● డివైడర్‌ను ఢీకొని కారు బోల్తా
● ఒకరి మృతి
● ఐదుగురికి గాయాలు
● అందరూ మహారాష్ట్ర వాసులు
రొంపిచెర్ల : తిరుమలకు వెళ్లి దైవ దర్శనం చేసుకుని తిరిగి స్వగ్రామానికి వెళ్తూ.. తిరిగి రాని లోకాలకు వెళ్లిన సంఘటన అనంతపురం–చైన్నె జాతీయ రహదారిలోని రొంపిచెర్ల మండలంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్రలోని నాదేండ్ జిల్లా డిగ్లోర్ తాలుకాకు చెందిన ఆరుగురు తిరుమలకు వెళ్లారు. అక్కడ దేవున్ని దర్శించుకుని మంగళవారం ఉదయం కారులో తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే జాతీయ రహదారిలోని రొంపిచెర్ల మండలం బొనంవారిపల్లె వద్ద వేగంగా వెళ్తూ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురికి గాయాలు అయ్యాయి. వెంకటేష్ (47) మృతి చెందగా, ఆశ్వనీకుమార్(48), గణేష్ (47), వెంకటేష్ (48), సచిన్ (47), సంతోష్ విజయ్‌కుమార్(45) గాయ పడ్డారు. వారిని 108 వాహనంలో చికిత్స కోసం పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రొంపిచెర్ల పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, వివరాలు సేకరించారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


