● దౌర్జన్యంగా చొరబడ్డారు!
● పోలీసులను ఆశ్రయించిన బాధితులు
కలకడ : రెవెన్యూ రికార్డుల్లో స్పష్టమైన ఆధారాలు, 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ భూ అనుభవం ఉన్నప్పటికీ.. కొందరు స్వార్థపరుల దౌర్జన్యం కారణంగా తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ అన్యాయమైన భూ ఆక్రమణ యత్నం, దౌర్జన్య ఘటన గురువారం అన్నమయ్య జిల్లా కలకడ మండలంలోని కదిరాయచెర్వు గ్రామంలో చోటుచేసుకుంది.
వివరాలు : కదిరాయచెర్వు గ్రామానికి చెందిన గౌరవం చలమయ్యగౌడ్ భార్య నాగమణి పేరిట అదే గ్రామం సమీపంలోని సర్వే నెంబర్: 486–2లో 2.50 ఎకరాల భూమి ఉంది. దీనికి సంబంధించి కలకడ రెవెన్యూ అధికారులు 06–09–2015న పట్టాధార్ పాస్‌పుస్తకం (నెంబర్: 494) కూడా మంజూరు చేశారు. అలాగే, గౌరవం శివయ్య భార్య గౌరవం మీనాక్షి పేరిట సర్వే నెంబర్: 486–4లో మరో 2.50 ఎకరాల భూమి ఉమ్మడి హక్కులతో ఉంది. ఈ ఇద్దరు మహిళలు గత 20 సంవత్సరాలుగా ఈ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
ఎప్పటిలాగే గురువారం బాధితులు తమ భూమిలో ఉలవ పంట సాగు చేయడానికి వెళ్లారు. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన షేక్ సాయిఫీర్ కుమారుడైన అల్లాబక్షు, అతని కుమారులు మహమ్మద్ బక్షు, అమర్ బక్షులు కనీస రికార్డులు లేకుండానే అక్కడకు చేరుకున్నారు. తమ భూమి ఎక్కడుందో కూడా చూసుకోకుండా, బాధితుల సాగుభూమిలోకి అక్రమంగా, ధౌర్జన్యంగా చొరబడ్డారు. పంట సాగును అడ్డుకోవడమే కాకుండా, అక్రమణను నిలదీసిన మహిళలపై నానా దుర్భాషలాడుతూ తీవ్ర దౌర్జన్యానికి తెగబడ్డారు.గ్రామంలోని కొందరు స్వార్థపరుల అండతోనే వీరు ఈ తరహా భూ ఆక్రమణలకు, మహిళలపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని బాధితులు ఆరోపిస్తూ కలకడ పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ వివాదంపై స్థానిక విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ రామకృష్ణను వివరణ కోరగా.. వివాదాస్పద సర్వే నంబర్లు 486–2, 486–4లలో అల్లాబక్షుకు గానీ, అతని కుటుంబ సభ్యులకు గానీ ఎలాంటి హక్కులు, రెవెన్యూ రికార్డులు లేవని స్పష్టం చేశారు. రికార్డులన్నీ బాధితుల పేరిటే స్పష్టంగా ఉన్నాయని ఆయన ధృవీకరించారు. బాధితులకు తక్షణమే న్యాయం చేసి రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.


