రాయచోటి అర్బన్ : అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని పాతరేసే చర్యలు చేపట్టడం దురదృష్టకరమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం సాయంత్రం ఎన్నికల ప్రచారం చేస్తున్న బీసీ నాయకుడు విజయభాస్కర్‌పై దాడి చేసిన సంఘటనతో పాటు పలువురికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఫోన్ ద్వారా నామినేషన్లు వేయకూడదని హుకుం జారీ చేసిన ఘటనపై ఆయన స్పందించారు. ఇలాంటి కార్యక్రమాలతో చాలా కాలం మనుగడ సాధించలేరని, ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి విలువలు లేకుండా చేసే పరిస్ధితి నెలకొందన్నారు. గత 15 రోజులుగా పోటీ చేసే అభ్యర్థులు నో డ్యూస్ సర్టిఫికేట్లు జారీ చేయనీయకుండా అధికారులను బెదిరించి, రౌడీల ద్వారా అభ్యర్థులను కూడా బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి సంస్కృతి గతంలో ఎప్పుడూ లేదని తెలిపారు. రాయచోటి నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం కోసం ఎంతో కష్టపడ్డామని, ప్రస్తుతం అరాచక పరిస్థితి తీసుకొచ్చారని వాపోయారు. అరాచకం సృష్టించేవారు తగిన సమయంలో మూల్యం చెల్లించుకోక తప్పదని పేర్కొన్నారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
గడికోట శ్రీకాంత్ రెడ్డి


