నియామక పత్రాలు పంపిణీ | - | Sakshi
Sakshi News home page

నియామక పత్రాలు పంపిణీ

Oct 15 2026 8:24 AM | Updated on Oct 15 2026 8:24 AM

మదనపల్లె సిటీ : జిల్లాలోని కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న బోధనా సిబ్బంది పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా ఎంపికైన 16 మంది అభ్యర్థులకు నియామకపత్రాలు అందజేశారు. బుధవారం మదనపల్లెలోని సమగ్రశిక్ష కార్యాలయంలో డీఈఓ సుబ్రమణ్యం, సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్‌ ఎన్‌.అనూరాధ అభ్యర్థులకు నియామకపత్రాలు అందించారు. సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్‌ అనురాధ మాట్లాడుతూ నియామకపత్రాలు పొందిన అభ్యర్థులు తమకు కేటాయించిన కేజీబీవీ పాఠశాలల్లో రిపోర్టు చేసి, విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ జీసీడిఓ యశోధాబాయ్‌, సమగ్రశిక్ష కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

మున్సిపల్‌ వార్డులో పోటీ

బీఎస్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్‌

సాక్షి, మదనపల్లె : మదనపల్లె మున్సిపల్‌ ఎన్నికల్లో 32వ వార్డుకు పోటీ చేస్తున్నట్టు బీఎస్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు బందెల గౌతమ్‌ కుమార్‌ అన్నారు. బుధవారం జరిగిన సమావేశంలో అభ్యర్థిగా గూడుపల్లి అరుణ్‌ కుమార్‌ను ప్రకటించారు. వార్డు పరిధిలోని గాంధీపురం, కుమారపురం, బండమీద, నమాజ్‌ కట్ట, గాండ్లవంక ప్రాంతాల ప్రజలు గెలిపించాలని కోరారు. ప్రజల సమస్యల పరిష్కారం, వార్డు అభివృద్ధి, బహుజనుల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు.

సీఐల బదిలీ

కలికిరి : కర్నూలు రేంజ్‌ పరిధిలోని సీఐల బదిలీల్లో భాగంగా కలికిరి అప్‌గ్రేడ్‌ స్టేషన్‌ సీఐ ఎస్‌.అనిల్‌కుమార్‌ను అన్నమయ్య జిల్లా సోషల్‌ మీడియా, సైబర్‌ నేరాల విభాగానికి బదిలీ చేస్తూ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే అన్నమయ్య జిల్లా స్పెషల్‌ బ్రాంచ్‌లో విధులు నిర్వహిస్తున్న సీఐ సాయి ప్రసాద్‌ను కలికిరి అప్‌గ్రేడ్‌ పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ చేశారు.

ఉప ఖజానా కార్యాలయం తనిఖీ

తంబళ్లపల్లె : తంబళ్లపల్లెలోని ఉప ఖాజానా కార్యాలయాన్ని బుధవారం జిల్లా ట్రెజరీ అకౌంట్స్‌ అఽధికారి లోకేష్‌బాబు తనిఖీ చేశారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ట్రెజరీ కార్యాలయంలోని 2025–26 సంవత్సరానికి సంబంధించిన వివిధ రికార్డులను పరిశీలించారు. పెన్షన్లు, ట్రెజరీ బిల్లుల రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. తనిఖీ బృందంలో ఎస్‌టీఓలు రమేష్‌రెడ్డి, మార్తమ్మ,సీనియర్‌ అకౌంటెట్లు వెంకటేష్‌, హరీష్‌, వెంకటక్రిష్ణ, జెఎ శ్రీనివాసులు, సిబ్బంది ఈశ్వరమ్మ, ప్రవీణ్‌లు పాల్గొన్నారు.

జాతీయ స్థాయి

రగ్బీ పోటీలకు ఎంపిక

వాల్మీకిపురం : జాతీయ స్థాయి అండర్‌– 14 రగ్బీ పోటీలకు మంచూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న లోహితపద్మ, అభినవ క్రిష్ణలు ఎంపికై నట్లు పాఠశాల హెచ్‌ఎం చంద్రశేఖర్‌ తెలిపారు. ఈ నెల 9, 10వ తేదీల్లో మంచూరులో జరిగిన ఎస్‌జీఎఫ్‌ రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ చూపి జాతీయ స్థాయి జట్టుకు ఎంపికై నట్లు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు రెడ్డివరప్రసాద్‌ తెలిపారు. వీరు ఢిల్లీలో ఈ నెల 23 నుంచి 28వ తేదీ వరకు జరిగే జాతీయ స్థాయి రగ్బీ పోటీల్లో రాష్ట్రం తరపున ఆడుతారని తెలిపారు.విద్యార్థులను ఉపాధ్యాయ బృందం అభినందించింది.

బాలికలకు సమానత్వం

కల్పించడం అందరి బాధ్యత

కడప అర్బన్‌: సమాజంలో బాలికలకు సమానత్వం కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా న్యాయసేవాధికారసంస్థ సెక్రటరీ, జడ్జి ఎస్‌.బాబా ఫకృద్దీన్‌ పేర్కొన్నారు. బుధవారం ‘అంతర్జాతీయ బాలికా దినోత్సవం’పై కడపలోని రిమ్స్‌ నర్సింగ్‌ కళాశాలలో విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈసందర్భంగా జడ్జి మాట్లాడుతూ సమాజంలో బాలికలపై వివక్షతను రూపుమాపి, వారికి సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరాన్ని తెలియజేశారు. బాల్యవివాహాల నిర్మూలన, మహిళలు, బాలికలపై జరిగే వేధింపులను అరికట్టేందుకు అమలులో ఉన్న చట్టాలు, రాజ్యాంగం కల్పించిన హక్కులు, ఉచిత న్యాయ సహాయం గురించి అవగాహన కల్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement