పునాసా మామిడి.. భలే దిగుబడి | - | Sakshi
Sakshi News home page

పునాసా మామిడి.. భలే దిగుబడి

Oct 14 2026 1:41 AM | Updated on Oct 14 2026 1:41 AM

రాయచోటి టౌన్‌ : మామిడిలో అనేక రకాలు మార్కెట్లోకి వచ్చాయి. వీటిలో ఇప్పుడు పునాసా రకం మంచి లాభాలు తెచ్చిపెడుతోంది. ఈ మామిడి కాయలు పచ్చివిగా ఉన్నప్పడు పచ్చళ్లకు డిమాండ్‌ పలుకుతున్నాయి. పచ్చివిగా ఉన్నప్పుడు చాలా పుల్లగా ఉండటంతో వీటిని ఊరగాయల కోసం కూడా ఉపయోగిస్తున్నారు. దీంతో ఊరగాయ, ఆవకాయ కోసం వినియోగిస్తున్నారు. మొక్కలు నాటిన మూడో ఏడాది నుంచి దిగుబడి వస్తోంది. దీంతో ఏడాదికి ఒక సారి మాత్రమే వచ్చే.. మామిడి స్థానంలో రైతులు వీటిని తీసుకొస్తున్నారు. ఇప్పటి వరకు రాయచోటి డివిజన్‌ పరిధిలో సుమారు 200 ఎకరాల వరకు సాగు చేశారు. వీటిని ఎకరానికి 150–170 మొక్కల వరకు నాటుకోవచ్చు. చెట్లు 10 అడుగులకు మించిపోకుండా కత్తిరించుకోవాలి (ఫ్రూనింగ్‌ చేసుకోవాలి). వీటికి నిరంతరం పూత వస్తూనే ఉంటుంది. మధ్యలో కాయలు ఉంటాయి. సస్యరక్షణ చర్యలు తీసుకొంటుంటే నిరంతరం రైతులకు ఫలాలిస్తుంటాయి. చిన్న చెట్టు ఉన్నప్పటి నుంచే కనీసం 200–300 కాయలు దిగుబడిని ఇస్తుంటాయి. సాధారణంగా ఇవి మంచి సైజులో ఉంటే కిలోకు 2–3 కాయలు తూగుతాయి. సాధారణంగా ఒక్కొక్క చెట్టుకు వంద కిలోలకు తక్కువ లేకుండా కాయలు కాస్తాయి. ఈ లెక్కన మార్కెట్‌లో కిలో రూ.20 పలికినా ఒక చెట్టు నుంచి రూ.2000 ఆదాయం వస్తుంది. అంటే ఎకరానికి రూ.3 లక్షలు తక్కువ కాకుండా వస్తుంది. మార్కెట్‌లో డిమాండ్‌ను బట్టి ఇంకా ధరలు పలికే అవకాశం ఉంటుంది. అందుకే మార్కెట్‌ డిమాండ్‌ను ఉంచుకొని రైతులు ఇలాంటి రకాలను సాగు చేస్తున్నారు.

రైతులను ప్రోత్సహిస్తున్నాం

మామిడిలో కొత్త రకాలను ప్రోత్సహిస్తున్నాం. పునాసా ఏడాదిలో 2–3 దశలగా కాపు వస్తుంది. దీనిపై రైతులు ఇప్పుడిప్పుడే ఇష్టం చూపుతున్నారు. నియోజకవర్గ పరిధిలోని రాయ చోటి, సంబేపల్లె, చిన్నమండెం, గాలివీడు, లక్కిరెడ్డిపల్లె, రామాపురం మండలాలలో 200 ఎకరాల వరకు సాగులో ఉంది. ఈ మామిడికి మా ర్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. దీంతో రైతులకు లాభాలు కూడా తెచ్చిపెడుతున్నాయి. సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్న వారిని ప్రోత్సహిస్తున్నాం. తేనె మంచు పురుగు, రసం పీల్చు పురుగు నివారణ కోసం వేపనూనెకు డిటర్‌జెంట్‌ ఫౌడర్‌తో కలసి పిచికారి చేసుకొంటే నివారించు కోవచ్చు. ఏ సమయానికి ఎలాంటి మందులు పిచి కారి చేయాలనే నియమాలు తెలియజేస్తున్నాం.

– సురేష్‌, ఉద్యాన శాఖ

అధికారి, రాయచోటి

ఏడాది మొత్తం కాయలే..

పచ్చళ్లు, పండ్ల కోసం అధిక డిమాండ్‌

రోజూ మార్కెటింగ్‌

నిత్యం పర్యవేక్షణ చేస్తుండాలి

పునాసా మామిడి తోటను నిత్యం పర్యవేక్షిస్తుండాలి. అప్పుడు మనం అనుకున్న విధంగా ఆదాయం వస్తుంది. కాపు పూర్తి కాగానే ఫ్రూనింగ్‌ చేయాలి. అప్పుడే కొత్త ఇగుర్లు, పూత వస్తుంది. నేను కడపలో న్యాయవాది కోర్సు చివరి సంవత్సరం చదువుతున్నాను. నాకు వ్యవసాయం చాలా ఇష్టం.. కాబట్టి ఇలాంటి కొత్త రకాల పంటలను సాగు చేయాలనుకొని పునాసా మామిడి చెట్లు నాటించాను. నేను రాజమండ్రి నుంచి తీసుకొచ్చి నాటించాను. మొత్తం 3.5 ఎకరాలలో 600 మామిడి చెట్లు నాటాము. 10 అడుగులు పైకి పెరగనీయకుండా జాగ్రత్త పడుతూ ఎప్పటికప్పుడు ఫ్రూనింగ్‌ (కత్తరించుకొంటూ) జాగ్రత్తలు తీసుకున్నాము. ఈ 600 చెట్లలో సగం చెట్లు ఐదు సంవత్సరాలవి ఉండగా, మరో సగం చెట్లు మూడు సంవత్సరాలు దాటివిని ఉన్నాయి. సంవత్సరానికి రెండు విడతలు తప్పకుండా కాయలు కాస్తాయి. సీజన్‌లో కాస్త ధరలు తక్కువగా ఉన్నప్పటికీ అన్‌ సీజన్‌ (ప్రస్తుతం) అధిక డిమాండ్‌ పలుకుతున్నాయి. పచ్చళ్లు, ఊరగాయల కోసం కిలో రూ.30లతో తీసుకెళ్లుతున్నారు. మేము పూర్తిగా సేంద్రియ పద్ధతిలోనే వ్యవసాయం చేస్తున్నాము. ప్రస్తుతం పూత దశలో ఉన్న కాండాలకు మచ్చ తెగులు సోకడంతో వేపనూనెకు సర్ఫఫౌడర్‌ కలిపి పిచికారి చేస్తాము. ఇక కాయ ఫక్వానికి వచ్చిప్పుడు మజ్జిగను పులయపెట్టి పిచికారి చేస్తాము. పూర్తిగా సస్యరక్షణ చర్యలు సేంద్రియ పద్ధతినే పాటిస్తున్నాము. దీంతో కాయలు క్వాలిటీ పరంగా చాలా నిగనిలాడుతుంటాయి. – అంబటి సిద్ధేశ్వర్‌, యువ రైతు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement