గాలివీడు : అన్నమయ్య జిల్లా గాలివీడు మండలంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జరిగిన రూ. 18 కోట్ల పనులపై కేంద్ర విజిలెన్స్ బృందం క్షేత్రస్థాయి మెరుపు తనిఖీలు చేపట్టింది ఉపాధి నిధుల దుర్వినియోగంపై రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి కేంద్ర మంత్రికి చేసిన ఫిర్యాదుతో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ సంజయ్‌కుమార్ నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగింది.కేంద్ర బృందం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించింది. కూలీలకు కాకుండా నిబంధనలకు విరుద్ధంగా యంత్రాలతో పనులు చేయడంపై అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులకు మంజూరైన పండ్లతోటలు, గోకులాలు, క్యాటిల్‌షెడ్లు, వాటర్‌షెడ్ పనుల నాణ్యతను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 12.50 కోట్లు కూలీల వేతనాలకు, రూ. 5.50 కోట్లు మెటీరియల్‌కు కేటాయించారు. ఇప్పటికే రూ. 4 కోట్లు చెల్లించగా, మరో రూ. 1.50 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉంది. వెండర్ కోడ్‌ను అడ్డుపెట్టుకుని రైతుల సొమ్మును సిబ్బంది తమ సొంత ఖాతాలకు మళ్లించినట్లు తేలితే క్రిమినల్ చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. రికార్డులు సక్రమంగా ఉన్న అర్హులకే నిధులు చెల్లిస్తామన్నారు. కరువు నేపథ్యంలో ఉపాధి హామీ పనిదినాలను పెంచాలని, వ్యవసాయాన్ని ఈ పథకంతో అనుసంధానం చేయాలని, ఫార్మ్ పాండ్లు మంజూరు చేయాలని రైతులు కోరగా కేంద్ర బృందం సానుకూలంగా స్పందించింది. ఈ తనిఖీల్లో డ్వామా పీడీ వెంకటరత్నం, ఏపీడీలు మధుబాబు, లక్ష్మీనరసయ్య పాల్గొన్నారు.
ఎంపీ మిథున్‌రెడ్డి ఫిర్యాదుతో కదిలిన
ఢిల్లీ బృందం


