నా బిడ్డను ఆదుకోండి | - | Sakshi
Sakshi News home page

నా బిడ్డను ఆదుకోండి

Oct 9 2026 1:14 AM | Updated on Oct 9 2026 1:14 AM

రాయచోటి టౌన్‌ : ఒక్క చిన్న సైకిల్‌ ప్రమాదం ఆ పేద కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. 13 ఏళ్ల క్రితం కిందపడి తలకు దెబ్బతగలడంతో, రక్తం గడ్డకట్టి అది కాస్తా బ్రెయిన్‌ ట్యూమర్‌గా మారింది. తండ్రి జమాలుల్లా బాషా 60 ఏళ్ల వయసులో రైస్‌ మిల్లులో బస్తాలు మోస్తూ నెలకు రూ. 15,000 సంపాదిస్తుంటే.. అందులో రూ. 10,000 కేవలం కొడుకు మందులకే ఖర్చవుతోంది. ‘మా కళ్ల ముందే మా బిడ్డ కరిగిపోతున్నాడు.. ఎప్పుడు స్పృహ తప్పి పడిపోతాడో తెలీదు.. మేము లేని రోజు వాడిని ఎవరు చూస్తారు?‘ అని ఆ వృద్ధ దంపతులు రోదిస్తున్నారు. ఆపరేషన్‌ లేదా నెలవారీ మందుల ఖర్చుల కోసం ఈ నిరుపేద కుటుంబం దాతల సాయాన్ని కోరుతోంది. రాయచోటి కొత్తపల్లెలోని జీనద్‌ మజీద్‌ సమీపంలో నివసిస్తున్న జమాలుల్లా బాషా, చాంద్‌ బేగం దంపతుల చివరి కుమారుడు జమాలుద్దీన్‌ బాషా (23). జమాలుద్దీన్‌కు 10 ఏళ్ల వయసున్నప్పుడు పంటి నొప్పి మందు కోసం తండ్రి సైకిల్‌పై తీసుకెళ్తుండగా రాయచోటి చెక్‌పోస్ట్‌ వద్ద వెనక్కు పడిపోయాడు. అప్పట్లో తలకు చిన్న దెబ్బే తగిలినా, రక్తం రాకపోవడంతో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ, కొన్ని రోజుల తర్వాత బాలుడు హఠాత్తుగా స్పృహతప్పి పడిపోవడంతో ఆసుపత్రికి పరుగెత్తించారు. పరీక్షించిన వైద్యులు తలలో రక్తం గడ్డకట్టి, అది కాస్తా బ్రెయిన్‌ ట్యూమర్‌ గా మారిందని తేల్చారు.

13 ఏళ్ల ప్రదక్షిణలు..భారమైన ప్రాణం

కన్నబిడ్డను రక్షించుకోవడానికి ఆ తండ్రి రాయచోటి నుంచి కడప, కర్నూలులతో పాటు బెంగళూరులోని నిమ్‌హాన్స్‌, హైదరాబాద్‌లోని నిమ్స్‌ లాంటి పెద్ద పెద్ద ఆసుపత్రుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాడు. గతంలో ఏలూరులో ఆపరేషన్‌ చేయడానికి రూ.10 నుంచి రూ. 12 లక్షలు అవుతుందన్నారు. అంత డబ్బు ఆ హమాలీ దగ్గర లేకపోవడంతో ఆపరేషన్‌ వాయిదా పడింది. ఇప్పుడు కాలం దాటిపోవడంతో, సర్జరీ చేసినా సక్సెస్‌ రేట్‌ చాలా తక్కువని చెబుతూ వైద్యులు కేవలం మందులు రాసి పంపుతున్నారు. ప్రస్తుతం ఆ యువకుడు పైకి బాగా కనిపిస్తున్నా నడుస్తూ నడుస్తూనే స్పృహ తప్పి పడిపోతాడు... కూర్చుని కూర్చునే పడిపోతాడు.. ఏ క్షణాన కుప్పకూలిపోతాడో తెలియదు. ప్రాణాలు కాపాడుకోవడానికి తల్లిదండ్రుల్లో ఒకరు నిరంతరం కుమారుడి పక్కనే నీడలా కాపలా ఉండాల్సి వస్తోంది. ఆపరేషన్‌ లేదా నెలవారీ మందుల ఖర్చుల కోసం ఈ నిరుపేద కుటుంబం దాతల సాయాన్ని కోరుతోంది. సహాయం చేయాలనుకునే ఉదార హృదయులు నేరుగా 8897882387 నంబర్‌కు ఫోన్‌పేద్వారా సాయం అందించాలని కోరుతున్నారు.

చేజారిన పింఛన్‌ ఆశ

ప్రభుత్వం ఇచ్చే వికలాంగుల పింఛన్‌ అయినా వస్తే మందుల ఖర్చైనా వెళ్లుస్తుందని ఆశపడి సదరన్‌ సర్టిఫికెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వెరిఫికేషన్‌ కోసం ఫోన్‌కు వచ్చిన మెసేజ్‌ను సమయానికి చూసుకోకపోవడం వల్ల ప్రభుత్వ సాయం కూడా చేజారిపోయింది. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకుని తమకు పింఛన్‌ ఇప్పించాలని కోరుతున్నారు.

వృద్ధ హమాలీ కన్నీటి వేడుకోలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement