అన్నమో.. నారాచంద్రా! | - | Sakshi
Sakshi News home page

అన్నమో.. నారాచంద్రా!

Oct 14 2026 1:41 AM | Updated on Oct 14 2026 1:41 AM

సాక్షి, మదనపల్లె : చంద్రబాబు ప్రభుత్వంలో బియ్యం ధరలు రాకెట్లా దూసుకుపోతున్నాయి. అధిక ధరల భారంతో పేదలు మళ్లీ నాణ్యమైన భోజనానికి దూరం అయ్యే ప్రమాదం కనిపిస్తోంది. నెల క్రితం వరకు అందుబాటులో ఉన్న బియ్యం ధరలు గడచిన రెండు వారాల్లో అమాంతం పెరిగాయి. పేదలు కొనలేని స్థాయికి ధరను పెంచేశారు. వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచుతున్నా దాన్ని కట్టడికి అధికార యంత్రాంగం ఇప్పటిదాకా ఒక్క చర్య చేపట్టలేదు. అసలే జిల్లాలో కరువు పరిస్థితులతో పేదల జీవన స్థితిగతులు మారిపోతున్నాయి.

రెండు నెలల్లోనే

జిల్లా వ్యాప్తంగా బియ్యం ధరలు రెండు నెలల వ్యవధిలో ఊహించిన విధంగా ధరల్లో మార్పు వచ్చింది. 26 కిలోల బస్తా బియ్యం రూ.1,200 ఉండేది, ఆగస్టు చివర్లో ధర రూ.1,400లోపు ఉండేది. సెప్టెంబర్‌లో మెల్లగా పెరుగుతూ రూ.1,700కు పెరిగింది. అక్టోబర్‌ ప్రారంభం కాగానే ఒక్కసారిగా ధర ఆకాశాన్ని అంటింది. 26కిలోల బస్తా ధరపై రూ.400 భారం మోపి రూ.2,100కు పెంచేశారు. ప్రస్తుతానికి ఈ ధర ఉండగా రోజు గడిస్తే ఇంకెంత ధర పెరుగుతుందన్న ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది.

రూ.కోట్లలో దోపిడీ

26 కిలోల బస్తాపై రెండు వారాల్లోనే రూ.400 పెరగడంతో వ్యాపారుల పంట పండింది. పాత స్టాక్‌ను కూడా పెంచిన ధరలకే విక్రయిస్తున్నారు. రోజుకు వందల టన్నుల్లో బియ్యం కొనుగోళ్లు జరుగుతుంటాయి. బస్తాపై వంద పెరిగినా వ్యాపారుల ఆదాయం భారీగా ఉంటుంది. అలాంటిది రూ.1,200 నుంచి రూ.2,100కు అంటే 26 కిలోల బస్తాపై ఏకంగా రూ.900 పెరిగితే వ్యాపారుల ఆదాయం ఏస్థాయికి చేరిందో స్పష్టంగా కనిపిస్తోంది. పెరిగిన ధరలతో ప్రజలు కోట్ల సొమ్మును నష్టపోతున్నారు. వైఎస్‌ఆర్సీపీ ప్రభుత్వంలో ఇంతటి ధరలు ఎప్పుడూ పలకలేదు. సన్న బియ్యం ధరలు సామాన్యులకు అందుబాటులో, అందులోనూ నిలకడగా ఉండేవి. ప్రస్తుతం పెరిగిన ధరలతో వ్యాపారులు కోట్లలో సొమ్ము చేసుకుంటున్నారు.

నియంత్రణ ఎక్కడ?

జిల్లా కేంద్రం మదనపల్లె సహా జిల్లా అంతటా బియ్యం ధరలు మండిపోతుంటే నియంత్రణ ఎక్కడా కనిపించడం లేదు. ఉన్నట్టుండి ధరలు విపరీతంగా పెరిగిపోతుంటే నియంత్రించాల్సిన ప్రభు త్వం చోద్యం చూస్తోంది. ధరలను అదుపు చేసేందుకు ఒక్క చర్య చేపట్టిన దాఖలాలు లేవు. పెరుగుతున్న బియ్యం ధరలపై తక్షణమే అధికారం యంత్రాంగం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

జిల్లాకు 384 బస్తాలంట..

దూసుకుపోతున్న బియ్యం ధరలను అదుపు చేయాల్సిన ప్రభుత్వం కంటి తుడుపు చర్య చేపట్టింది. ప్రభుత్వం తరఫున రైతు బజార్లలో బియ్యం విక్రయాలకు నిర్ణయించింది. అన్నమయ్య జిల్లా మొత్తానికి 384 బియ్యం బస్తాలను కేటాయించింది. వీటి ధర కిలో 50 రూపాయలుగా నిర్ణయించి విక్రయిస్తుంది. ఈ 384 బస్తాలను కేవలం మదనపల్లె, పీలేరు, రాయచోటి రైతు బజార్లో ఉంచి ప్రజలకు విక్రయిస్తారు. జిల్లా మొత్తానికి బియ్యం ధరల అదుపునకు ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యను చూసి ప్రజలు నవ్విపోతున్నారు. ఒక్కో రైతు బజార్‌కు 150 బస్తాలు కూడా రావు. అలాంటిది జిల్లాలో ప్రజలు కోట్లలో నష్టపోతుంటే ఇలాంటి చర్యలు ప్రభుత్వం అభాసు పాలయ్యేలా చేస్తోంది. జిల్లాలో ని అన్ని మండల కేంద్రాల్లో బియ్యం విక్రయాలను ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు.

మార్కెట్లో బియ్యం కొనలేని పరిస్థితులు

15 రోజులు క్రితం 26 కిలోల బియ్యం ప్యాకెట్‌ రూ.1,700

రూ.400 పెరిగి ఇప్పుడు రూ.2,100

ప్రజల నుంచి రూ.కోట్లలో దోపిడీ

ధరల నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యం

ధరలతో భారమైంది

బియ్యం ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడం భారంగా మారింది. బియ్యం బస్తా రూ.1,200 నుంచి రూ.2వేలు దాటిపోయింది. కూలి పనులు వెళ్లి కుటుంబాన్ని పోషించుకొంటున్నాం. బియ్యం ధరేకాక నిత్యావసరాల ధరలు, కూరగాయల ధరలు కూడా పెరిగిపోయి అదనంగా ఆర్థిక భారం పడుతోంది. కుటుంబానికి రెండునెలలుగా వ్యయం వందశాతం పెరిగింది.

–హుసేన్‌బీ, కురబలకోట మండలం

డబ్బే మిగలడం లేదు

దినసరి కూలి పనులు చేసి కుటుంబాన్ని పోషించాలి. బెంగళూరు వెళ్లి పనులు చేసుకుని సంపాదించిన సొమ్ముతో నెలకోసారి ఇంటికి వస్తాను. ఇంటికి అవసరమైన నెలసరి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడంతో కూలీ సొమ్మంతా సరిపోతోంది. మూడు వారాల క్రితం 26 కిలోల బియ్యం రూ.1,500 ఉండేది. ఇప్పుడు వెళ్లే రూ.2,200 చెబుతున్నారు. పెరిగిపోయిన అన్ని ధరలతో ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం ధరలపై చర్యలు తీసుకోవాలి.

–ఇడగొట్టి జయరాం, పెద్దతిప్పసముద్రం మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement