భారీ సైబర్‌ మోసం! | - | Sakshi
Sakshi News home page

భారీ సైబర్‌ మోసం!

Oct 15 2026 8:24 AM | Updated on Oct 15 2026 8:24 AM

● ఓ టీడీపీ నేత ఖాతాలో రూ.93 లక్షలు

● వ్యాపారం పేరుతో మోసం చేసే ముఠాతో లింకులు

● మదనపల్లెలో కేసు నమోదు

సాక్షి, మదనపల్లె : విదేశీ వ్యాపారం పేరుతో భారీగా లాభాలు అర్జించవచ్చునని నమ్మించి మోసం చేసే సైబర్‌ ముఠా వ్యవహారం మదనపల్లెలో వెలుగులోకి వచ్చింది. దీనిపై గత నెలలో టీడీపీకి చెందిన ఓ మాజీ కౌన్సిలర్‌ పై టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. దీనికి సంబంధించిన దర్యాప్తు రహస్యంగా సాగుతోంది. విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు వివరాలు. మదనపల్లెకు చెందిన ఓ మాజీ కౌన్సిలర్‌ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పార్టీ మారి టీడీపీలో చేరి నాయకుడిగా చలామణి అవుతున్నాడు. ఇతనికి సోషల్‌ మీడియా ద్వారా ఓ ముఠా పరిచయం అయింది. వీరు విదేశాల నుంచి వస్తువులు దిగుమతి చేస్తామని, వ్యాపారం చేసి భారీగా అర్జించవచ్చునని నమ్మించి పలువురిని మోసం చేస్తుంటారు. ఇలా మోసానికి గురవుతున్న బాధితులు వారు చెప్పిన బ్యాంకు ఖాతాలకు పెట్టుబడి రూపంలో లక్షలాది రూపాయలు జమ చేసుకుంటారు. ఖాతాలో డబ్బు జమ కాగానే ఆ డబ్బును ఖాళీ చేస్తారు. ఇందులో భాగంగా మదనపల్లెకి చెందిన ఓ వ్యక్తి వీరి మాయలో పడి రూ.20 లక్షలు ఖతాకు జమ చేశాడు. ఇలాంటి మోసాల్లో భాగంగా ఇక్కడి మాజీ కౌన్సిలర్‌ కు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా లో ఖాతా ఉంది. ఈ ఖాతాలో రూ.93 లక్షలు జమ అయ్యాయి. తర్వాత ఈ డబ్బును మరో ఖాతాకు మళ్లించుకున్నారు. ఇది ఆ మాజీ కౌన్సిలర్‌ మొబైల్‌ కు వచ్చిన ఓటీపీ ఆధారంగా జరిగింది. మోసపోయిన మదనపల్లెకు చెందిన ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా గత నెలలో కేసు నమోదు చేశారు. విచారణ మొదలుపెట్టిన పోలీసులకు మాజీ కౌన్సిలర్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆరాతీస్తే రూ.93 లక్షలు జమ అయ్యాక.. మరో ఖాతాకు మళ్లించుకున్నారు. ఇంత భారీ నగదు ఎక్కడెక్కడి నుంచి జమ అయ్యింది, ఇలాంటి ఖాతాలు ఇంకా ఎన్ని ఉన్నాయి అన్న కోణంలో విచారణ చేపట్టిన పోలీసులకు వీటి మూలాలు దేశంలోని పలుచోట్ల ఉన్నట్టు గుర్తించారు. బాధితులు కూడా ఉన్నట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ సైబర్‌ మోసం వ్యవహారంలో బాధితులు కోట్లు మోసపోయి ఉండవచ్చునని భావిస్తున్నారు. ప్రస్తుతానికి ఒక ఖాతా లావాదేవీలను పరిశీలిస్తున్న పోలీసులు, మాజీ కౌన్సిలర్‌ తోపాటు ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న సభ్యుల వివరాలు, వారి ఖాతాలను పరిశీలించే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై బుధవారం రాత్రి ఓ పోలీసు అధికారి వివరణ కోరగా మాజీ కౌన్సిలర్‌ పై కేసు నమోదు చేశామని, దర్యాప్తు జరుగుతోందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement