● భార్యను దారుణంగా హత్య చేసిన భర్త
మదనపల్లె టౌన్: అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లెలో భర్తే భార్యను అత్యంత దారుణంగా హత్య చేసిన సంఘటన గురువారం తీవ్ర కలకలం రేపింది. భార్యపై వివాహేతర సంబంధం అనుమానం పెనుభూతమై, జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన వారంలోనే భర్త ఈ ఘాతుకానికి పాల్పడటం స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. వన్ టౌన్ సీఐ మోహన్ కుమార్, ఎస్‌ఐ రహీముల్లా తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి: కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా ములబాగల్ కురుప్పేటకు చెందిన షేక్ నవీద్ బాష (28) స్కూటర్ మెకానిక్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. 13 ఏళ్ల క్రితం అదే ప్రాంతానికి చెందిన రూబియా తాజ్ (25)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి నలుగురు సంతానం ఉన్నారు. కొంతకాలంగా భార్యపై అనుమానం పెంచుకున్న నవీద్, ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించడం ప్రారంభించాడు. పెద్దలు పలుమార్లు పంచాయతీలు చేసినా అతని ప్రవర్తన మారలేదు. భర్త వేధింపులు తట్టుకోలేక ఐదు నెలల క్రితం రూబియా పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత తల్లి నచ్చజెప్పడంతో ములబాగల్‌కు తిరిగొచ్చినా.. భర్తతో కలిసి ఉండకుండా వేరుగా అద్దె గదిలో నివసించసాగింది. నెల రోజుల క్రితం కాపురానికి రావాలని నవీద్ బలవంతం చేయడంతో గొడవ జరిగి, రూబియా ములబాగల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నవీద్ భాషను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. వారం రోజుల క్రితం బెయిల్‌పై విడుదలైన అతను, మనసులో కక్ష ఉంచుకుని పైకి మాత్రం మారిపోయినట్లు నటించాడు. ‘గతంలో జరిగిన అవమానాలు మరిచిపోయి అన్యోన్యంగా జీవిద్దాం, మనకు పట్టిన శని వదిలిపోవాలంటే దర్గాలకు వెళ్లి వద్దాం‘ అని భార్యను నమ్మించాడు. తన నలుగురు పిల్లలను తల్లి వద్దే వదిలేసి, జైలులో వేసుకున్న పథకం ప్రకారం భార్యను ములబాగల్ నుంచి పలమనేరు, పుంగనూరు దర్గాలకు తీసుకెళ్లాడు. బుధవారం సాయంత్రం మదనపల్లెకు చేరుకుని ఎన్టీఆర్ సర్కిల్‌లోని ఓ లాడ్జిలో గది తీసుకున్నారు.
బీరు బాటిల్‌తో దాడి.. గొంతు కోసి హత్య
బుధవారం రాత్రి హోటల్ నుంచి భోజనం, మద్యం తెచ్చుకుని ఇద్దరూ సేవించారు. రాత్రి 11:30 గంటల సమయంలో రూబియా తాజ్ బాత్రూమ్‌కు వెళ్తుండగా, నవీద్ వెనుక నుంచి బీరు బాటిల్‌తో ఆమె తలపై బలంగా కొట్టాడు. ఆమె కిందపడిపోగానే పగిలిన బాటిల్ ముక్కతో గొంతులో పొడిచి హత్య చేశాడు. రాత్రంతా శవం పక్కనే గడిపిన నిందితుడు, గురువారం ఉదయం 6 గంటలకు స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పరిధి తమది కాకపోవడంతో టూ టౌన్ పోలీసులు వన్ టౌన్ పోలీసులకు సమాచారం అందించి నిందితుడిని అప్పగించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లి ఫామీద ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చిన్నారుల రోదనలు.
కన్నతల్లి శాశ్వతంగా దూరమైందని, తండ్రి హంతకుడిగా జైలుకు వెళ్లాడని తెలియని నలుగురు చిన్నారులు తమ నానమ్మతో కలిసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ ఆ పిల్లలు బిక్కుబిక్కుమంటూ ఏడుస్తున్న దృశ్యాలు చూసి స్థానికులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. కేవలం అనుమానం కారణంగా ఒక పచ్చని కుటుంబం రోడ్డున పడటంపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


