రాజంపేట: స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత నేపథ్యంలో రాజంపేట తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. గురువారం స్థానిక రోడ్లు, భవనాల అతిథి గృహం వేదికగా జరిగిన పురపాలక సంఘ ఎన్నికల సమన్వయ కమిటీ సమావేశం తీవ్ర రసాభాసగా మారింది. నేతల సమక్షంలోనే వైరి వర్గాలు పరస్పర ఆరోపణలు, వాగ్వివాదాలకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.రాజంపేట ఏబీ చంద్ర కల్యాణ మండపంలో మున్సిపల్ ఎన్నికలపై చర్చించేందుకు అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్‌బాబు, కడప జిల్లా అధ్యక్షుడు భూపేష్‌రెడ్డి, జిల్లా ఎన్నికల కో–ఆర్డినేటర్ దీపక్‌రెడ్డి, రాజంపేట టీడీపీ ఇన్‌చార్జి చమర్తి జగన్‌మోహన్‌రాజు తదితరులు హాజరయ్యారు.నాయకులు ప్రసంగిస్తున్న క్రమంలో, పార్టీలోని కొందరు సీనియర్ నాయకులు ఒక్కసారిగా స్టేజ్ ముందు నిలదీశారు. పార్టీ కోసం కష్టపడి, కేసుల పాలై, జైలుకు వెళ్లిన కార్యకర్తలను విస్మరించి, వలస వచ్చిన నేతలకు పెద్దపీట వేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలను, స్థానిక నాయకులను సంప్రదించకుండా వలస నేతలను పార్టీలోకి ఎలా చేర్చుకుంటారంటూ ధ్వజమెత్తారు.గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీల్లో ఉన్న కీలక నాయకులకు కనీస సమాచారం ఇవ్వకుండా, రహస్యంగా పార్టీ సభలు, సమావేశాలు ఎలా నిర్వహిస్తారని సీనియర్లు ప్రశ్నించారు. ఈ క్రమంలో కమ్మ, క్షత్రియ సామాజిక వర్గాలకు చెందిన కొందరు నాయకులు గట్టిగా నిలదీయ డంతో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం నడిచింది. అది కాస్తా తోపులాటగా మారడంతో సమావేశ ప్రాంగణంలో తీవ్ర గందరగోళం నెలకొంది. కొందరు అస మ్మతి నాయకులు ఉద్దేశపూర్వకంగానే ఈ గొడవకు దిగారని పార్టీలోని మరో వర్గం ఆరోపించింది.


