● ఇన్‌చార్జ్ సీఈవో వద్దనే తాళాలు
● 20 రోజులుగా పరారీలోనే అనిల్‌కుమార్
● ఫోర్జరీ సంతకాలతో బంగారు రుణాలు రెన్యూవల్
గుర్రంకొండ : గుర్రంకొండ సింగిల్‌విండో కార్యాలయంలో ఇన్‌చార్జ్ సీఈవో అనిల్‌కుమార్ రూ.50 లక్షలు స్వాహా చేయడంతోపాటు బంగారు నగలు భద్రపరిచిన లాకర్ తాళాలు తన వెంటే తీసుకెళ్లడంతో.. లాకర్‌లోని బంగారు నగలు భద్రమేనా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. బంగారు రుణాలను కూడా లబ్ధిదారులకు తెలియకుండానే ఫోర్జరీ సంతకాలతో రెన్యూవల్ చేసి.. అదనంగా వచ్చిన నగదును కూడా స్వాహా చేసినట్లు అధికారుల విచారణలో తేలింది. ఇరవై రోజులుగా లాకర్ తాళాలతో సహా ఇన్‌చార్జ్ సీఈవో పరారీలో ఉండటంతో.. బంగారు తాకట్టు పెట్టిన వారు ఆందోళన చెందుతున్నారు.
తాకట్టుదారుల ఆందోళన
సింగిల్ విండో కార్యాలయంలో 249 మంది రుణగ్రహీతలు తాము తాకట్టు పెట్టిన బంగారు నగలపై ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే బంగారు నగలపై రూ.1.43 కోట్ల మేరకు కార్యాలయంలో రుణాలు ఇచ్చారు. గత నాలుగు రోజులుగా సింగిల్ విండో కార్యాలయంలో జరుగుతున్న సంఘటనలు, అధికారుల విచారణలు, ఇన్‌చార్జ్ సీఈవో అక్రమాలు వెలుగు చూడటం, లాకర్ తాళాలతో ఇన్‌చార్జ్ సీఈవో పరారు కావడం వంటి అంశాలతో తాకట్టుదారులు బెంబేలెత్తుతున్నారు. అసలు సింగిల్‌విండో కార్యాలయంలో తాము తాకట్టు పెట్టిన బంగారు నగలు భద్రంగా ఉన్నాయో లేదోనని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పలువురు కార్యాలయం వద్దకు వెళ్లి బంగారు నగలపై ఆరా తీస్తున్నారు. వారికి అధికారులు భరోసా ఇస్తున్నా ఇన్‌చార్జ్ సీఈవో అక్రమాలతో లాకర్‌లో బంగారం ఏమై ఉంటుందోనని లోలోపల భయాందోళన చెందుతున్నారు.
రుణాలు రెన్యూవల్ చేయకున్నా..
సింగిల్ విండో కార్యాలయంలో ఇన్‌చార్జ్ సీఈవోగా పని చేసిన అనిల్‌కుమార్ అవినీతి లీలలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇటీవల కార్యాలయంలో ఆధికారులు రికార్డుల తనిఖీలు, ఇతర వివాదాస్పద అంశాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపారు. విషయం తెలుసుకొన్న కొంత మంది తాకట్టుదారులు అక్కడికి చేరుకొని.. తాము తాకట్టుపెట్టిన బంగారు నగల పరిస్థితిపై ఆరా తీశారు. గతంలో వారు బంగారు నగలు తాకట్టుపెట్టి తీసుకొన్న సొమ్ము కంటే అదనంగా మళ్లీ కొంత సొమ్ము రుణంగా తీసుకొన్నట్లు తేలింది. దీంతో వారు లబోదిబోమంటూ వాపోయారు. అసలు తాము బంగారు రుణాలు రెన్యూవలే చేయలేదని, తమ పేరుతో ఉన్న బంగారు రుణాలు ఎలా రెన్యూవల్ అయ్యాయని, వాటితోపాటు మరికొంత సొమ్ము అదనంగా ఎలా డ్రా చేశారని వారు అధికారులను ప్రశ్నించారు. ఇదంతా ఇన్‌చార్జ్ సీఈవో వ్యవహారమేనని అధికారులు తేల్చారు. తాకట్టుదారులు బంగారు నగలు రెన్యూవల్ చేసినట్లు, అదనంగా సొమ్ము తీసుకొన్నట్లు కార్యాలయ రిజిస్టర్లలో సంతకాలు ఉండడం గమనార్హం. అయితే అవి తాము పెట్టిన సంతకాలు కాదని ఇన్‌చార్జ్ సీఈవోనే ఫోర్జరీ చేశారని వారు బహిరంగంగా పేర్కొంటుండడం గమనార్హం. ఈ సంఘటనతో అధికారులు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. 249 మంది తాకట్టుదారుల్లో ఎంత మంది రుణాలు రెన్యూవల్ చేశారు, ఎంత మేరకు అదనపు సొమ్ము ఫోర్జరీ సంతకాలతో స్వాహా చేశారనే విషయాలు.. ఇన్‌చార్జ్ సీఈవో ఆచూకీ తెలిసి పూర్తి స్థాయిలో విచారణ చేస్తేనే వెలుగు చూస్తాయని వారు అంటున్నారు.
లాకర్ తాళాలు స్వాధీనం చేసుకొని ఉంటే..
కార్యాలయంలో ఇన్‌చార్జ్ సీఈవోగా పని చేస్తున్న అనిల్‌కుమార్ కార్యాలయంలోని బంగారు నగలు ఉన్న లాకర్ తాళాలు తన వెంటే తీసుకెళ్లిపోవడం గమనార్హం. లాకర్ తాళాలతో ఇరవై రోజులుగా ఆయన పరారీలో ఉండటంతో తాకట్టుదారుల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత నెల 21న డీసీసీ ఉన్నతాధికారులు గుర్రంకొండకు చేరుకొని సింగిల్‌విండో కార్యాలయంలో విచారణ నిర్వహించారు. అప్పుడే ఇన్‌చార్జ్ సీఈవో అక్రమాలు వెలుగు చూశాయి. అయితే ఉన్నతాధికారుల ఉదాసీనత కారణంగా అక్రమాలకు పాల్పడిన ఇన్‌చార్జ్ సీఈవోకు మరికొంత గడువు ఇచ్చినట్లు సమాచారం. ఇదే అదనుగా భావించిన ఆయన కార్యాలయంలోని లాకర్ తాళాలతో సహా మరుసటి రోజు నుంచే పరారయ్యాడు. అప్పట్లోనే ఉన్నతాధికారులు అప్రమత్తంగా వ్యహరించి లాకర్ తాళాలు స్వాధీనం చేసుకొని ఉంటే.. కొన్ని సమస్యలకు పరిష్కారం లభించినట్లు అయి ఉండేదని తాకట్టుదారులు అంటున్నారు. అప్పట్లో లాకర్ తాళాలు స్వాధీనం చేసుకొని లాకర్ తెరిచి తనిఖీలు నిర్వహించి ఉంటే, వాస్తవాలు బయటకొచ్చేవి. ఏది ఏమైనా లాకర్ తాళాలు ఇన్‌చార్జ్ సీఈవో వద్ద నుంచి స్వాధీనం చేసుకొంటేనే నిజానిజాలు వెలుగు చూసే అవకాశముంది.


