మదనపల్లె టౌన్ : యాంటీ కరప్షన్ బ్యూరో ఆఫ్ ఇండియా, రాష్ట్ర మీడియా సెల్ ప్రతినిధిని అంటూ సమస్యల పరిష్కారానికి అమాయకుల దగ్గర డబ్బులు తీసుకుని మోసాలు చేస్తున్న మదనపల్లె గొల్లపల్లిలో కాపురం ఉండే సయ్యద్ మీర్‌ను సోమవారం స్థానిక వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేసిన విషయం పాఠకులకు తెలిసిందే. సయ్యద్ మీర్ కార్లకు ప్రభుత్వ రాజముద్ర కలిగిన ఏసీబీఐ స్టిక్కర్లు ఉండడంతో.. ఆయన వినియోగిస్తున్న రెండు కార్లను జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, డీఎస్పి ప్రసాద్‌ల ఆదేశాలతో సీజ్ చేసినట్లు మంగళవారం వన్‌టౌన్ సీఐ మోహన్‌కుమార్ మీడియాకు తెలిపారు. స్థానిక రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లోనూ సయ్యద్ మీర్ పై చీటింగ్ కేసు నమోదు చేశారు.
గాయపడిన వ్యక్తి మృతి
కమలాపురం : కడప–తాడిపత్రి ప్రధాన రహదారిలో సి.గోపులాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన జయన్న (69) రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. జయన్న వృత్తి రీత్యా చెన్నూర మండల దౌలతాపురంలో స్థిర పడ్డాడు. అయితే స్వగ్రామమైన సి.గోపులాపురంలో ఉన్న భూముల కోసం అప్పుడప్పుడు వచ్చి చూసుకొని వెళ్తుంటాడు. ఈ క్రమంలో సోమవారం స్వగ్రామానికి వచ్చి భూములను చూసుకొని తన బైక్‌లో వెళ్తుండగా కంటైనర్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో చేయి విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.


