– గ్రామంలో పేలిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్
సంబేపల్లె : మండల పరిధిలోని పలు గ్రామాల్లో సోమవారం రాత్రి ఉరుములతో కూడిన వర్షం కురిసింది. ఈ క్రమంలోనే రెడ్డివారిపల్లెగ్రామం నడిమిరాజుగారిపల్లెలో పిడుగుపాటుకు అదే గ్రామానికి చెందిన ఆర్. పాపులమ్మ ఇల్లు దెబ్బతింది. నిద్రపోతున్న సమయంలో ఒక్కసారిగా పిడుగు పడ్డంతో భయబ్రాంతులకు గురై నిద్రలో నుంచి ఉలిక్కిపడినట్లు ఆమె తెలిపారు. పిడుగుపాటుకు పక్కనున్న చెట్టుతో పాటు ఇంట్లోని టీవీ తదితర ఎలక్ట్రానిక్ పరికరాలు దగ్దమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పాటు ఇంటి ముందుభాగంలో ఉన్న రేకులు దెబ్బతిన్నాయి. అలాగే గ్రామంలోని సింగల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ పేలి పోయింది. దీంతో గ్రామంలో అంధకారం నెలకొందని గ్రామస్తులు తెలిపారు. పిడుగుపడిన ప్రాంతాన్ని రెవెన్యూ అధికారులు పరిశీలించి నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
లక్కిరెడ్డిపల్లి: మండలంలోని పందిళ్లపల్లి గ్రామం కస్పాలో సోమవారం రాత్రి పిడుగుపాటుకు జెర్సీ ఆవు మృతి చెందిందని రైతు అల్లాబకష్ తెలిపారు. ఆవులను పోషించుకుంటూ.. పాల ఉత్పత్తితో జీవనం సాగిస్తున్నానని... ఆవు మృతి చెందడంతో జీవనం కోల్పోయామని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మధ్యకాలంలోనే రూ. 90 వేలు కొనుగోలు చేసి ఆవును తీసుకొచ్చానని వాపోయాడు.
కేవీపల్లె : పిడుగుపాటుకు ఐదు మూగజీవాలు మృతి చెందిన సంఘటన మండలంలోని నూతనకాల్వ పంచాయతీ పెద్దకంభిరెడ్డిగారిపల్లెలో చేసుకుంది.పెద్దకంభిరెడ్డిగారిపల్లెకు చెందిన షేక్ దర్బార్బాష మేకలు, గొర్రెలు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం అర్ధరాత్రి సమయంలో ఉరుములు, మెరుపులతో కూడి భారీ వర్షం కురిసింది. ఇదే సమయంలో పిడుగుపడటంతో మూడు మేకలు, రెండు గొర్రెలు మృతి చెందాయి. ఒకే సారి ఐదు జీవాలు మృతి చెందడంతో సుమారు రూ. 80 వేలు నష్టపోయినట్లు దర్బార్ బాషా ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.


