● అటవీ శాఖ అధికారుల
తీరుపై స్థానికుల ఆగ్రహం
రామసముద్రం : రామసముద్రం మండలం కురిజల పంచాయతీ గుట్టపాళ్యం సమీపంలోని జంగాలేరు బీడు భూముల్లో జింక మృతి చెందింది. జింక అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించగా, అప్పటికే అది మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనతో పరిసర ప్రాంతాల్లో వన్యప్రాణుల సంరక్షణపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మండల పరిధిలో వన్యప్రాణుల సంరక్షణ, వాటి కదలికల పర్యవేక్షణలో అటవీశాఖ అధికారులు తగిన శ్రద్ధ చూపడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వన్యప్రాణులు గాయాలపాలవుతున్నా, మృతి చెందుతున్నా అధికారులు స్పందించకపోవడంపై మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం జింక మృతి చెందిన విషయం తెలిసినప్పటికీ అటవీశాఖ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. జింక ఏ కారణంతో మృతి చెందిందనే విషయం ఇంకా తెలియరాలేదు. అనారోగ్యమా, ప్రమాదమా, మరేదైనా కారణమా అన్నది అటవీశాఖ అధికారులు విచారణ చేపడితేనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మృతి చెందిన జింకను పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకోవడంతోపాటు ఘటనకు గల కారణాలను వెలికితీయాలని స్థానికులు కోరుతున్నారు. వన్యప్రాణుల సంరక్షణ అటవీశాఖ బాధ్యత అని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి జింక మృతిపై సమగ్ర విచారణ జరిపి, వన్యప్రాణుల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


