పాము కాటుతో వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

పాము కాటుతో వ్యక్తి మృతి

Oct 7 2026 1:58 AM | Updated on Oct 7 2026 1:58 AM

ములకలచెరువు : పాముకాటుతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం మేరకు... గూడుపల్లెకు చెందిన రంగోళ్ల రంగప్ప(45) పొలం వద్దకు వెళ్లాడు. అక్కడ పనులు చేస్తుండగా పాము కాటు వేయడంతో అస్వస్థతకు గురయ్యాడు. అనంతరం కొద్ది సేపటికే మృత్యువాత పడ్డాడు. ఎంత సేపటికీ ఆయన ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా విగత జీవిగా పడివున్నాడు. దగ్గరలోని వైద్యులు పరిశీలించి అతను పాముకాటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు.

ఖననం చేసిన మృతదేహానికి పంచనామా

రాయచోటి (చిన్నమండెం) : చిన్నమండెం పోలీసు స్టేషన్‌ పరిధిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విద్యార్థిని మేఘన మృతదేహానికి పంచనామా పూర్తి చేశారు. మంగళవారం చిన్నమండెం తహసీల్దార్‌ రామానుజులు, ఎస్‌ఐ సుధాకర్‌, కడప ఫోరెన్సిక్‌ వైద్యులు మండల పరిధిలోని కేశపురం గ్రామంలో ఈ పంచనామా కార్యక్రమాన్ని చేశారు. మేఘన తండ్రి అమర్నాథ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిన్నమండెం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో భాగంగా మంగళవారం పాతిపెట్టిన మేఘన మృతదేహాన్ని వెలికితీసి పంచనామాను నిర్వహించారు. మేఘన వైఎస్సార్‌ కడప జిల్లా వీరబల్లి కేజీబీవీలో పదో తరగతి చదువుతున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్‌ 28వ తేదీన జ్వరం, కడుపునొప్పి కారణంగా తిరుపతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. మెరుగైన వైద్యం అందించడంలోనూ, పర్యవేక్షణలో అనుమానాలు ఉండటంతోనే ఈ పంచనామా కార్యక్రమాన్ని చేపట్టినట్లు సమాచారం.

భూ కబ్జా కేసులో

ముగ్గురి అరెస్ట్‌

మదనపల్లె టౌన్‌ : కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి అక్రమంగా భూముల్లోకి చొరబడి.. రాతి కూసాలను ధ్వంసం చేసిన ముగ్గురిని మదనపల్లె టూటౌన్‌ పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రెండవ పట్టణ ఎస్‌ఐ నాగేశ్వరరావు మీడియాకు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని నిమ్మనపల్లి రోడ్డు విద్యోదయ స్కూల్‌ సమీపంలో బిటి కళాశాల మాజీ ప్రిన్సిపల్‌ తులసీరాం నాయుడుకు వారసత్వ భూమి ఉందన్నారు. ఆ భూముల్లోకి దాయాదులైన చంద్రశేఖర్‌ నాయుడు, దేవేంద్ర నాయుడు, శశిధర నాయుడు దౌర్జన్యంగా ప్రవేశించి రాతి కూసాలను ధ్వంసం చేసి, కోర్టు ఆర్డర్‌ను ధిక్కరిస్తూ పదే పదే భూ కబ్జాకు యత్నించారని బాధితుడు జిల్లా ఎస్పీ ధీరజ్‌ కునిబిల్లికి ఫిర్యాదు చేయగా ఎస్పీ ఆదేశాలతో పై ముగ్గురిపై కేసు నమోదైంది అన్నారు. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వారిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

కాలువలోకి దూసుకెళ్లిన కారు

పులివెందుల రూరల్‌ : మండలంలోని ఉలిమెల్లకు వెళ్లే రోడ్డులో కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. పులివెందులకు చెందిన మహేంద్ర యాదవ్‌ తన వాహనంలో వేముల మండలం కొండ్రెడ్డిపల్లెకు వెళ్తుండగా రోడ్డుపై కుక్క అడ్డు రావడంతో అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు మహేంద్ర యాదవ్‌కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement