● బాడుగ ట్రాక్టర్ల పేరుతో రైతులకు వల
● రికార్డుల్లేని వాహనాలతో కొత్త రకం దందా
● ఆరుగురి నిందితుల అరెస్ట్
● వీరిలో ఇద్దరు ఏఆర్ పోలీసులు
రాయచోటి టౌన్ : మాకు బాడుగకు ట్రాక్టర్ కావాలని అడుగుతారు.. తరువాత ఆ వాహనం రికార్డులు లేవని.. మరో గ్రామమో, మండలానికో చెందిన అమాయకపు రైతులకు చౌకగా అమ్మేస్తారు. తక్కువ ధరకే ట్రాక్టర్ వస్తోందనే ఆశతో వాటిని రైతులు కొంటారు.. ఇలా మోసానికి పాల్పడిన వారిలో ఇద్దరు ఏఆర్ పోలీసులు ఉండటం గమనార్హం. మొత్తం ఆరుగురు నిందితులను రాయచోటి రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 13 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ ఆదివారం వివరాలు వెల్లడించారు. లక్కిరెడ్డిపల్లె మండలం మద్దిరేవుల గ్రామానికి చెందిన (ప్రసుతం కడప కొత్తబస్టాండ్ సమీపంలో కాపురం ఉంటున్నాడు) సోమల ప్రతాప్ (బెటాలియన్ పోలీస్), అనంతపురం జిల్లా బుక్కరాయసమద్రానికి చెందిన నెల్లిపల్లె చంద్రహాస్ (బెటాలియన్ పోలీస్), అన్నమయ్య జిల్లా సంబేపల్లె మండలం గున్నికుంట్లకు చెందిన మడితాటి సుధీర్, రాయచోటి రూరల్ పరిధిలోని దూళ్లవారిపల్లెకు చెందిన నల్ల కాలువ వాసుదేవరెడ్డి, వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు చెన్నమరాజుపల్లెకు చెందిన కొత్తపల్లె సరేష్, ప్రొద్దుటూరు నాగయ్యపల్లెకు చెందిన సాకం విశ్వనాథరెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. వీరు గ్రామంలోని రైతుల దగ్గరకు వెళ్లి తమకు ట్రాక్టర్లు నెల బాడుగకు కావాలని కోరుతారు. వారి దగ్గర నుంచి ట్రాక్టర్లను తీసుకెళ్లి మరో ప్రాంతంలోని రైతుల దగ్గరకు తీసుకెళ్లి.. తమ వద్ద రికార్డులు లేని ట్రాక్టర్ ఉందని, దీనికి కావాల్సిన రికార్డులు మీరే తయారు చేసుకోవాలని తక్కువ ధరకే అమ్ముతారు. మరి కొన్ని చోట్ల కుదవ పెట్టి డబ్బులు తీసుకోవడం చేస్తారు. రైతులు కూడా ఏదో తక్కువ ధరకే తమకు ట్రాక్టర్ వస్తోందని నమ్మి వాటిని కొనుగోలు చేస్తారు. బాడుగకు ఇచ్చిన వారు అడిగితే ఏదో ఒకటి చెప్పి కాలయాపన చేస్తుంటారు. అనుమానం వచ్చిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. నిందితులు సంబేపల్లె మండలం గుండ్రేవాండ్లపల్లె సమీపంలో ఉన్నట్లు తెలియడంతో రాయచోటి రూరల్ సీఐ ఎస్‌కే రోషన్, సంబేపల్లె ఎస్‌ఐ రవికుమార్ తమ సిబ్బందితో వెళ్లి అరెస్టు చేశారు. వారి నుంచి ట్రాక్టర్లు స్వాధీనం చేసుకొని, వారిపై కేసు నమోదు చేశారు.


