నిరుపేదల సంక్షేమంపై ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయి. ముఖ్యంగా నిరాశ్రయుల వసతి గృహాలపై శీతకన్ను వేసి పేదలు జీవించే హక్కును కాలరాస్తున్నాయి. ఫలితంగా సదరు వసతి గృహాలు మూసివేత దిశగా పయనిస్తున్నాయి. నేడు ప్రపంచ నిరాశ్రయుల దినోత్సవం సందర్భంగా కథనం.
కడప సెవెన్‌రోడ్స్ : అనాథలు, అభాగ్యులు, వలస కూలీల కోసం ఏర్పాటు చేసిన నిరాశ్రయు ల కేంద్రాలు ప్రభుత్వాల తీరు వల్ల సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రతి పౌరుడికి జీవించే హక్కు ఉందనే నినాదంతో దేశ వ్యాప్తంగా నిరాశ్రయుల కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఇందులో భాగంగా జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కడప నగరంలో నాలుగు కేంద్రాలు ఏర్పాటయ్యాయి. మున్సిపాలిటీ వారు ఒక భోజనానికి నిధులు ఇస్తున్నారు. మెప్మా విభాగం ఈ కేంద్రాలు నిర్వహించే సిబ్బందికి గౌరవ వేతనంతోపాటు ఇతర ఖర్చులకు డబ్బులు చెల్లిస్తారు. భిక్షాటన చేసేవారు, వలస కూలీలు, వికలాంగులు ఈ కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు. వీటికి విధించిన ఐదేళ్ల కాలపరిమితి ముగిసింది. దీంతో అటు మున్సిపాలిటీ, ఇటు మెప్మా వారు నిధులు ఇవ్వడం ఆపేశారు. దీంతో కేంద్రాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పునరాలోచించి నిరాశ్రయుల వసతి కేంద్రాలను కొనసాగించాలని పలువురు కోరుతున్నారు.


