన్నా సుమోటోగా స్పందించాల్సిందిపోయి, కళ్లుండీ చూడలేని దుస్థితిలో ఎన్నికల అధికారులు ఉన్నారని ప్రజాస్వామ్యవాదులు ఆరోపిస్తున్నారు.

ఎంపీ మిథున్‌రెడ్డిపై హత్యాయత్నం..

పుంగనూరు మున్సిపాలిటీ చైర్మన్‌, కౌన్సిలర్లు అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేయించేందుకు రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి నామినేషన్‌ కేంద్రానికి వెళ్తున్న దారిలో తెలుగుతమ్ముళ్లు మోహరించారు. కర్రలు, కత్తులు.. రాళ్లు.. రాడ్లతో వాహనశ్రేణిపై ప్రత్యక్ష దాడులకు దిగారు. బండరాళ్లతో వాహనాలపై అద్దాలు ధ్వంసం చేశారు. అలాగే ముందుకెళ్తుండగా ఎంపీ సెక్యూరిటీ తలలు పగలగొట్టారు. రక్తం కారుతున్నా కనికరం లేకుండా వెంటాడారు. నామినేషన్‌ కేంద్రంలోకి వెళ్లగానే సుమారు 5వాహనాలను ధ్వంసం చేసి పడవేశారు. ఇంతటి అరాచకం పుంగనూరులో యధేచ్ఛగా రాజ్యమేలుతున్నా అటువైపు పోలీసులు కన్నెత్తి చూడడం, రక్షించడం చర్యలు లేక పోవడం ఆశ్చర్యకరమని పలువురు వాపోతున్నారు.

మంత్రి ప్రోత్సాహం.. చెలరేగిపోయిన శ్రేణులు

రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డి ప్రోత్సాహంతో రాయచోటిలో టీడీపీ శ్రేణులు చెలరేగిపోయాయి. ప్రజాస్వామ్యయుతంగా మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రెస్‌మీట్‌ నిర్వహిస్తే, జవాబు చెప్పలేని స్థితిలో పచ్చమూకలు ధ్వంసరచనకు శ్రీకారం చుట్టారు. ఏకంగా వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి నిప్పు పెట్టారు. అందుబాటులో ఉన్న వాహనాలను పగలగొట్టి పెట్రోల్‌ వెదలిజల్లి నిప్పు పెట్టారు. అంతటితో ఆగకుండా అటువైపు వచ్చిన పోలీసు వాహనాన్ని సైతం ధ్వంసం చేశారు. మునుపెన్నడూ లేని విషసంస్కృతిని రాయచోటిలో పట్టపగలు చూపెట్టారు. మినిష్టర్‌ రౌడీ రాముడు అవతారమెత్తారని విశ్లేషకులు సైతం మండిపడుతున్నారు. పైగా స్వయంగా మంత్రి హోదాలో మీడియాతో మాట్లాడుతూ అభ్యర్థులను భయాందోళనకు గురిచేసేలా మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డిని టార్గెట్‌ చేసి మాట్లాడడంపై ప్రజాస్వామ్య వాదులు విస్తుపోయారు.

ఎన్నికలు నిర్వహించే దమ్ముందా..

కడపలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త, టీడీపీ రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ శ్రీనివాసుల రెడ్డి హల్‌ చల్‌ చేశారు. దమ్ముంటే నామినేషన్లు వేయండంటూ బహిరంగ సవాల్‌ చేశారు. వాసు వ్యాఖ్యలపై ప్రజాస్వామ్యవాదులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలను సజావుగా నిర్వహించే దమ్ము తెలుగుదేశం ప్రభుత్వానికి లేకపోవడంతోనే అరాచకాన్ని భుజానికి ఎత్తుకున్నారని వివరిస్తున్నారు. ఇందులో భాగంగానే కడపలో నామినేషన్లు పర్వం తొలిరోజున 30 డివిజన్‌ కార్పొరేటర్‌గా పోటీ చేసేందుకు వెళ్లిన టి.విజయలక్మి, 51 డివిజన్‌ అభ్యర్థిగా పోటీచేసేందుకు వెళ్లిన పద్మలత నామినేషన్‌ పత్రాలను తెలుగుతమ్ముళ్లు చించేశారు. నామినేషన్‌ కేంద్రానికి ముందు వైపు తిష్టవేసి దౌర్జన్యానికి పాల్పడ్డారు. అలాగే మాజీ కార్పోరేటర్‌ బాలస్వామిరెడ్డి, అభ్యర్థి పద్మలతపై ప్రత్యక్ష దాడికి తెగబడ్డారు. ఇలాంటి దుశ్చర్యలకంటే నామినేటెడ్‌ తరహా స్థానిక సంస్థలను కూడా ఎంపిక చేసుకున్న వ్యక్తులకు కట్టబెడితే సరిపోతుంది కదా?నని పలువురు ప్రశ్నిస్తుండడం విశేషం.

ప్రజాస్వామ్యం అపహాస్యం..

పుంగనూరులో నిర్దేశించిన సమయానికి నామినేషన్‌ కేంద్రంలో అభ్యర్థులున్నా వారి నామినేషన్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి నారాయణరెడ్డి (ఎస్‌డీసీ) స్వీకరించలేదు. నామినేషన్లు ఎందుకు తీసుకోరంటూ స్వయంగా ఎంపీ మిథున్‌రెడ్డి ప్రశ్నించినా మౌనమే ఆయన సమాధానమైంది. గంట తర్వాత నామినేషన్లు స్వీకరించినా వాటికి రశీదు ఇవ్వలేదు. నామినేషన్‌ డిపాజిట్టు సైతం స్వీకరించలేదు. 3గంటలు తర్వాత నామినేషన్‌ పత్రాలు వెనక్కి ఇచ్చారు. సీఎంఓ నుంచి ఉన్న డైరెక్షన్‌ మేరకు ఎస్‌ఈసీ నిబంధనలను సైతం ఆర్వో నారాయణరెడ్డి విస్మరించారు. ఈ పరిస్థితులు గమనిస్తే రాష్ట్ర ఎన్నికల కమీషన్‌ వ్యవహారశైలి ఇట్టే అర్థమవుతోంది. నిష్పక్షపాత ఎన్నికలంటూ చెప్పేందుకు మినహా ఆచరణలో చిత్తశుద్ధి లోపించిందని ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఎర్రగుంట్లలో, రాజంపేటలో తెలుగు తమ్ముళ్లు పలుచోట్ల దౌర్జన్యాలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement