● మున్సిపల్ సీట్ల కోసం బీజేపీ చిట్టా
● పుంగనూరు టీడీపీ అభ్యర్థి కోసంవెతుకులాట
సాక్షి, మదనపల్లె: మున్సిపల్ ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్ ప్రారంభమవుతుండగా కూటమి పార్టీలో పదవుల పంపకాలు ఇంకా తేలనేలేదు. అభ్యర్థుల ప్రకటన ఊసే లేదు. గురువారం పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌పై జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ.జనార్దన్ రెడ్డి, జిల్లా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జీలు, బీజేపీ నేతలు చల్లపల్లి నరసింహారెడ్డి, నరేందర్ రెడ్డి, జనసేన నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తొలి విడతలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో మదనపల్లి, రాయచోటి, పుంగనూరు మున్సిపాలిటీల్లో చైర్మన్, కౌన్సిల్ స్థానాల్లో కూటమి అభ్యర్థులకు కేటాయించే విషయంలో చర్చించారు. బీజేపీ తెచ్చిన సీట్ల ప్రతిపాదనపై మంత్రుల నుంచి ఎలాంటి హామీ దక్కలేదని సమాచారం. మూడు పార్టీలకు చెందిన జిల్లా అధ్యక్షుల అధ్యక్షతన ఏర్పాటుచేసిన కమిటీ ద్వారా సీట్ల పంపకంపై సమన్వయం చేయాలని నిర్ణయించి సమావేశం ముగించారని తెలిసింది.
● మదనపల్లె మున్సిపల్ చైర్మన్ పదవి కోసం టీడీపీ నుంచి ముగ్గురు నాయకులు తీవ్ర స్థాయిలో ప్రయత్నిస్తున్నారు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని గుర్తించాలని గట్టిగా ప్రయత్నిస్తుండగా, చినబాబును అడ్డుకునేందుకు ఎమ్మెల్యే వర్గం నుంచి మరొకరిని గట్టిగా ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది.
పుంగనూరు టీడీపీలో అసంతృప్తి
పుంగనూరు చెర్మన్ అభ్యర్థి కోసం టీడీపీ అధిష్టానం వెతుకులాటలో పడింది. చైర్మన్ పదవిని బీసీ మహిళకు కేటాయించడంతో పార్టీలో ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఇతర పార్టీల్లో ఉన్న బీసీ మహిళ కోసం ప్రయత్నాలు చేస్తుండటంపై టీడీపీ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్టీ కోసం కష్టపడుతున్న వారిని గుర్తించకుండా, పార్టీలో లేని వారికి పట్టం కడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


