– వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి
రాయచోటి అర్బన్ : బీసీలకు మేలు చేస్తామంటూ చంద్రబాబు మాటల్లోనే చెబుతారని... తన నైజం మోసం చేయడమేనని మరోసారి రుజువైందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. బీసీలకు మంచి చేయాలన్న ఆలోచనలు చంద్రబాబులో ఏ కోశానా ఉండదని విమర్శించారు. చంద్రబాబు నాయుడుకు బీసీలకు రిజర్వేషన్లపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే షెడ్యూల్ ప్రకారం పార్లమెంట్‌లో చట్టం చేసేందుకు కేంద్రంతో మాట్లాడి ఒప్పించాలని , ఇందుకు వైఎస్సార్‌సీపీ తోడుగా నిలుస్తుందని వివరించారు. గతంలో వైఎస్ జగన్ బీసీలకు అన్నింటిలోనూ, నామినేటెడ్ పోస్టులలో 50శాతం ఉండాలన్న ఆలోచనలు చేసి అసెంబ్లీలో చట్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రాయచోటి మున్సిపాలిటీ గతంలో ఓసీ జనరల్ వచ్చినా బీసీలకు ఇచ్చి గౌరవించిందని ఆయన పేర్కొన్నారు.


