లక్కిరెడ్డిపల్లి : భార్య హత్య కేసులో భర్తను అరెస్ట్ చేశారు. రాయచోటి డీఎస్పీ పి.కృష్ణమోహన్ మీడియా సమావేశంలో ఆదివారం వివరాలు వెల్లడించారు. మండల పరిధి బి ఎర్రగుడి పంచాయతీలోని కాపుపల్లికి చెందిన నాగరత్నమ్మ(47)పై ఈ నెల 7వ తేదీన భర్త రోకలి బండతో దాడి చేయగా.. ఆమె తలకు తీవ్ర గాయం కావడంతో తిరుపతి రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 8వ తేదీన మృతి చెందింది. దాడి చేసిన ఆమె భర్త నరసింహులు పరారీలో ఉండగా లక్కిరెడ్డిపల్లి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి ఆదివారం అరెస్టు చేశారు. అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపుతున్నట్లు డీఎస్పీ తెలిపారు. నరసింహులు తరచూ మద్యం తాగి భార్యతో గొడవ పడేవాడు. దీనికితోడు ఈ మధ్య కాలంలో నాగరత్నమ్మ బతుకుదెరువు కోసం కువైట్‌కు వెళ్లాలని పాస్‌ఫోర్టు కూడా చేయించుకోగా, ఈ విషయం తెలిసిన నరసింహులు జీర్ణించుకోలేక ఆమెతో గొడవ పడ్డాడు. ఆవేశంతో రోకలి బండతో దాడి చేశాడు. తీవ్ర గాయాల పాలై ఆమె మృతి చెందింది. మీడియా సమావేశంలో సీఐ కృష్ణంరాజు నాయక్, ఎస్‌ఐ గోల్కొండ శోభ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


