అనుమానం పెనూభూతమై.. | - | Sakshi
Sakshi News home page

అనుమానం పెనూభూతమై..

Oct 9 2026 1:14 AM | Updated on Oct 9 2026 1:14 AM

లక్కిరెడ్డిపల్లి : మండల పరిధిలో దారుణ ఘటన వెలుగుచూసింది. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న ఓ భర్త కసాయిగా మారి.. రోకలిబండతో తలపై దాడి చేసి హతమార్చాడు. ఎర్రగుడి పంచాయతీ కాపుపల్లె గ్రామంలో ఈ ఘటన జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దేరంగుల నరసింహులు, దేరంగుల నాగరత్న (45) దంపతుల మధ్య గత కొంతకాలంగా నిత్యం గొడవలు జరుగుతున్నాయి. నాగరత్నపై అనుమానం పెంచుకున్న నరసింహులు బుధవారం అర్థరాత్రి సమయంలో ఆమెతో మళ్లీ ఘర్షణకు దిగాడు. వివాదం ముదరడంతో ఇంట్లోని రోకలిబండను తీసుకుని నాగరత్న తలపై బలంగా బాదాడు.

ఈ దాడిలో తల పూర్తిగా పగిలి తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె స్పృహతప్పి కిందపడిపోయింది. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం కడపలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ మృత్యువుతో పోరాడుతూ నాగరత్న గురువారం మృతి చెందింది. మృతురాలికి నలుగురు పిల్లలు ఉండగా, ముగ్గురికి ఇప్పటికే వివాహాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అప్పటికే నిందితుడు నరసింహులు పరారయ్యాడు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

నకిలీ తాళంచెవితో

ఇంట్లో బంగారు ఆభరణాలు చోరీ

ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరు వన్‌టౌన్‌ పరిధిలో నకిలీ తాళంచెవిని ఉపయోగించి ఇంట్లో బంగారు ఆభరణాలు చోరీ చేసిన మహిళను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బంగారు అంగళ్ల వీధిలో నివాసం ఉంటున్న సుజాత కుటుంబ సభ్యులతో కలిసి ఈనెల 4న హైదరాబాద్‌కు వెళ్లగా.. అదే రోజు మధ్యాహ్నం ఆమెకు పరిచయమున్న రమాదేవి నకిలీ తాళంచెవితో ఇంటి తాళం తెరచి బీరువాలోని బంగారు ఆభరణాలను అపహరించింది. ఈ నెల 5న ఇంటికి తిరిగి వచ్చిన సుజాత బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన ఎస్‌ఐ మొయినుద్దీన్‌ ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా.. అప్పులు తీర్చుకునేందుకే చోరీకి పాల్పడినట్లు అంగీకరించింది. సుజాత వద్ద నుంచి తాళం చెవి వివరాలు తెలుసుకొని, శివాలయం సెంటర్‌ సమీపంలోని తాళాలు తయారు చేసే వ్యక్తితో నకిలీ తాళం చెవి తయారు చేయించుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆమెను 7న రాత్రి అరెస్ట్‌ చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. నిందితురాలు వద్ద నుంచి 58.57 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.

లంకమల్ల అటవీ ప్రాంతంలో అధికారుల దాడులు

ప్రొద్దుటూరు క్రైం, ఖాజీపేట : లంకమల్ల రిజర్వ్‌ఫారెస్ట్‌ పరిధిలో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న స్మగ్లర్లపై అటవీశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. గురువారం తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో ప్రొద్దుటూరు ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ హేమాంజలి ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. అధికారులు తెలిపిన వివరాల మేరకు.. నాగసానిపల్లె బీట్‌లోని బిక్కితిప్ప ప్రాంతంలో ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం అందడంతో అటవీశాఖ సిబ్బంది అక్కడికి చేరుకొని తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఎర్రచందనం అక్రమంగా తరలిస్తున్న స్మగ్లర్లను గుర్తించి దాడి చేశారు. అఽధికారుల రాకను పసిగట్టిన స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలను అక్కడే వదిలేసి చీకటిని ఆసరాగా తీసుకొని పరారయ్యారు. అటవీశాఖ అధికారులు ఘటనా స్థలం నుంచి 7 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. దుంగలు సుమారు 234 కిలోలు ఉంటాయని అధికారులు తెలిపారు. పరారైన స్మగ్లర్లను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా, స్మగ్లింగ్‌కు సంబంధించిన అనుమానాస్పద కార్యకలాపాలు కనిపించిన వెంటనే సమీపంలోని అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని ఎఫ్‌ఆర్‌ఓ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

● భార్యపై రోకలిబండతో దాడి

● చికిత్స పొందుతూ మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement