తంబళ్లపల్లెకు నీళ్లివ్వాలి
నీటి పంపిణీలో వివక్ష వీడాలి
● రాజకీయ కక్షకు
పుంగనూరు, తంబళ్లపల్లె ప్రజలు బలి
● నీటి హక్కులను కాలరాస్తున్న చంద్రబాబు
● హంద్రీ–నీవా కుప్పం కోసమేనా..
ప్రశ్నిస్తున్న రైతాంగం
సాక్షి, మదనపల్లె: నేను ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసిని అని ఈనెల 2న మదనపల్లె సభలో గొప్పగా చెప్పుకున్న చంద్రబాబు, కరువుతో అల్లాడిపోతున్న రైతాంగానికి చుక్కనీరు ఇచ్చేందుకు మనసు ఒప్పడం లేదు. తాము త్యాగం చేసిన పొలాల గుండా కృష్ణా జలాలు ప్రవహిస్తుంటే..ఆ నీళ్లు తమ బీడు పొలాలను ఎప్పుడు తడుపుతాయా అని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నా చంద్రబాబు సర్కార్ కళ్లు తెరవడం లేదు. అన్నమయ్య జిల్లాలో 25 మండలాల్లో తీవ్ర కరువు ఉందని ప్రభుత్వం ప్రకటించింది. అలాంటి పరిస్థితుల్లో సాగు, తాగునీటిని అందించాల్సిన చంద్రబాబు కృష్ణా జలాలను కుప్పం నియోజకవర్గానికి ప్రాధాన్యత ఇచ్చి తరలించుకుపోతున్నారు. దీనిపై ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు కృష్ణా జలాలు కుప్పానికి, మాకు కన్నీళ్లా అంటూ ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి ఆమోదం పొందిన ప్రాజెక్టు సమగ్ర నివేదిక ప్రకారం నియోజకవర్గాల దక్కాల్సిన నీటి వాటాలనైనా ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. వివక్షతో చుక్కనీరు వదలని చంద్రబాబు నీటి వాటాను పట్టించుకునేలా లేరు.
నాడు సమానత్వం: నేడు వివక్ష
వైఎస్సార్సీపీ హయాంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి నీటి పంపిణీలో ఎక్కడా రాజకీయం చేయలేదు. హంద్రీనీవా నీటిని ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంతో సహా అన్ని ప్రాంతాలకూ సమానంగా ఇచ్చారు. కానీ నేడు చంద్రబాబు ప్రభుత్వం పుంగనూరు, తంబళ్లపల్లైపె రాజకీయ కక్షతో తీవ్ర వివక్ష చూపుతోంది. పుంగనూరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో కరువు కష్టాలు, తాగునీటి ఇబ్బందులను కళ్లారా చూస్తున్నా..తెలియనట్లు నటిస్తోంది. తంబళ్లపల్లి నియోజకవర్గంలో వ్యాసరాయ పథకం కాలువ ద్వారా తిప్పసముద్రం (పీటీఎం) చెరువుకు నీటిని కొద్దిపాటిగా మళ్లించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అతి పెద్ద చెరువును నింపడానికి ఈ ప్రవాహం సరిపోదు. కనీసం ఐదు క్యూసెక్కులకు పెంచాలి. కేవలం 2–3 క్యూసెక్కులే మళ్లించారు. ఇది నిండడానికి మూడు నెలలు పట్టవచ్చంటే నీటి విడుదలపై నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ప్రాజెక్టు అధికారులు నియోజవర్గం చెరువులకు నీళ్లు ఇస్తామని అంటున్నారే కానీ ఎన్ని చెరువులకు ఇస్తున్నారో చెప్పడం లేదు. నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటనలకు ప్రజల ఆదరణ లేకపోవడం, ప్రతిపక్ష నేతగా ఆయనపై రైతాంగం వ్యతిరేకత వ్యక్తం చేసింది. దీనితో పాటు గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేని చంద్రబాబు తంబళ్లపల్లైపె వివక్ష చూపుతున్నారు.
పుంగనూరు హక్కును కాలరాస్తూ
పుంగనూరు నియోజవర్గంపై రాజకీయంగా చంద్రబాబు పైచేయి సాధించలేకపోతున్నారు. ప్రతి ఎన్నికలోనూ సవాళ్లు విసరడం, వరుసగా పరాజయాన్ని మూట కట్టుకోవడం జరుగుతోంది. ప్రజలు టీడీపీని ఆదరించకపోవడం, పెద్దిరెడ్డిని ఎదుర్కోలేక నీళ్లపై రాజకీయ కక్ష సాధిస్తున్నారు. ఇక్కడి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు ఎండిపోయినా చుక్కనీరు వదలడం లేదు. ప్రజల దాహార్తిని తీర్చాల్సిన చంద్రబాబు రాజకీయ కక్ష సాధిస్తున్నారు. పుంగనూరు బ్రాంచ్ కెనాల్ ద్వారా కుప్పానికి కృష్ణా నీటిని విడుదల చేసి 29 రోజులు గడుస్తున్నా, పుంగనూరు కోసం చుక్క నీరు కూడా వదలడం లేదు. ప్రాజెక్టు సమగ్ర నివేదిక ప్రకారం స్థానిక సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు, చెరువులను నింపాల్సి ఉన్నప్పటికీ, ప్రభుత్వం అసలు పుంగనూరు లేనట్టుగా వ్యవహరిస్తోంది. రాజకీయాలతో సంబంధం లేకుండా వెంటనే స్థానిక చెరువులకు నీటిని మళ్లించాలని రైతాంగం, ప్రజలు ఆగ్రహంతో డిమాండ్ చేస్తున్నారు.
● మదనపల్లె పట్టణ ప్రజల దాహం తెచ్చేందుకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిప్పిలి, గుంటివారిపల్లె ఎస్ఎస్ ట్యాంకులను నిర్మించారు. అయితే ప్రభుత్వం సరైన తీరులో నీటిని ఇవ్వడం లేదు. చిప్పిలి ట్యాంకుకు అరకొరగా ఇస్తూ నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇది పూర్తిస్థాయిలో నిండకుండా ఉండేలా సంపూర్తి పనులను నిలిపేయడంతో నీటిలో సామర్థ్యం తగ్గిపోతుంది. గుంటివారిపల్లె బ్యాంకుకు నీటిని ఇవ్వడం లేదు. టీడీపీ రాజకీయ ప్రయోజనాలను ఆశించి ఇక్కడ చర్యలు చేపడుతున్నారు. కీలకమైన ట్యాంకుల అధికారులు విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు.
నోరు మెదపని టీడీపీ ఇన్చార్జీలు
పుంగనూరు, తంబళ్లపల్లె నియోజకవర్గాలకు కృష్ణా జలాలు ఇవ్వకపోవడంపై ఇక్కడ టీడీపీ ఇన్చార్జిలు మధుసూదన్ నాయుడు, శంకర్ యాదవ్ నోరు మెదపడం లేదు. తమ నియోజకవర్గ ప్రయోజనాలను కాపాడుకునేందుకు కనీస శ్రద్ధ చూపడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. చంద్రబాబు వివక్ష రాజకీయాలను ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీస్తున్నారు.
పొలాలు బీళ్లు.. ఎప్పుడు తడుస్తాయో
తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు నియోజకవర్గాల మీదుగా పుంగనూరు ఉపకాలువ సాగుతుంది. దీని పరిధిలోని మండలాల ఆయకట్టుకు, తాగునీరు అందించాలి. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో హక్కుల మేరకు నీటి వాటా దక్కడం లేదు. మదనపల్లెలో 5,400 ఎకరాలు, బి.కొత్తకోటలో 6,900, పీటీఎంలో 4,685, కురబల కోటలో 5,000, పుంగనూరులో 5,100, చౌడేపల్లిలో 2,000, సదుంలో 6,000, పెద్దపంజాణిలో 3,900 ఎకరాలు కలుపుకొని 38,985 ఎకరాలకు సాగునీరు అందించాలి. అయితే చంద్రబాబు ఒక్క ఎకరాకు కూడా సాగునీరు అందించలేదు. దీంతో కరువుతో అల్లాడిపోతున్న తమ పొలాలకు నీళ్లు ఎప్పుడిస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు.
కరువుకు నిలయమైన తంబళ్లపల్లెకు కృష్ణా జలాలను తక్షణమే ఇవ్వాలి. సాగు, తాగునీటి కష్టాలను తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా?. నియోజకవర్గానికి అందించాల్సిన నీటి వాటాను విడుదల చేయాలి. తాగునీటికి ఇబ్బంది పడుతున్న గ్రామాలను నీటిని తరలించాలి. కాలువ వెంబడి తూములు ఏర్పాటు చేసినా చెరువులకు నీటిని ఎందుకు విడుదల చేయడం లేదో తెలియాలి. వివక్ష, కక్షపూరిత రాజకీయాలను పక్కనపెట్టి నీటిని అందించాలి.
– పెద్దిరెడ్డి ద్వారకనాధరెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే
సాగు, తాగునీటి విషయంలో ప్రభుత్వం విశాలదృక్పథంతో వ్యవహరించాలి. హంద్రీ–నీవా పుంగనూరు ఉపకాలువ ద్వారా నీటిని తరలిస్తున్నప్పుడు..ప్రాంతాల ఆయకట్టుకు, తాగునీటికి నీటి కేటాయింపులను రాజకీయాలతో సంబంధం లేకుండా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. దీన్ని విస్మరించి చంద్రబాబు తన కుప్పం బాగుంటే చాలు అని నీళ్లను తరలించుకు పోవడం దారుణం. కుప్పంలోనే కాదు, పుంగనూరు, మదనపల్లె, తంబళ్లపల్లెల్లోనూ మనుషులు ఉన్నారని, తాగునీటిని అవసరాలను గుర్తించాలి. ఇప్పటికై నా వివక్ష వీడి మూడు నియోజకవర్గాలకు సమానంగా కృష్ణా జలాలను పంపిణీ చేయాలి. పుంగనూరు పట్టణ ప్రజల దాహం తీర్చే ఎస్ఎస్ ట్యాంకు, చెరువులకు తక్షణమే నీళ్లు ఇవ్వాలి. – పీవీ.మిథున్ రెడ్డి, రాజంపేట ఎంపీ


