మదనపల్లె టౌన్ : మదనపల్లి మండలంలో మంగళవారం రాత్రి దారుణ ఘటన జరిగింది. ఇంట్లో బియ్యం బస్తాలు అమ్మేసి మద్యం తాగుతున్నాడని.. కన్నకొడుకే తండ్రిని బండ రాళ్లు, కర్రలతో కొట్టి చంపేశాడు. ఈ హత్య ఘటనకు సంబంధించి తాలుకా సీఐ మహ్మద్ రఫీ తెలిపిన వివరాల మేరకు.. మదనపల్లి మండలం కొత్తవారిపల్లె పంచాయతీ గాజులవారిపల్లికి చెందిన కృష్ణమూర్తి కుమారుడు రైతు చక్కెర సహదేవ(50) వ్యవసాయంతోపాటు పాడి ఆవులు మేపుకొని భార్య రమణ కుమారి, ఇద్దరు పిల్లల్ని పోషించుకుని జీవనం సాగిస్తుండే వాడు. ఈ క్రమంలో వ్యవసాయ బావి దగ్గర ఇటీవల సహదేవ కొత్త ఇంటిని నిర్మించాడు. కూతురు ఇందు బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేస్తున్నారు. కొడుకు సంతోష్ ఇంటి పట్టునే ఉంటూ వ్యవసాయ పనులు చేస్తున్నాడు. అయితే సహదేవ గత నెల రోజులుగా తరచూ మద్యం తాగి ఇంటికి వస్తున్నాడని, ఇంట్లో మందలించినా తీరు మార్చుకోలేదని ఆగ్రహించిన.. కొడుకు సంతోష్ తన తండ్రిని కర్రలతోపాటు బండ రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశాడు. కొత్తగా పొలం దగ్గర నిర్మించిన ఇంటి సమీపంలో సహదేవను తీసుకెళ్లి పడేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నంలో భాగంగా.. రక్తపు మడుగులో పడి ఉన్న అతన్ని స్థానికుల సాయంతో కుటుంబీకులే మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి అప్పటికే సహదేవ చనిపోయాడని చెప్పారు. సహదేవ హత్యకు గురికావడంతో రకరకాల అనుమానాలు ఉన్నాయని ఘటనా స్థలికి వెళ్లిన పోలీసులకు గ్రామస్తులు కొంత సమాచారం ఇవ్వడంతో సంతోష్‌ను అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారణ చేయడంతో తానే హత్య చేసినట్లు నిందితుడు నేర అంగీకరించగా.. తాలుకా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. రోజూ అందరితో కలివిడిగా మాట్లాడుతూ.. తిరుగుతున్న సహదేవను కన్న కొడుకే హత్య చేసి చంపడాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలే పోతున్నారు. సహదేవ హత్య ఉదంతంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మదనపల్లె మండలంలో దారుణం
ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం
పోలీసుల విచారణతో వెలుగులోకి..


