పెద్దమండ్యం : పెద్దమండ్యం–గాలివీడు రహదారిపై మంగళవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఓ మహిళకు కాలు పూర్తిగా విరిగిపోవడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వివరాలలోకి వెళితే.. గాలివీడు మండలం అరవీడు పంచాయతీ సిమగంవారిపల్లె, పెద్దమాలపల్లె, చిన్నమాలపల్లెలకు చెందిన కూలీలు ఆటోలో.. టమాటా కాయల కోత పనులకు కలిచెర్లకు బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న ఆటో పాపేపల్లె బస్టాప్ సమీపంలోని యర్రమన్ను గుంతల వద్దకు రాగానే.. ఎదురుగా వస్తున్న పాల ఆటో బలంగా ఢీ కొట్టింది. ప్రమాదంలో కూలీల ఆటో ఒక్కసారిగా బోల్తా పడింది. దీంతో కూలీల భోజన క్యారియర్‌లు, వాటర్‌బాటిళ్లు, బట్టలు చెల్లా చెదురుగా పడిపోయాయి. ఎదురుగా వేగంగా వస్తున్న పాల ఆటోను గమనించి కూలీల ఆటో డ్రైవర్ పక్కన నిలబెట్టినా, పాల ఆటోతో ఢీ కొట్టాడని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. తురికపల్లెలో ఉన్న ప్రవేటు డెయిరీకి ఆటోలో రోజూ సింగంవారిపల్లె నుంచి పాల క్యాన్‌లు తీసుకొని వస్తారని, పాల ఆటో డ్రైవర్ పల్లెలో ఓ కుక్కను ఢీకొట్టి చంపడంతో.. మందలించినందుకు ఇలా తాము ప్రయాణిస్తున్న ఆటోను కావాలనే ఢీ కొట్టాడని కూలీలు ఆరోపించారు. ప్రమాదంలో హరిత, శివమ్మ, సులోచన, రమణమ్మ, నాగమణి, రత్నమ్మ, వెంకటశివమ్మలకు గాయాలయ్యాయి. వీరిలో పూల హరిత కాలు విరిగిపోయింది. సంఘటనపై స్థానికులు సమాచారం అందించడంతో గాలివీడు, పెద్దమండ్యంల నుంచి రెండు అంబులెన్స్‌లు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో పరిస్థితి విషమంగా ఉన్న హరితను మెరుగైన చికిత్సల కోసం తిరుపతిలోని ఓ ప్రవేటు ఆసుపత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కూలీల ఆటోను పాల ఆటో ఢీకొన్నట్లు తెలియడంతో చుట్టు పక్కల గ్రామాలలోని ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. సంఘటనా స్థలాన్ని స్థానిక పోలీసులు పరిశీలించి బాధితుల వివరాలను సేకరించారు. ప్రమాదానికి కారణమైన ఆటోను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ హరిహరప్రసాద్ తెలిపారు.
ఆరుగురికి తీవ్ర గాయాలు
ఒకరి పరిస్థితి విషమం


