నెత్తురోడిన రహదారులు | - | Sakshi
Sakshi News home page

నెత్తురోడిన రహదారులు

Oct 15 2026 8:24 AM | Updated on Oct 15 2026 8:24 AM

● వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

కారు ఢీకొని వృద్ధుడు..

సంబేపల్లె: మండల పరిధిలోని చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పసుపులేటి రెడ్డిరామయ్య (62) అనే వృద్ధుడు మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మండల పరిధిలోని ప్రకాష్‌నగర్‌ కాలనీ అనుబంధ గ్రామమైన గొల్లపల్లెకు చెందిన రెడ్డిరామయ్య తన వ్యక్తిగత పనుల నిమిత్తం బైక్‌లో సంబేపల్లెకు వచ్చాడు. పనులు ముగించుకుని తిరిగి గొల్లపల్లెకు వెళ్తుండగా.. ప్రకాష్‌నగర్‌ కాలనీ వద్దకు రాగానే పీలేరు వైపు నుంచి అతివేగంగా వచ్చిన కారు అదుపు తప్పి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రెడ్డిరామయ్యను స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న రెడ్డిరామయ్య మృతి చెందడంతో కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు సంబేపల్లె పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రెండు బైక్‌లు ఢీకొని..

రాయచోటి : రాయచోటి–సుండుపల్లి మార్గంలోని సద్దికోళ్ల వంక వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. బుధవారం సాయంత్రం ఎదురెదురుగా వచ్చిన రెండు బైకులు ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సుండుపల్లి మండలం, సీతంపేట గ్రామానికి చెందిన కిషోర్‌ (27) ప్రమాదంలో మృతి చెందగా, అతని కుమారుడు, మరో బైక్‌పై వస్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి. గురువారం సాయంత్రం రాయచోటి వైపు నుంచి స్వగ్రామానికి కిషోర్‌, సుండుపల్లి నుంచి రాయచోటికి మరో ఇద్దరు యువకులు బైకుల్లో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన ముగ్గురిని చికిత్స నిమిత్తం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు రాయచోటి పోలీసులు తెలిపారు.

బొలెరో..తుఫాన్‌ వాహనాలు ఢీకొని..

మదనపల్లె టౌన్‌: అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం లోని బొమ్మనచెరువు వద్ద బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మదనపల్లె తాలూకా పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రామసముద్రం నుంచి మదనపల్లెకు కొత్తిమీర తరలిస్తున్న బొలెరో వాహనం, మదనపల్లె నుంచి రామసముద్రానికి ప్రయాణికులను తరలిస్తున్న తుఫాన్‌ వాహనం బొమ్మన చెరువు మందబండ మలుపు వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తుఫాన్‌ వాహనంలో ప్రయాణిస్తున్న చంబకూరు మాలపల్లికి చెందిన మునెప్ప కుమారుడు గురప్ప (70) అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. తీవ్రంగా గాయపడిన మరో నలుగురిని స్థానికులు జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఘటనపై తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు పచ్చని కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతున్నాయి. అన్నమయ్య జిల్లాలో బుధవారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement