ఉద్యమంపై ఉక్కుపాదం | - | Sakshi
Sakshi News home page

ఉద్యమంపై ఉక్కుపాదం

Oct 9 2026 1:14 AM | Updated on Oct 9 2026 1:14 AM

సాక్షి అన్నమయ్య/సాక్షి కడప : రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ఉద్యమబాట పట్టిన వేతన జీవులపై కూటమి సర్కార్‌ ఉద్యమంపై ఉక్కుపాదం మోపుతోంది. ఒకటి, రెండు రోజులు కాకుండా దాదాపు నెలన్నర రోజుల కిందటే ఉద్యమ కార్యచరణ ప్రకటించి సంబంధిత అధికారులకు నోటీసులు కూడా అందించి హామీలు అమలుకు నోచుకోకపోవడంతో కాంట్రాక్టు ఉద్యోగులంతా రోడ్డెక్కారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని, ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు 100 శాతం గ్రాస్‌ శాలరీ అమలు, సమానపనికి సమాన వేతనంతోపాటు ఇతర డిమాండ్లతో రెండు రోజులుగా ఆందోళనకు దిగారు. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా అత్యవసర సేవలు మినహా మిగతా అన్ని విభాగాల వైద్యానికి నిరాకరించి రోడ్డెక్కిన కాంట్రాక్టు కార్మికులపట్ల ప్రభుత్వం నోటీసుల రూపంలో కక్షసాధింపు చర్యలకు ఉపక్రమించింది. ఎట్టి పరిిస్థితుల్లో ఉద్యమాన్ని నీరుగార్చాలన్న సంకల్పంతో జిల్లాలో కాంట్రాక్టు ఉద్యోగుల సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కీలక నేతలందరికీ నోటీసుల రూపంలో నిర్వీర్యం చేసేందుకు వ్యూహం రచించారు.

జీజీహెచ్‌ల వద్ద కొనసాగుతున్న నిరసనలు

తమ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మెడికల్‌ అండ్‌ హెల్త్‌ డిపార్టుమెంటులో పనిచేస్తున్నకాంట్రాక్టు ఉద్యోగులు రెండు రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా వైఎస్సార్‌ జిల్లా పరిధిలో జీజీహెచ్‌ (రిమ్స్‌)లో కాంట్రాక్టు ఉద్యోగులు నిరసనలు కొనసాగిస్తున్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లెలోని జిల్లా ఆస్పత్రిలో కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళనల బాట పట్టారు. అన్నమయ్య జిల్లా పరిధిలో సుమారు 300 మందికి పైగా ఆందోళనల్లో పాల్గొంటుండగా, మరోవైపు వైఎస్సార్‌ జిల్లాలోని రిమ్స్‌తోపాటు ఇతర పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న దాదాపు 400 మంది వరకు ఉద్యమ కార్యచరణలో ఉన్నారు. ఉద్యమంలో భాగంగా నినాదాలతో హోరెత్తిస్తున్నారు.

నిర్వీర్యం చేసేందుకు కుట్ర

వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం రోడ్డెక్కగానే కూటమి సర్కార్‌కుయుక్తులు పన్నుతోంది. ఎట్టి పరిస్థితుల్లో ఉద్యమాన్ని తీవ్రతరం కాకుండా అణిచి వేసేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇటు రిమ్స్‌తోపాటు అటు మదనపల్లె జిల్లా ఆస్పత్రిలోని పలువురు ఉన్నతాధికారుల ద్వారా మౌఖిక ఆదేశాలు ఇస్తూ విదుల నిర్వహణకు సిద్దమంటూ వారితోచెప్పించే యత్నాలు చేస్తున్నారు. రెండు జిల్లాల్లో కలిపి సుమారు 300 మందికి పైగా సిబ్బందికి విదుల్లో చేరాలని మౌఖిక ఆదేశాలు జారీ చేస్తున్నారు. పీహెచ్‌సీలలో పనిచేసే సిబ్బందికి ఆయా మెడికల్‌ ఆఫీసర్ల ద్వారా ఒత్తిళ్లకు గురి చేస్తున్నారు.

ఉద్యోగాలను పర్మినెంట్‌ చేయాలి

కడప అర్బన్‌ : కడప నగర శివారు రిమ్స్‌లో వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సమ్మె మూడవరోజున గురువారం కొనసాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ఉద్యోగాలను పర్మినెంట్‌ చేయాల్సిందేనని అన్నారు. కాంట్రాక్ట్‌ మెడికల్‌ ఉద్యోగుల జెఏసీ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం తమ డిమాండ్ల సాధన కోసం కడపలోని ఏడు రోడ్ల కూడలి నుంచి కోటిరెడ్డి సర్కిల్‌ వరకు కొవ్వొత్తులతో ర్యాలీగా వచ్చి నిరసన చేపట్టారు. అలాగే మానవహారంగా ఏర్పడి తమ ఐక్యపోరాటాన్ని చాటారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్‌ వి వెంకట్రాజు, కన్వీనర్‌ కమల్‌ బి, జే ఎస్‌ రాజు, విమల, పెద్ద ఎత్తున కాంట్రాక్టు ఉద్యోగులు పాల్గొన్నారు.

వైద్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగుల మెడపై కత్తి

రెండు రోజులుగా ఎక్కడికక్కడ జీజీహెచ్‌ల వద్ద నిరసన కార్యక్రమాలు

అన్నమయ్య, వైఎస్సార్‌ కడపజిల్లాలోని కాంట్రాక్టు ఉద్యోగులకు నోటీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement