‘ఇన్‌స్పైర్‌ మనక్‌’లో మెరిసిన మనోళ్లు | - | Sakshi
Sakshi News home page

‘ఇన్‌స్పైర్‌ మనక్‌’లో మెరిసిన మనోళ్లు

Oct 14 2026 1:41 AM | Updated on Oct 14 2026 1:41 AM

మదనపల్లె సిటీ : న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరుగుతున్న 12వ జాతీయ స్థాయి ఇన్‌స్పైర్‌ మనక్‌ పోటీల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటుతున్నారు. జాతీయ స్థాయిలో జిల్లాకు చెందిన నలుగురు విద్యార్థులు తమ వినూత్న ప్రాజెక్టులతో ప్రాతినిధ్యం వహిస్తుండటం విశేషం. 2023–24 విద్యా సంవత్సరంలో బి.కొత్తకోట సిద్దార్థ ఇంగ్లిషు మీడియంకు చెందిన విద్యార్థి బంగారు మమతా ‘ఇంటెలిజెంట్‌ వెహికల్‌ విత్‌ ఆల్కాహాల్‌ డిటక్షన్‌ ఫర్‌ డ్రైవర్స్‌, స్మార్ట్‌ హారన్‌,’ రాయచోటి ఏపీ మోడల్‌ స్కూల్‌ విద్యార్థి మూడే సిరి’ ‘మల్టిఫర్‌పస్‌ అగ్రికల్చర్‌ రోబో’, తంబళ్లపల్లె మండలం కన్నెమడుగు జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి రామిగాని ప్రణవ్‌కుమార్‌ ‘పూర్‌మెన్స్‌ ఎయిడ్‌ ప్యూరిఫైయర్‌’ 2024–25 విద్యా సంవత్సరంలో రామసముద్రం మండలం జెడ్పీ ఉన్నత పాఠశాల, మట్టవారిపల్లె విద్యార్థి కె.గౌతమ్‌ రూపొందించిన ‘ఫైడింగ్‌ మ్యాన్‌ హోల్‌’ ప్రాజెక్టులు జాతీయ స్థాయికి ఎంపికయ్యాయి. ఈ ప్రాజెక్టులు అక్టోబర్‌ 12, 13, 14 తేదీల్లో మూడు రోజుల పాటు ప్రతిష్టాత్మక ప్రదర్శనలో కొనసాగుతాయి.

ప్రత్యేక ఆకర్షణగా ‘పూర్‌ మేన్స్‌ ఎయిర్‌ ప్యూరిఫైయర్‌’

జాతీయ స్థాయి పోటీల్లో తంబళ్లపల్లె మండలం కన్నెమడుగు జెడ్పీ ఉన్నత పాఠశాల పూర్వపు విద్యార్థి ఆర్‌.ప్రణవ్‌కుమార్‌ రూపొందించిన ‘పూర్‌ మేన్స్‌ ఎయిర్‌ ప్యూరిఫైయర్‌’(పేదల ఎయిర్‌ ప్యూరిఫైయర్‌) ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నగరాలు, పట్టణాల్లో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరి, దుమ్ము, ధూళి, విషవాయువుల వల్ల ప్రజలు శ్వాసకోస వ్యాధులకు గురవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. ప్రణవ్‌ అతి తక్కువ ఖర్చుతో కూడిన పరికరాన్ని తయారు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో సులభంగా దొరికే కొబ్బరి పీచు (టెంకాయ నార) బొగ్గు, బొగ్గుపొడితో కూడిన ఫిల్టర్‌, కార్లలో వాడే ఏసీ ఫిల్టర్లను ఉపయోగించి ప్యూరిఫైయర్‌ను రూపొందించాడు. గాలిలోని కాలుష్యాన్ని సమర్థవంతంగా తొలగించేలా, కాలానుగుణంగా ఫిల్టర్లను సులభంగా మార్చుకునే వీలుగా పరికరాన్ని తీర్చిదిద్దాడు.

ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే:

2023–24 విద్యా సంవత్సరంలో కన్నెమడుగు జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్న సమయంలో గైడ్‌ టీచర్‌ పి.లక్ష్మినరసింహశాస్త్రి పర్యవేక్షణలో ప్రవణ్‌కుమార్‌ ప్రాజెక్టును రూపొందించాడు. జూలైలో జరిగిన రాష్ట్ర స్థాయి ఇన్‌స్పైర్‌ పోటీల్లో తన ఎగ్జిబిట్‌ను ప్రదర్శించి జిల్లా తరఫున జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. ఈ విద్యార్థి ప్రస్తుతం మాస్టర్‌మైండ్స్‌ జూనియర్‌ కాలేజీలో సీఏ కోర్సు చదువుతున్నాడు. జాతీయ స్థాయిలో జిల్లా ఖ్యాతిని, పాఠశాల పేరును ఇనుమడింపజేస్తున్న ప్రవణ్‌ కుమార్‌తోపాటు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇతర విద్యార్థులను కన్నెమడుగు హెచ్‌ఎం మదన్‌మోహన్‌, ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.

జిల్లా నుంచి నలుగురు విద్యార్థులు ప్రాతినిధ్యం

ఢిల్లీలో 12వ జాతీయ స్థాయి పోటీల ప్రదర్శన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement