మదనపల్లె సిటీ : న్యూఢిల్లీలో 12వ జాతీయ స్థాయి ఇన్‌స్పైర్ మనక్ ఎగ్జిబిషన్ అండ్ ప్రాజెక్టు కాంపిటీషన్‌లో జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థినులు విశేష ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో అవార్డులు సాధించారు. దేశవ్యాప్తంగా అత్యుత్తమంగా నిలిచిన టాప్–40 ప్రాజెక్టులలో స్థానం దక్కించుకున్నారు. 2023–24 విద్యా సంవత్సరానికి బి.కొత్తకోటలోని సిద్దార్థ ఇంగ్లీషు మీడియం ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని మహిత ‘ఇంటెలిజెంట్ వెహికల్ విత్ ఆల్కాహాల్ డిటక్షన్ ఫర్ డ్రైవర్స్,స్మార్ట్ హారన్‘అనే ఎగ్జిబిట్, రాయచోటి ఏపీ మోడల్ స్కూల్‌కు చెందిన ఎం.సిరి ‘మల్టిఫర్‌ఫస్ అగ్రికల్చర్ రోబో’అనే ఎబ్జిబిట్‌కు జాతీయ స్థాయిలోఅవార్డులు అందుకున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ సుబ్రమణ్యం, జిల్లా సైన్సు అధికారి శ్రీధర్‌కుమార్ విద్యార్థులతో పాటు విద్యార్థుల విజయానికి కృషి చేసిన గైడ్ టీచర్లు, పాఠశాల ఉపాధ్యాయులను అభినందించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ స్థాయిలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేలా అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు.


